గిరిజనుల భూములు లాక్కోవడం సరికాదు
తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ ఖండన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అటవీ శాఖ రాష్ట్రవ్యాప్తంగా పోడు భూముల రీ సర్వే పేరుతో గిరిజనులు సాగు చేస్తున్న భూములను మొక్కలు నాటడం పేరుతో లాక్కోవడాన్ని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. పోడు భూముల రీ సర్వే చేయడం తక్షణమే ఆపాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మిడియం బాబురావు, ప్రధాన కార్యదర్శి పూసమ్ సచిన్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.దశాబ్ద కాలంపాటు పోరాటం చేసి పోడు భూములకు హక్కు పత్రాలు సాధించామని తెలిపారు. ఇంకా అనేక మంది పోడు సాగుదారులకు పట్టాలు రాలేదని పేర్కొన్నారు. వాటికి హక్కు పత్రాలు ఇవ్వకుండా పోడు భూముల రీ సర్వే పేరుతో భూములను లాక్కునే ప్రయత్నం చేయడం తగదని హెచ్చరించారు. అటవీ హక్కుల చట్టం 2006 కనీస సాగు పదెకరాల వరకు పట్టాలు ఇవ్వొచ్చని చెప్పిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం అటవీశాఖ అనేకమంది పోడు సాగుదారులకు రెండెకరాలు, మూడెకరాలకు మించి పట్టా ఇవ్వకుండా మోసం చేసిందని విమర్శించారు. ఇచ్చిన పట్టాల్లో కూడా ప్లాంటేషన్ పేరుతో 30 వేల ఎకరాలకుపైగా భూమిని అటవీశాఖ లాక్కునే ప్రయత్నం చేసిందని తెలిపారు. ఇప్పుడు మళ్లీ రీసర్వే పేరుతో ఆదివాసీలు సాగు చేస్తున్న భూములను లాక్కోవడం మొక్కలు నాటడం పేరుతో తీసుకోవడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. గిరిజనులపై అటవీ శాఖ జులుంను తక్షణమే ఆపాలనీ, రీ సర్వేను ఆపేంత వరకు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. గతంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి పోడు సాగుదారునికి హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజనులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉండే చర్యలను తక్షణమే ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
పోడు భూముల రీ సర్వే ఆపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



