Thursday, May 28, 2026
E-PAPER
Homeజాతీయంఈ దాడులు భ‌య‌పెట్ట‌లేవ్‌ : ఎంఏ బేబీ

ఈ దాడులు భ‌య‌పెట్ట‌లేవ్‌ : ఎంఏ బేబీ

- Advertisement -

ఈడీ కార్యాల‌యానికి సీపీఐ(ఎం) నిరసన ప్ర‌ద‌ర్శ‌న‌
ప‌లువురు నేత‌లు, కార్య‌కర్త‌ల‌కు గాయాలు
ఎంఏ బేబీ, బృందాక‌ర‌త్ స‌హా సీనియ‌ర్ నేత‌ల అరెస్టు
ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లోని పోలీస్ స్టేష‌న్ల‌కు త‌ర‌లింపు

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
​సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు, కేర‌ళం మాజీ ముఖ్య‌మంత్రి పినరయి విజయన్ ఇంటిపై ఈడీ దాడిని ఖండిస్తూ సీపీఐఐ(ఎం) ఈడీ కార్యాల‌యానికి నిరసన ప్ర‌ద‌ర్శన చేపట్టింది. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌పై ఢిల్లీ పోలీసులు దాడికి దిగారు. మండుటెండలో నిరసన తెలిపేందుకు వీధుల్లోకి వచ్చిన వారందరినీ పోలీసులు అరెస్టు చేసి చెదరగొట్టారు. ఈ దాడిలో సీనియర్ నాయకులు, ఇతరులు గాయపడ్డారు. మహిళలు, ఇతరులను ఈడ్చుకెళ్లారు. బుధ‌వారం నాడిక్క‌డ‌ ఖాన్ మార్కెట్‌ మెట్రో స్టేషన్ నుంచి ఈడీ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వ‌హించారు. ప్ల‌కార్డులు చేబూని మోడీ స‌ర్కార్‌, ఈడీకి వ్య‌తిరేకంగా నినాదాల హోరెత్తించారు. నిరసన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు జారీ చేశారు. ప్రదర్శనను అడ్డుకునేందుకు భారీ సంఖ్యలో పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. పృథ్వీరాజ్ రోడ్డులోని క్రిస్టియన్ శ్మశానవాటిక వద్దకు ప్రదర్శన చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సీపీఐ(ఎం) శ్రేణులకు, పోలీసుల‌కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్ర‌ద‌ర్శ‌న ముందుకు క‌ద‌ల‌డానికి వీల్లేద‌ని పోలీసులు ప‌ట్టుబట్ట‌డంతో సీపీఐ(ఎం) శ్రేణులు ప్ర‌ద‌ర్శ‌న ముందుకు సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ స‌మ‌యంలో సీపీఐ(ఎం) నేత‌లు, కార్య‌క‌ర్త‌ల ప‌ట్ల పోలీసులు దారుణంగా వ్య‌వ‌హ‌రించారు.

సీపీఐ(ఎం) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంఎ బేబీ, సీనియ‌ర్ నేత బృందాక‌ర‌త్‌, పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ ధావలే, మరియం ధావలే, విజయ్ కృష్ణన్, కేంద్ర క‌మిటీ సభ్యుడు విక్రమ్ సింగ్, సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి అనురాగ్ సక్సేనాలను పోలీసులు ఈడ్చుకెళ్లి వాహ‌నాల్లోకి ఎక్కించారు. ఈ ప్రదర్శనలో పాల్గొన్న బి. వెంకట్, పి. కృష్ణప్రసాద్, జయక్ సి థామస్, ఆదర్శ్ ఎం సాజీ, ఐషీ ఘోష్, సూరజ్ ఇలామన్, సుభాష్ చంద్రన్, అభిజిత్ మణిలాల్, మెహిన్ ఫాతిమా, పిటి షాజీ, బాబు, అఖిల్, ఎపి అన్వీర్, కృష్ణన్‌లపై కూడా దాడి జరిగింది. అరెస్టు చేసిన నాయకులను, కార్యకర్తలను ఢిల్లీ సరిహద్దుల్లోని పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్లారు. ఈ సంద‌ర్భంగా సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ మాట్లాడుతూ కేరళం మాజీ సీఎం పినరయి విజయన్ నివాసంపై ఈడీ జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇది ఒక అగ్రశ్రేణి ప్రతిపక్ష నాయకుడిపై బీజేపీ ప్రభుత్వం జరిపిన లక్షిత దాడి అని విమ‌ర్శించారు. ఇటువంటి చర్యలు పినరయి విజయన్‌ను గానీ, సీపీఐ(ఎం)ని గానీ ఏమాత్రం భయపెట్టలేవని అన్నారు. ఈ దాడిలో కేర‌ళ‌ంలోని యూడీఎఫ్‌ ప్రభుత్వానికి కూడా ఏమైనా ప్రమేయం ఉందా? అని ప్ర‌శ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -