Friday, August 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనేపాల్‌లో చిక్కుకున్న 23 మంది తెలంగాణవాసులు

నేపాల్‌లో చిక్కుకున్న 23 మంది తెలంగాణవాసులు

- Advertisement -

వారి భద్రత కోసం ప్రత్యేక చర్యలు
కేంద్ర ప్రభుత్వానికి వివరాలను పంపించాం
న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌, సచివాలయంలో హెల్ప్‌‌లైన్‌
కుటుంబ సభ్యులు ఆందోళన చెందొద్దు : మంత్రి పొంగులేటి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల నేపథ్యంలో అక్కడ ఉన్న తెలంగాణకు చెందిన పర్యాటకులు, యాత్రికులు, ఇతర పౌరుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు అందించిన సమాచారం ఆధారంగా ప్రాథమికంగా నేపాల్‌‌లో 23 మంది తెలంగాణవాసులు చిక్కుకున్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. నేపాల్‌ ‌పరిస్థితులపై గురువారం మంత్రి పొంగులేటి విపత్తు నిర్వహణశాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గుర్తించిన వారి వివరాలను కేంద్ర విదేశాంగ శాఖకు పంపించామని తెలిపారు. వారి ప్రస్తుత పరిస్థితి, ఆచూకీ తెలుసుకోవడంతోపాటు అవసరమైన సహాయం అందించేందుకు కేంద్ర విదేశాంగ శాఖ, కాఠ్మాండు భారత రాయబార కార్యాలయం, నేపాల్ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం సమన్వయం చేస్తోందని తెలిపారు. నేపాల్‌లో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్, కోఆర్డినేషన్ సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు.

హైదరాబాద్‌లోని బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సాధారణ పరిపాలన శాఖ (ఎన్‌ఆర్‌ఐ విభాగం) ఆధ్వర్యంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, బాధితుల కుటుంబాల నుంచి సమాచారం సేకరించి సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తున్నామని వెల్లడించారు. నేపాల్‌లో నెలకొన్న పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఇంకా ఎవరైనా తెలంగాణ వాసులు నేపాల్‌లో చిక్కుకుంటే వారి కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వానికి సమాచారం అందించాలని కోరారు. బాధితుల పేరు, పాస్‌పోర్ట్ వివరాలు, మొబైల్ నెంబర్, నేపాల్‌లో చివరిగా ఉన్న ప్రదేశం, ట్రావెల్/టూర్ ఆపరేటర్ వివరాలు, కుటుంబ సభ్యుల సంప్రదింపు నెంబర్లు అందించాలని సూచించారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసి అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణ భవన్ అధికారులు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, కాఠ్మాండు భారత రాయబార కార్యాలయం, నేపాల్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని వివరించారు.

పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి, రాష్ట్రానికి చెందిన ప్రతి ఒక్కరి భద్రతకు అవసరమైన సహాయాన్ని అందిస్తుందని స్పష్టం చేశారు. నేపాల్‌లో చోటుచేసుకున్న విషాదకర పరిస్థితులపై మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విపత్తులో చిక్కుకున్న తెలంగాణ ప్రజలకు సాధ్యమైనంత త్వరగా సహాయం అందేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వివరించారు. నేపాల్‌లో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

తెలంగాణ భవన్ ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు
9871999044, 9949351270, 9618597969
తెలంగాణ సచివాలయం ప్రత్యేక కంట్రోల్ రూమ్
నేపాల్‌లో చిక్కుకున్న లేదా ప్రభావితమైన తెలంగాణ ప్రజల కుటుంబ సభ్యులు సమాచారం కోసం
క్రింది అధికారులను సంప్రదించాలని మంత్రి సూచించారు.
ఎస్ లక్ష్మీనారాయణ – అసిస్టెంట్ సెక్రటరీ – 9885371189
కె శ్రీనివాస్ రెడ్డి – సెక్షన్ ఆఫీసర్ – 7997959754
ఇ చిట్టిబాబు – సెక్షన్ ఆఫీసర్ – 9440854433

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -