ఢిల్లీ గులాములా? తెలంగాణ బిడ్డలా?

ఢిల్లీ గులాములా? తెలంగాణ బిడ్డలా?– రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారు కాంగ్రెస్‌కు అధికారమిస్తే రాష్టం అధోగతే
– బీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతోంది
– డీకే శివకుమార్‌ రాష్ట్రంపై విషం కక్కుతున్నారు : న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో, హైదరాబాద్‌
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం జలవిహార్‌లో ఏర్పాటు చేసిన న్యాయవాదుల అత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ డిల్లీ గులాంలు కావాలా? తెలంగాణ బిడ్డలు కావాలా? రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. కాంగ్రెస్‌ గద్దెనెక్కితే ముఖ్యమంత్రి సీటు కోసం కొట్లాడెందుకే సమయం దొరకదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్‌ రెడ్డి ఎన్నికల్లో డబ్బలు పంచకూడదని మాట్లాడం విడ్డూరంగా ఉందని అన్నారు. బీజీపీ బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని కొట్టి పారేసారు. ఒకటి రెండు సీట్లు కూడా రాని ఆ పార్టీ ముఖ్యమంత్రిని ఎలా చేస్తుందని ప్రశ్నించారు. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతోందని చెప్పారు.. ఓకప్పుడు కరెంట్‌ కోసం కాపలా కాసిన రైతులకు నేడు 24 గంటల ఉచిత కరెంట్‌ అందిస్తున్నామని చెప్పారు. 2014లో 68 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా, నేడు 3.5 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోందన్నారు.
రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 56 వేల కోట్లున్న ఐటీ ఎగుమతులు, నేడు 2.41 లక్షల కోట్లకు చేరుకున్నాయని, ఐటీ ఉద్యోగుల సంఖ్య 3లక్షల నుంచి 10 లక్షలకు చేరుకుందని గుర్తు చేశారు. తెలంగాణ తలసరి ఆదాయం తొమ్మిదిన్నరేండ్లలో రూ. 1.14 లక్షల నుంచి, రూ.3.17 లక్షలకు చేరుకుందని అన్నారు. రైతుబంధు, రైతు భీమా, కళ్యాణ లక్ష్మి,ఆసరా పెన్షన్లు, మిషన్‌ భగీరథ తదితర సంక్షేమ పథకాలు చరిత్రలో నిలుస్తాయని అన్నారు. ఒకవైపు ఐటీ, మరో వైపు వ్యవసాయం… రెండు రంగాలను సమానంగా ప్రగతి పథంలో నడిపిస్తున్నామని చెప్పారు. 2014లో తెలంగాణ ఎలా ఉండేది…ఇప్పుడెలా ఉందనేది విజ్ఞులు ఆలోచించి, బీఆర్‌ఎస్‌కు మరోసారి ఆవకాశం ఇవ్వాలని కోరారు.
డీకే శివకుమార్‌ పై కేటీఆర్‌ ఫైర్‌
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లక్షమందికి ఉద్యోగాలు కల్పించనున్న ఫాక్స్‌కాన్‌ కంపెనీని బెంగళూరుకు మార్చాలని గత నెలలో ఆ కంపెనీ సీఈవోకు డీకే లేఖ రాశారని మంత్రి మండిపడ్డారు. త్వరలో తెలంగాణలో ఫ్రెండ్లీ ప్రభుత్వం వస్తుంది, అక్కడ ఉన్న ప్రముఖ కంపెనీలన్నీంటిని ఇక్కడికి తరలిస్తామని అనడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాకపోతే ఇక్కడి కంపెనీలను బెంగుళూరుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణపై విషం కక్కుతున్న డీకే వైఖరిని మంత్రి తప్పు పట్టారు.
న్యాయవాదులపై వరాల జల్లు
న్యాయవాదులపై మంత్రి కేటీఆర్‌ వరాల జల్లు కురిపించారు.న్యాయవాదుల ట్రస్టుకు ఇప్పుడున్న రూ.100 కోట్లకు అదనంగా మరో రూ.400 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు.
యువ న్యాయవాదులకు ఇస్తున్న స్టయిఫండ్‌ రూ. 5వేల నుంచి రూ.10 వేలకు పెంచడంతో పాటు ఉచిత ప్రమాద భీమాను రెండింతలు చేయనున్నట్టు చెప్పారు.తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. రాష్ట్రంలో మరో సారి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాగానే న్యాయవాదుల పెండింగ్‌ డిమాండ్లన్నీ పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. కాంగ్రెస్‌, బీజేపికి చెందిన పలువురు అడ్వకేట్లు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ సమక్షంలో గులాబి కండువా కప్పుకున్నారు.

Spread the love