‘సేవ్‌ డెమోక్రసీ’ నినాదాలతో హోరెత్తిన మణిపూర్‌ అసెంబ్లీ

నవతెలంగాణ – ఇంఫాల్‌:‘సేవ్‌ డెమోక్రసీ ‘ నినాదాలతో మంగళవారం మణిపూర్‌ అసెంబ్లీ హోరెత్తింది. సుమారు నాలుగు నెలల హింసాత్మక ఘటనల అనంతరం రాష్ట్ర అసెంబ్లీ మంగళవారం సమావేశమైన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలు ‘ సేవ్‌ డెమోక్రసీ ‘ అని నినాదాలు చేయడంతో మణిపూర్‌ స్పీకర్‌ తోక్‌చోమ్‌ సత్యబ్రత సభను అరగంట పాటు వాయిదావేశారు. ప్రశ్నోత్తరాల సెషన్‌ లేదా ప్రైవేట్‌ మెంబర్‌ మోషన్‌ నిర్వహించలేదు. అసెంబ్లీ ప్రారంభం కాగానే మృతులకు సంతాపం ప్రకటిస్తూ.. కేవలం రెండు నిమిషాలు మౌనం పాటించడంపై కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేవలం ఒక్కరోజు మాత్రమే సమావేశం ప్రజా ప్రయోజనాల కోసం కాదని  ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐదురోజులు పొడిగించాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.బీరేన్‌ సింగ్‌, కాగ్రెస్‌ నేత ఒక్రోమ్‌ ఒబోబిల మధ్య మాటలయుద్ధం నెలకొంది. మణిపూర్‌ అసెంబ్లీ చివరిసారిగా బడ్జెట్‌ సమావేశాల కోసం ఫిబ్రవరి-మార్చిలో సమావేశమైంది.  ఏడాదిలో కనీసం రెండుసార్లు అసెంబ్లీ సమావేశమవాల్సి వుంటుంది. గత సమావేశం మార్చిలో జరిగింది. సెప్టెంబరు 2 లోగా మరో సమావేశం జరగాల్సి వుండటంతో గవర్నర్ ఆమోదం మేరకు నేడు అసెంబ్లీ సమావేశమైంది.   అయితే ఈ ఒక్కరోజు సమావేశాన్ని కుకీ జోమి గిరిజన సంఘాలు వ్యతిరేకించాయి. ఈ కమ్యూనిటీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరయ్యారు. మొయితీ కమ్యూనిటీ ప్రాంతంలో ఉన్న అసెంబ్లీకి ఈ సమయంలో ప్రయాణించడం సురక్షితం కాదని వారు పేర్కొన్నారు. దీంతో అసెంబ్లీ సెషన్‌ను వాయిదా వేయాలని వారు గవర్నర్‌ను అభ్యర్థించారు. అయితే ఈ అభ్యర్థనను ప్రభుత్వం తిరస్కరించింది. నాగా ఎమ్మెల్యేలు ఈసెషన్‌కి హాజరయ్యారు. ప్రస్తుతం కొనసాగుతున్న హింసాత్మక పరిస్థితులపై కొన్ని తీర్మానాలను ఈ సెషన్‌లో ఆమోదించే అవకాశం ఉందని రాష్ట్ర బిజెపి వర్గాలు సూచించాయి. ఈ అసెంబ్లీ ఆమోదించిన ఏ తీర్మానానికి కట్టుబడి ఉండమని గిరిజన సంఘాలు తీర్మానించాయి.

Spread the love