కలుస్తాం

– ‘ఇండియా’కు కాస్త సమయమివ్వండి : వీవీప్యాట్‌లపై సీఈసీకి కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేశ్‌ లేఖ
న్యూఢిల్లీ : వీవీప్యాట్‌ల విషయంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జైరామ్‌ రమేశ్‌ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ) రాజీవ్‌ కుమార్‌కు లేఖ రాశారు. వీవీప్యాట్‌లపై తమ అభిప్రాయాన్ని తెలియజేయటానికి ఇండియా కూటమి నాయకుల బృందానికి సీఈసీని, ఎన్నికల అధికారులను కలిసేందుకు అవకాశాన్ని కల్పించాలని కోరారు. ఇందుకు తమకు కొంత సమయం కేటాయించాలని పేర్కొన్నారు. కూటమి తీర్మానం ఆధారంగా వీవీప్యాట్‌ల ఉపయోగంపై సలహాలివ్వటానికి, చర్చించటానికి ‘ఇండియా’ పార్టీల నాయకులు ఈసీఐ అపాయింట్‌మెంట్‌ కోరారని లేఖలో ఆయన వివరించారు. ” తీర్మానం కాపీని అందించటం, చర్చించటం కోసం ఈసీఐతో సమావేశం కావటానికి మేం ప్రయత్నిస్తున్నాం. కానీ ఇప్పటి వరకూ ఇది సఫలం కాలేదు” అని ఆయన పేర్కొన్నారు. ”మిమ్మల్ని, మీ సహౌద్యోగులను ముగ్గురు, నలుగురు సభ్యుల ‘ఇండియా’ బృందం కలవటానికి, వీవీప్యాట్‌లపై మా అభిప్రాయాన్ని తెలియజేయటానికి కొన్ని నిమిషాలు కేటాయించాలని నేను మరోసారి అభ్యర్థిస్తున్నాను” అని జైరాం రమేశ్‌ వివరించారు. ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపై ‘ఇండియా’ కూటమిలోని పలు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే, వీవీప్యాట్‌లను వంద శాతం లెక్కించాలనే డిమాండ్‌ను సైతం అవి వినిపిస్తున్నాయి.

Spread the love