కరెంటుపై ధరల పిడుగు

On electricity Price lightning– చైనా, రష్యాపై అమెరికా ఆంక్షల ఎఫెక్ట్‌
– రాష్ట్ర ప్రాజెక్టులపైనా ధరల ప్రభావం
– సోలార్‌ ప్లాంట్ల నిర్మాణాల నిలిపివేత?
– ప్రాజెక్టుల వ్యయం పెరుగుతుందని మొత్తుకుంటున్న కాంట్రాక్టర్లు
– భారీగా పెరిగిన కాపర్‌, అల్యూమినియం ధరలు
”బొగ్గు వినియోగం తగ్గించాలి. సోలార్‌, విండ్‌ వంటి పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించాలి. ప్రపంచం కాలుష్య కాసారంలోకి దిగజారుతుంది. భూతాపం పెరగకుండా, రక్షణ చర్యలు చేపట్టాలి” అగ్రరాజ్యం అమెరికా వల్లించే సుద్దపూస మాటలు ఇవి. దానికి ప్రధాని మోడీ తానా తందానా అంటూ, మీ నొప్పికి మేం మందు రాస్తాం అంటూ ప్రపంచవేదికలపై ‘ఆహా…ఒహౌ’ అనే ఉపన్యాసాలు దంచి కొడుతున్నారు. 2070 నాటికి దేశంలో కర్బన ఉద్గారాలు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నట్టు ప్రకటించారు. అదే సమయంలో అగ్రరాజ్యం అమెరికా విద్యుదుత్పత్తికి అత్యవసరమైన రాగి, అల్యూమినియం ధాతువుల ధరల్ని అమాంతం పెంచేసి, పర్యావరణ సూక్తుల వ్యాపారానికి నాంది పలికింది. ఎదురుచెప్పే ధైర్యం లేని కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని నోరెళ్లబెట్టి చూస్తూ, వీలైతే జనానికిచ్చే సబ్సిడీల్లో కోత పెడతామంటున్నది. చైనా, రష్యా వంటి దేశాల రాగి, అల్యూమినియం దిగుమతులపై అమెరికా సామ్రాజ్యవాదం ఆంక్షలు విధించి, అంతర్జాతీయ వ్యాపారంలో తానే రారాజుగా నిలవాలని కాంక్షిస్తుంది. దానికి ప్రధాని మోడీ ‘జీ హుజూర్‌’ అంటూ అడుగులకు మడుగులొత్తుతున్నారు. అంతిమంగా కరెంటు ఖరీదై, జనంపైనే ఆర్థికభారాలు పడేపరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఎస్‌ఎస్‌ఆర్‌ శాస్త్రి
థర్మల్‌ విద్కుత్కేంద్రాల వల్ల కాలుష్యం పెరుగుతుందనీ, అందువల్ల ప్రత్యామ్నాయ ఇంధన వినియోగాలవైపు మళ్లాలని అగ్రరాజ్యం అమెరికా అంతర్జాతీయ వేదికలపై సూక్తులు వల్లిస్తున్న విషయం తెలిసిందే. అమెరికా ఆడమన్నట్టు ఆడుతున్న దేశ ప్రధాని నరేంద్రమోడీ 2070 నాటికి దేశంలో కర్బన ఉద్గారాలు లేకుండా చేస్తామని హామీ కూడా ఇచ్చారు. అందుకోసం సోలార్‌, విండ్‌, అణువిద్యుత్‌ వంటి ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. ఫలితంగా దేశంలో పునరుత్పాదక ఇంధనాలకు ప్రాధాన్యత ఏర్పడింది. దీన్ని ఆసరా చేసుకున్న అగ్రరాజ్యం అమెరికా హఠాత్తుగా విద్యుత్‌రంగానికి అత్యవసరమైన రాగి (కాపర్‌), అల్యూమినియం ఖనిజాల ధరల్ని అమాంతం పెంచేసింది. అంతర్జాతీయంగా కాపర్‌, అల్యూమినియం ఖనిజాలు దక్షిణ అమెరికాలోని చిలీలో అధికంగా ఉన్నాయి. ప్రపంచం తవ్విన రాగి సరఫరాలో చిలీ దేశంలోనే మూడింట ఒక వంతు వాటా ఉంది. మరోవైపు చైనా నుంచి ఎగుమతి అయ్యే రాగి, అల్యూమినియంపై అమెరికా వాణిజ్య ఆంక్షలు విధించింది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని సాకుగా చూపుతూ కాపర్‌ ఎగుమతుల్లో అగ్రగామిగా ఉన్న రష్యాపైనా అమెరికా ఆంక్షలు విధించింది. దీనితో ప్రపంచ దేశాలు తప్పనిసరై అమెరికా నుంచే రాగి, అల్యూమినియం ఖనిజాలను దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. గత ఏడాది 20 శాతం ధరలు పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఒకేసారి 23 శాతం ధరల్ని అమెరికా పెంచేసింది. ఈ ప్రభావం విద్యుత్‌రంగంపై తీవ్రంగా పడింది. రాగి, అల్యూమినియం ఖనిజాలను విద్యుదుత్పత్తిలో ప్రధానంగా వాడతారు. ఈ రెండు లోహాలు వేగవంతమైన విద్యుత్‌ ప్రవాహకాలుగా పనిచేస్తాయి. టర్బైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ తీగలు సహా అన్నింటికీ రాగి, అల్యూమినియం వినియోగం తప్పనిసరి. అలాగే ఇండ్ల కరెంటు వైరింగ్‌లోనూ ఈ లోహాల వినియోగం అధికంగా ఉంటుంది. పరిశ్రమలు, భారీ కర్మాగారాల్లోనూ ఈ రెండు లోహాల వినియోగం తప్పనిసరి. మొత్తం విద్యుత్‌ పరిశ్రమ ఈ రెండు లోహాలపైనే ఆధారపడి ఉంది. దీనిపై అగ్రరాజ్యం అమెరికా అవకాశం చూసి దెబ్బకొట్టింది. ప్రపంచవ్యాప్తంగా అత్యవసరమైన విద్యుత్‌రంగాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. భారతదేశంలోని విద్యుత్‌ ప్రాజెక్టులపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది. థర్మల్‌ కేంద్రాల వినియోగాన్ని క్రమేణా తగ్గిస్తూ, పునరుత్పాదక ఇంధన వినియోగం వైపు దేశం అడుగులు వేస్తున్నది. దానికోసం అధికంగా సోలార్‌ విద్యుత్‌ను ప్రోత్సహిస్తున్నది. సోలార్‌ ప్రాజెక్టుల్లో వినియోగించే ఫోటోవోల్టాయిక్‌ (పీవీ) ఫ్రేమ్‌లు, పరికరాలు సూర్యరశ్మిని గ్రహించి విద్యుత్‌ శక్తిగా మారుస్తాయి. ఈ పీవీల తయారీలో రాగి, అల్యూమినియంతోనపాటు ఇతర ధాతువులను వినియోగిస్తారు.
ఒకప్పుడు సోలార్‌ విద్యుత్‌ ఒక్క యూనిట్‌ ధర రూ.23 నుంచి రూ.18 వరకు ఉండేది. ఇప్పుడు సాంకేతికత అభివృద్ధి చెందడంతో యూనిట్‌ రేటు రూ.2.80 పైసల నుంచి రూ.2.40 పైసలకు తగ్గిపోయింది. సోలార్‌ చౌకైన విద్యుత్‌గా అందుబాటులోకి వస్తున్న తరుణంలో వాటిపై కాపర్‌, అల్యూమినియం ధరల పెంపు భారం పడింది. థర్మల్‌ కేంద్రాలతో ఇప్పటికే చేసుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై (పీపీఏ) ఈ ప్రభావం భారీగానే పడుతుంది. ప్రాజెక్టుల వ్యయ అంచనాలు పెరగడంతో సరఫరాదారులు తమ క్లయింట్‌లతో నిబంధనలను మళ్లీ సవరించాలని కోరుతున్నారు. దీనివల్ల విద్యుత్కేంద్రాల నిర్మాణంలో జాప్యం జరుగుతుంది. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల బ్యాలెన్స్‌ ఆఫ్‌ సిస్టం (బీఓఎస్‌) ధర ఇప్పటికే దాదాపు 3.5 శాతం పెరిగిందని ఎనర్జీ ప్రొక్యూర్‌మెంట్‌ అధికారులు చెప్తున్నారు. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లోని పరికరాల్లో రాగి ముఖ్యమైన పదార్థం. సోలార్‌ ప్రాజెక్టుల నిర్మాణంలో ఒక మెగావాట్‌కి దాదాపు ఐదు టన్నుల రాగి అవసరమవుతుందని అంచనా. అలాగే పవన విద్యుత్‌ (విండ్‌)లో ఆన్‌షోర్‌, ఆఫ్‌షోర్‌ విండ్‌ ఫామ్‌లకు ఒక్కో మెగావాట్‌కు 4.3 టన్నుల నుంచి 9.6 టన్నుల కాపర్‌ కంటెంట్‌ అవసరమవుతుందని విద్యుత్‌ ఇంజినీర్లు చెప్తున్నారు. రాగి ధాతువు ఉత్పత్తి దక్షిణ అమెరికాలో కేంద్రీకృతమై ఉంది. ముఖ్యంగా చిలీలో ప్రపంచం తవ్విన రాగి సరఫరాలో మూడింట ఒక వంతు వాటా ఉంది.దానికి తోడు పొరుగు దేశాలపై అమెరికా వాణిజ్య ఆంక్షల ప్రభావం కూడా ఈ ఉత్పత్తులపై ఆర్థిక భారాన్ని పెంచుతున్నాయి.
