– ప్రయివేటుకు అప్పగిస్తే ప్రజల మనుగడకే ప్రమాదం
– సంఘటితమై ఉద్యమిద్దాం..వేలాన్ని అడ్డుకుందాం
– ఎర్రజెండా ఎల్లవేళలా అండగా ఉంటుంది
– బెల్లంపల్లిలో ప్రారంభమైన సింగరేణి పరిరక్షణ బస్సు యాత్ర
– ఘన స్వాగతం పలికిన కార్మికులు, పార్టీ శ్రేణులు
– నేడు శ్రీరాంపూర్‌లో పర్యటించనున్న యాత్ర
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి, మంచిర్యాల
తెలంగాణ మణిమకుటంగా వెలుగొందుతున్న సింగరేణిని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.. భావితరాల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన అవసరం ఉంది. ఈ సంస్థ ప్రయివేటు చేతిలో పెడితే సంస్థ మనుగడతో పాటు ప్రజల జీవనానికే ప్రమాదం ఏర్పడుతుందని వక్తలు పేర్కొన్నారు. సింగరేణి ప్రయివేటీకరణను వ్యతిరేకించడంతో పాటు శ్రావణపల్లి బొగ్గు బ్లాకు వేలాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) సింగరేణి పరిరక్షణ బస్సు యాత్రను చేపట్టింది. రాష్ట్రంలోని కోల్‌బెల్ట్ ఏరియాలో వారం రోజుల పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్, పైళ్ల ఆశయ్య యాత్ర చేపడుతున్నారు. ఈ యాత్ర సోమవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మొదలు కాగా.. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్య అతిథిగా జెండా ఊపి ప్రారంభించారు. మంగళవారం సైతం మంచిర్యాల జిల్లాలో ఈ యాత్ర కొనసాగనుంది.
ప్రయివేటీకరిస్తే మనుగడే ప్రమాదం..!
లక్షలాది మందికి ప్రత్యక్షంగా..పరోక్షంగా బతుకునిస్తున్న సింగరేణి సంస్థ ప్రయివేటు చేతిల్లోకి వెళ్తే దాని మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బీఆర్‌ఎస్ హయాంలో రెండు బొగ్గు బ్లాకులను ప్రయివేటుకు అప్పగించగా.. తాజాగా కాంగ్రెస్ హయాంలో శ్రావణపల్లి బొగ్గుబ్లాకుకు వేలం పాట వేయడాన్ని కార్మికక్షేత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా తప్పుబడుతోంది. కార్మికవర్గంతో పాటు ప్రజల్లోనూ ప్రభుత్వాల చర్యలపై చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఉద్యమించాలని భావిస్తోంది.
బల్బు వెలగాలంటే బొగ్గు బావి ఉండాలి
గుడిసెలో బల్బు వెలగాలంటే బొగ్గు బావి తప్పనిసరిగా ఉండాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. సింగరేణి పరిరక్షణ బస్సు యాత్రకు నాయకత్వం వహిస్తున్న వీరయ్య యాత్ర ప్రారంభ సందర్భంగా మాట్లాడారు. సింగరేణిని రక్షించుకోవడం అందరి బాధ్యత అని గుర్తు చేశారు. సింగరేణి యాజమాన్యం బొగ్గు వెలికి తీయడమే కాకుండా కరెంటును కూడా ఉత్పత్తి చేస్తోందని చెప్పారు. సింగరేణి యూనిట్‌కు రూ.4కు అందిస్తే, ప్రయివేటు చేతుల్లోకి వెళ్తే యూనిట్ విద్యుత్‌కు రూ.18వసూలు చేస్తుందని తెలిపారు. సింగరేణి ప్రయివేటు చేతుల్లోకి వెళ్తే పేదల గుడిసెల్లో బల్బు ఎలా వెలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో మోడీ వచ్చిన తర్వాత కోల్‌ఇండియా, సింగరేణిలోనూ ప్రయివేటు వాళ్లకు హక్కులు కల్పిస్తూ చట్టం తీసుకొచ్చారని గుర్తు చేశారు. విదేశీయులు కూడా బొగ్గును తవ్వుకోవచ్చనే చట్టాలు చేస్తే వీటిని కాంగ్రెస్ కూడా సమర్థించిందని తెలిపారు. వేలం పాట పెడితే కోల్‌ఇండియా, సింగరేణి సంస్థలు ప్రయివేటుతో పోటీపడి దక్కించుకోవాలని చెబుతున్నాయని పేర్కొన్నారు. సింగరేణి వెలికి తీసిన బొగ్గు రూ.4వేలకు టన్ను చొప్పున ఇస్తే అదానీ కంపెనీ రూ.18వేలకు టన్ను చొప్పున విక్రయిస్తున్నారని తెలిపారు. బీజేపీకి ఎనిమిది ఎంపీ సీట్లు ఇస్తే ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో కూర్చొని వేలం పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందు పార్టీ శ్రేణులు, కార్మికులు పెద్ద ఎత్తున తరలొచ్చి సింగరేణి పరిరక్షణ బస్సు యాత్రకు ఘన స్వాగతం పలికారు. బస్సు యాత్ర ప్రారంభ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మంద నరసింహారావు, సీపీఐ(ఎం), ప్రజా సంఘాల నాయకులు దాసరి రాజేశ్వరి, గోమాస ప్రకాష్, ఎర్రం పున్నం, కనికరపు అశోక్, అబ్బోజు రమణ, దాగం శ్రీకాంత్, దుంపల రంజిత్‌కుమార్, బోడెంకి చందు, దూలం శ్రీనివాస్, అల్లి రాజేందర్, గుల్ల బాలాజీ పాల్గొన్నారు.
సింగరేణిని అమ్ముతుంటే ఊరుకుంటామా : పైళ్ల ఆశయ్య, రాష్ట్ర కమిటీ సభ్యుడు
మన వేలితో మన కన్నునే పొడుచుకునేలా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇది వరకు కేంద్రం చేసిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉధృత పోరాటం జరగడంతో వెనక్కి తగ్గింది. ఆంధ్రాలో ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం జరిగితే అక్కడా కేంద్రం వెనక్కి తగ్గింది. ఇక్కడ సింగరేణిని ప్రయివేటీకరిస్తామంటే ఊరుకుంటామా..? బొగ్గు బ్లాకుల వేలాన్ని ప్రభుత్వం విరమించుకోవాలి.
ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం : సంకె రవి, సీపీఐ(ఎం) మంచిర్యాల జిల్లా కార్యదర్శి
సింగరేణి ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకును వేలం వేయడాన్ని విరమించుకోవాలి. ఇందుకు జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావించి సీఎంతో మాట్లాడాలి. బొగ్గు బ్లాకు వేలాన్ని నిలిపివేయకపోతే గత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు పట్టిన గతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పడుతుంది.