Friday, August 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతుమ్మిడిహెట్టిపై సెప్టెంబర్‌ 1న సమావేశం

తుమ్మిడిహెట్టిపై సెప్టెంబర్‌ 1న సమావేశం

- Advertisement -

తెలంగాణ, మహారాష్ర్టలతో సీడబ్ల్యూసీ సమావేశం
హాజరు కానున్న రెండు రాష్ర్టాల అధికారులు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలపై సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రాజెక్ట్‌ అప్రైజల్‌ ‌(సౌత్‌) ‌డైరెక్టర్‌ ‌నీరజ్‌‌కుమార్‌ ‌శర్మ మీటింగ్‌ నోటీస్‌ ‌జారీ చేశారు. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మెన్‌ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సేవా భవన్‌లో జరిగే ఈ సమావేశంలో తెలంగాణ, మహారాష్ట్ర జలవనరుల శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి నేపథ్యంలోనే కేంద్ర జల సంఘం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై సీఎం మే 26న మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసి, రెండు రాష్ట్రాల మధ్య సమావేశం ఏర్పాటు చేసి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించాలని కోరారు. ఈ అంశంపై ప్రధానమంత్రి, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌.పాటిల్‌ లేఖ రాసి కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ క్రమంలో సీడబ్ల్యూసీ రెండు రాష్ర్టాల మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

​అంగీకారం కుదిరేనా?
మహారాష్ట్ర గతంలో అంగీకరించిన 148 మీటర్ల ఎత్తుకు బదులుగా 152 మీటర్ల ఎత్తు ఉండేలా అంగీకారం సాధించేందుకు తెలంగాణ ప్రయత్నిస్తోంది. 148 మీటర్ల వద్ద అవసరమైన నీటిని గ్రావిటీ ద్వారా తీసుకోవడం సాధ్యం కాదని, భారీ పంపులు వినియోగిస్తే విద్యుత్‌ వ్యయం పెరుగుతుందని కేంద్రానికి వివరించింది. తక్కువ విద్యుత్‌ వ్యయంతో, దీర్ఘకాలికంగా రాష్ట్రానికి ప్రయోజనం కలిగేలా ప్రాజెక్టును నిర్మించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ వాదన. సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ అధ్యయనాల ప్రకారం జలమట్టం పెంపుతో అదనపు ముంపు పరిమితంగానే ఉంటుందని కూడా ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే వెనుకబడిన, కరవు ప్రభావిత ప్రాంతాలకు సాగు, తాగు నీరందించే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -