Thursday, July 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమెడికిల్‌ క్లీనిక్‌‌లు!

మెడికిల్‌ క్లీనిక్‌‌లు!

- Advertisement -

మెడికల్‌ ‌షాపుల పేరిట క్లినిక్‌‌లు
హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-‌మల్కాజిగిరి జిల్లాల్లో
పుట్టగొడుగుల్లా నిర్వహణ సర్జరీలు మినహా అన్నీ చేస్తున్న కేటుగాళ్లు
చోద్యం చూస్తూ, మామూళ్ల మత్తులో ఔషధ నియంత్రణ శాఖ!
వైద్య, ఆరోగ్యశాఖపై నెట్టేస్తున్న ‘డీసీఏ’ అధికారులు

నవతెలంగాణ-సిటీబ్యూరో
మెడికల్ షాప్ అంటే.. వైద్యుడు మందులు రాస్తే ఆ చీటీ ఆధారంగా ఔషధాలు విక్రయించే దుకాణం. కానీ హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-‌మల్కాజిగిరి జిల్లాల్లో మాత్రం దీనికి పూర్తి భిన్నం. కొందరు దుకాణాల ఓనర్లు మెడికల్‌ షాప్‌‌ల మాటున క్లినిక్ లు నిర్వహిస్తూ పేదల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. మందులు అమ్మడం పక్కనపెట్టి రోగులకు మందులు సిఫార్సు చేస్తున్నారు. అడ్డగోలుగా డోస్ ఎక్కువగా ఉండే ఔషధాలను విక్రయిస్తున్నారు. సర్జరీలు తప్పా అన్ని రకాలు వైద్యం చేసేస్తున్నారు. ఎప్పటికప్పుడూ తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలన్సిన ఔషధ నియంత్రణ శాఖలో కొందరు అధికారుల అవినీతి వల్ల శాఖ మొత్తంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలను అరికట్టాల్సిన బాధ్యత ఔషధ నియంత్రణ శాఖపై ఉన్నప్పటికీ, పెద్దగా చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆక్రమ క్లినిక్‌‌లపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తమది కాదని, అది వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలోకి వస్తుందని చెబుతూ.. ఒక శాఖ నుంచి మరో శాఖపైకి నెట్టేస్తున్నారు.

​అక్రమ దందా..
మెడికల్ షాపుల పేరిట నడుస్తున్న అక్రమ వైద్యం దాందా విస్తరిస్తోంది. మందులు విక్రయించాల్సిన మెడికల్ షాపులు అనుమతుల్లేకుండానే క్లినిక్‌‌లుగా మారిపోతున్నాయి. కొన్ని చోట్ల చిన్న ఆస్పత్రుల్లా వైద్య సేవలందుతున్నాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-‌మల్కాజిగిరి జిల్లాల్లో దాదాపు 25వేలకు పైగా మెడికల్‌ ‌షాపులు ఉండగా.. ఇందులో సగానికిపైగా, ఏ షాపులో చూసినా పక్కన, లేదా వెనుక ఓ క్లినిక్ ఉంటోంది. నిష్ణాతు లైన వైద్యులు వస్తారని, ఫలానా సమయాల్లో అందుబాటులో ఉంటారని పెద్ద అక్షరాలతో బోర్డులు కనిపిస్తాయి తప్పితే అక్కడకు ఏ వైద్యుడూ, ఎప్పుడూ రారు. ఆర్ఎంపీలు, పీఎంపీలే పెద్ద వైద్యుల అవతారమెత్తి మెడికల్ షాప్‌‌ల చాటున దందా నడుపుతున్నారు. సర్జరీలు మినహా అన్ని రకాల వైద్యం చేస్తున్నారు.

మేడ్చల్ లో 15 రోజుల కిందట ఓ నకిలీ డాక్టర్
సంతానం కలిగేందుకు ఇంజక్షన్లు ఇస్తూ పోలీసులకు అడ్డంగా దొరికాడు. వైద్యంపై కొద్దిగా అవగాహన ఉంటే చాలు హవా నడిపించేస్తున్నారు. ఏడాదికి దాదాపు రూ.20వేల వరకు చెల్లించి ఫార్మసీ సర్టిఫికెట్ పొంది మెడికల్ షాప్ ఏర్పాటు చేస్తున్నారు. ఫస్ట్ ఎయిడ్ సెంటర్, పాలీ క్లినిక్, క్లినిక్ పేరుతో మెడికల్‌ షాప్ పక్కనే దుకాణం తెరిచేస్తున్నారు. 2, 3 బెడ్లు, సెలైన్లు పెట్టడానికి మంచాలు, మెడలో స్టెతస్కోప్ వేసుకుని వైద్యుడిలా చాంబర్ ‌పెట్టేసుకుంటున్నారు. స్వల్ప అస్వస్థతకూ రూ.వందల విలువైన మాత్రలు రాసి వారి మెడికల్ షాప్లలోనే కొనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతుందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అర్హతలు లేకపోయినా
ఏదైనా చిన్న జబ్బు చేస్తే జనరల్‌ ఆస్పత్రులకు వెళ్లలేని పేదలు చుట్టు పక్కల, దగ్గరలో ఉన్న మెడికల్ షాపులనే ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితిని కొందరు నిర్వాహకులు తమకు అనుకూలంగా మార్చుకుని మెడికల్ షాపులనే క్లినిక్ లుగా మార్చేశారు. ఫార్మసీ లైసెన్స్ ను మందులు విక్రయించడానికి మాత్రమే పొందినా, కొందరు క్లినిక్ లు నిర్వహిస్తున్నారు. జ్వరం, జలుబు, కడుపు నొప్పి వంటి సాధారణ వ్యాధులకు అక్కడే చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్నిచోట్ల ఇంజెక్షన్లు వేయడం, సెలైన్ లు పెట్టడం వంటివి చేస్తుంటే.. మరికొన్ని చోట్ల ఆర్ఎంపీలతో చేతులు కలిపి రోగులకు నాడీ పట్టించి మందులు ఇచ్చేస్తున్నారు. పరీక్షల్లేకుండానే మందులు ఇవ్వడం, అవసరం లేని ఇంజెక్షన్లు వేయడం వల్ల కొన్ని సందర్భాల్లో తీవ్ర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవేమీ తెలియని ప్రజలు.. తక్కువ ఖర్చుతో దగ్గరలోనే చికిత్స లభిస్తుందని భావించి ఈ మెడికల్ షాపులపై ఆధారపడుతున్నారు. నగరంలోని మెడికల్‌ ‌షాపుల్లో జరుగుతున్న అక్రమ వైద్యంపై అధికారులు సమగ్ర తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘనతో క్లినిక్‌‌లు నిర్వహిస్తున్న షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిటీజనులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -