– తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు శీలం సత్యనారాయణరెడ్డి
– సీఐటీయూ, వ్యకాస, రైతు సంఘం పట్టణ, మండల కమిటీల జనరల్ బాడీ సమావేశం
నవతెలంగాణ – సత్తుపల్లి
క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో ఈనెల 10న రాష్ట్రవ్యాప్తంగా సీఐటీయూ, వ్యకాస, రైతు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జరిగే జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు శీలం సత్యనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం స్థానిక రావి వీర వెంకయ్య (ప్రజాసంఘాల) భవన్ లో జరిగిన సీఐటీయూ, వ్యకాస, రైతు సంఘం పట్టణ, మండల కమిటీల జనరల్ బాడీ సమావేశంలో సత్యనారాయణరెడ్డి ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను వేగంగా అమలు చేస్తోందని విమర్శించారు. అనేక పోరాటాలతో సాధించుకున్న దేశ స్వాతంత్ర్యాన్ని విదేశీ, కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. నాడు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో, నేడు కార్పొరేట్ పెట్టుబడిదారులు, మతోన్మాదులకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, ప్రజాతంత్రవాదులు పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో దేశాన్ని కాపాడుకునేందుకు సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆగస్టు 10న చేపడుతున్న రాష్ట్రవ్యాప్త ‘జైల్ భరో’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. నాలుగు లేబర్ కోడ్లను, విద్యుత్ సవరణ బిల్లు-2025ను తక్షణమే రద్దు చేయాలన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ. 42 వేలు చెల్లించాలని కోరారు. స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలన్నారు. ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించి సంవత్సరానికి 200 రోజుల పని, రోజుకు రూ. 700/- వేతనం చెల్లించాలన్నారు.
స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం మద్దతు ధరల చట్టాన్ని తీసుకురావాలన్నారు. రైతులు, పేదలకు సమగ్ర రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు.
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, సార్వత్రిక ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసరాలను ప్రజలకు అందించాలని డిమాండ్ చేశారు. పరీక్షా పత్రాల లీకేజీలపై సమగ్ర విచారణ జరిపి కారకులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఆరోగ్య హక్కును కల్పిస్తూ ప్రజా సంక్షేమానికి నిధులు పెంచాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు కొలికపోగు సర్వేశ్వరరావు, రైతు సంఘం డివిజన్ కార్యదర్శి రావుల రాజబాబు, మోరంపూడి వెంకట్రావు, కువ్వారపు లక్ష్మణరావు, రమణ, చావా రమేష్, బండి వేలాద్రి, చెరుకు శ్రీనివాస్, మట్టపర్తి సత్యనారాయణ, కుమార్, ఎలగం రాములు, వలి, రఫీ, సంపత్, ప్రభాకర్, వెంకటేశ్వరరావు, నాగేంద్ర, సకీన, విజయలక్ష్మి పాల్గొన్నారు.