భారం ఇలా…
ఉదాహరణకు గృహ అవసరాల కోసం 1 మెగావాట్‌ త్రీ ఫేజ్‌ రూఫ్‌టాప్‌ సోలార్‌ను ఏర్పాటు చేసుకోవాలంటే టీజీరెడ్కో నిర్ణయించిన ప్రాజెక్ట్‌ కాస్ట్‌ రూ.83,700 అవుతుంది. దీనికి దరఖాస్తు రుసుం, నెట్‌మీటరింగ్‌ చార్జీలు అదనం. ప్రభుత్వం రూ.14,588 సబ్సిడీగా ఇస్తుంది. వినియోగదారుడు మొత్తంగా రూ.73,242 ఆర్థికభారాన్ని భరించాల్సి ఉంటుంది. కాపర్‌, అల్యూమినియం ధరల పెంపుతో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని తగ్గించాలని యోచిస్తుంది. దానితో పాటు ఇంటి వైరింగ్‌ ఖర్చు పెరుగుతుంది. ఇవన్నీ కలుపుకుంటే అదనపు ఆర్థికభారం మరో రూ.15 వేల నుంచి రూ.20వేల వరకు పడే అవకాశం ఉన్నట్టు సోలార్‌ ఏజెన్సీలు చెప్తున్నాయి. ఇది కేవలం వ్యక్తిగత గృహాలకు సంబంధించిన లెక్క మాత్రమే. రాష్ట్రావసరాల కోసం ఏర్పాటు చేసే సోలార్‌ ప్లాంట్లపై ఈ భారం మరింత ఎక్కువగా ఉంటుంది.
పరోక్షభారం
ొ ఎన్‌ జానయ్య, వైస్‌ చైర్మెన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌
ొ తెలంగాణరాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీరెడ్కో)
కాపర్‌, అల్యూమినియం ధరల పెంపు సోలార్‌ విద్యుదుత్పత్తిపై పరోక్షంగా ఉంటుంది. రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్యానెల్స్‌లో అతి స్వల్పంగానే కాపర్‌ను వినియోగిస్తారు. ఇండ్ల వైరింగ్‌పై మాత్రం ఆర్థిక భారం పెరుగుతుంది. కరెంటు వైరింగ్‌లో తప్పనిసరిగా కాపర్‌ను వినియోగిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో 0.5 మెగావాట్‌ నుంచి 4 మెగావాట్ల వరకే గృహ వినియోగానికి ప్రధానమంత్రి సూర్యఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన స్కీం ద్వారా సబ్సిడీ ఇస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 6వేల మెగావాట్ల సోలార్‌ విద్యుదుత్పత్తి ఉంది. కొత్త కేంద్రాల నిర్మాణంపై పెరిగిన ధరల భారం ఉంటుంది. అది యూనిట్‌ ధర నిర్ణయంపై ప్రభావం చూపొచ్చు.పరోక్షభారం
– ఎన్‌ జానయ్య, వైస్‌ చైర్మెన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌
– తెలంగాణరాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీరెడ్కో)
కాపర్‌, అల్యూమినియం ధరల పెంపు సోలార్‌ విద్యుదుత్పత్తిపై పరోక్షంగా ఉంటుంది. రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్యానెల్స్‌లో అతి స్వల్పంగానే కాపర్‌ను వినియోగిస్తారు. ఇండ్ల వైరింగ్‌పై మాత్రం ఆర్థిక భారం పెరుగుతుంది. కరెంటు వైరింగ్‌లో తప్పనిసరిగా కాపర్‌ను వినియోగిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో 0.5 మెగావాట్‌ నుంచి 4 మెగావాట్ల వరకే గృహ వినియోగానికి ప్రధానమంత్రి సూర్యఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన స్కీం ద్వారా సబ్సిడీ ఇస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 6వేల మెగావాట్ల సోలార్‌ విద్యుదుత్పత్తి ఉంది. కొత్త కేంద్రాల నిర్మాణంపై పెరిగిన ధరల భారం ఉంటుంది. అది యూనిట్‌ ధర నిర్ణయంపై ప్రభావం చూపొచ్చు.

Spread the love