వాషింగ్టన్ : అమెరికా–ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బుధవారం ఐదు శాతానికిపైగా ఎగిశాయి. ఇరాన్‌తో కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు ప్రకటించడంతో పాటుగా ఇకపై ఇరాన్ నాయకత్వంతో చర్చలు కొనసాగించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఈ పరిణామాల ప్రభావంతో అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యుటిఐ) ముడి చమురు ధర బ్యారెల్‌పై ధర 5.8 శాతం ఎగిసి 74.50 డాలర్లకు చేరింది. అంతర్జాతీయ ప్రమాణమైన బ్రెంట్ క్రూడ్ ధర కూడా బ్యారెల్‌పై 5.65 శాతం ఎగిసి 78.35 డాలర్లుగా నమోదయ్యింది. జూన్‌లో రెండు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం తర్వాత హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తగ్గి వాణిజ్య నౌకల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ.. తాజా సైనిక చర్యలతో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. ఇరాన్‌కు ఇచ్చిన ఆంక్షల సడలింపును కూడా అమెరికా రద్దు చేయడంతో ప్రపంచ ఇంధన సరఫరాపై అనిశ్చితి నెలకొంది. చమురు ధరల తాజా పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచే అవకాశముందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో ఇప్పటికే ఇంధన ధరలు అధిక స్థాయిలో ఉండగా.. ఈ పరిణామాలు ద్రవ్యోల్బణ నియంత్రణతో పాటు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత్‌లోనూ ధరలు పెరగడంతో ఆర్‌బిఐ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు.
ఎగిసిన ముడి చమురు ధరలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



