Thursday, July 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయందళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి

- Advertisement -

వారికి అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
కమిటీలు, నివేదికల పేరుతో బీజేపీ సర్కారు కాలయాపన : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం తక్షణమే రాజ్యాంగపరమైన చర్యలు చేపట్టి దళిత క్రైస్తవుల వాస్తవ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా వారికి ఎస్సీ హోదా కల్పించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. దీనిపై మోడీ ప్రభుత్వం కమిటీలు, నివేదికల పేరుతో దశాబ్దాలుగా కాలయాపన చేస్తున్నదని ఆయన విమర్శించారు. దళిత క్రైస్తవులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీనిచ్చారు. తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన దళిత క్రైస్తవ రిజర్వేషన్ల సమాలోచన సభలో మైనారిటీ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ తో కలిసి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభలో వచ్చిన సూచనలు, మేధావుల అభిప్రాయాలను ఒక సమగ్ర నివేదికగా రూపొందించి ముఖ్యమంత్రికి అందజేస్తామని తెలిపారు. అసెంబ్లీలోనూ, పార్లమెంట్ లోనూ ఈ అంశంపై ఒత్తిడి తీసుకొచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అణగారిన వర్గాలు, మైనారిటీలు, దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రాజ్యాంగబద్ధమైన హక్కు అని లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. దళితులు మతం మారినా వారి పట్ల వివక్ష కొనసాగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వివక్ష మారనప్పుడు హక్కులు ఎందుకు మారాలి? అని ఆయన ప్రశ్నించారు. మతం మారినంత మాత్రాన దళిత క్రైస్తవుల సామాజిక స్థితిగతులు, వారు ఎదుర్కొంటున్న కుల వివక్ష, పేదరికం మారడం లేదని, అలాంటప్పుడు వారికి దక్కాల్సిన రాజ్యాంగబద్ధమైన హక్కులను నిరాకరించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ సమస్యను కేవలం ఒక మతపరమైన అంశంగా చూడకూడదని అన్నారు. భారత రాజ్యాంగం ముందు నిలిచిన సామాజిక న్యాయ ప్రశ్నగా దీన్ని గుర్తించాలని సూచించారు. న్యాయాన్ని వాయిదా వేయడమంటే న్యాయాన్ని నిరాకరించడమేనంటూ కేంద్రం తీరుపై మండిపడ్డారు.

​​కేంద్రానికి సిఫారసు చేయాలి -తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ వినతి
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేయాలని తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ (టీసీజేఏసీ) కోరింది. ఈ మేరకు జేఏసీ నాయకులు మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ అజహరుద్దీన్ లకు వినతిపత్రం సమర్పించారు. అజహరుద్దీన్ మాట్లాడుతూ దళిత క్రైస్తవుల డిమాండ్‌ ‌ను రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందనీ, అనుకూల ఫలితాల దిశగా కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కిరెన్ రిజిజు దృష్టికి తీసుకెళతామని హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -