పాస్‌బుక్‌లు, రేషన్‌కార్డులున్న వారికే రుణమాఫీ!

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన రూ.2 లక్షల పంట రుణాల మాఫీపై కసరత్తు చేస్తోంది. పంద్రాగస్టులోపు రుణమాఫీ అమలుకు విధివిధానాలు ఖరారు చేయడంలో నిమగ్నమైంది. అయితే పాస్‌బుక్‌లు, రేషన్‌ కార్డులను ప్రామాణికంగా తీసుకుని అవి ఉన్న వారికే రుణమాఫీ అమలు చేసేలా తాజాగా ఓ ప్రతిపాదనను అధికారులు ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆదాయపన్ను చెల్లించే వారు, ఉద్యోగులను దీని నుంచి మినహాయించాలని మంత్రిమండలి సమావేశ ఎజెండాలో ప్రతిపాదించినట్లు తెలిసింది. పంట రుణాల మాఫీపై ఈ వారంలో సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించడంతో వ్యవసాయాధికారులు రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకున్న వారి జాబితాను బ్యాంకుల నుంచి తెప్పిస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఈ జాబితా అధికారులకు చేరనుంది. ఈలోపు రుణమాఫీని ఎవరెవరికి అమలు చేయాలనే దానిపై వ్యవసాయశాఖ వివిధ ప్రామాణికాల ప్రాతిపదికన విస్తృతస్థాయిలో అధ్యయనం చేస్తోందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Spread the love