– నేడు వాయుగుండంగా మారే అవకాశం
– 27, 28 తేదీల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు : ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
అమరావతి : హిందూ మహాసముద్రంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలపడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఈ నెల 25న దక్షిణ బంగాళాఖాతం మధ్య భాగాలపై వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్‌డి రోణంకి కూర్మనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మరో రెండు రోజుల్లో వాయువ్య దిశగా తమిళనాడు- శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందన్నారు. వాయుగుండం ప్రభావంతో ఈ నెల 27 నుంచి 30 వరకు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతుల పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయోలా ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు / చెట్లు పడిపోకుండా నిలబడేందుకు కర్రలతో సపోర్టు అందించాలని సూచించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.