Thursday, July 23, 2026
E-PAPER
Homeక్రైమ్కరీం'నగరం'లో 'మిడ్‌నైట్‌' హార్రర్‌

కరీం’నగరం’లో ‘మిడ్‌నైట్‌’ హార్రర్‌

- Advertisement -

పీఎంజే సీన్‌ రిపీట్‌
కత్తులు, తుపాకులతో ఇంట్లోకి చొరబడి దోపిడీ
66 తులాల పసిడి, రూ.21 లక్షలు 
పట్టుకెళ్లిన దంగల్‌ బ్యాచ్‌
సొంత అల్లుడే కుట్రదారుడా?
వావిలాలపల్లిలోనూ మరో ఘటన
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయప్రతినిధి / కరీంనగర్‌ క్రైమ్‌

​కరీం’నగరం’లో మరో దోపిడీ కలకలం సృష్టించింది. ప్రజలంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో భగత్‌‌నగర్‌‌లో అజ్మత్‌ అలీ ఇంట్లో భారీ దోపిడీ జరిగింది. మే 3న నగరంలో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెల్లరీ ఘటన తరహాలోనే.. మరోసారి గుర్తుతెలియని రౌడీ ముఠా తుపాకులు, కత్తులతో బీభత్సం సృష్టించింది. ఇందుకు సంబంధించి పోలీసులు, బాధితుల వివ‌రాల ప్ర‌‌కారం..​మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సరిగ్గా 12:30 గంటల సమయం.. భగత్‌నగర్‌లోని వృద్ధుడు అజ్మత్‌ అలీ నివాసంలో అంతా నిశ్శబ్దంగా ఉంది. రోజూలాగే ఆ ఇంటి సందులోని లైట్‌ను ఆఫ్‌ చేసి ఇంట్లోకి వెళ్తున్న అజ్మత్‌ అలీని లక్ష్యంగా చేసుకుని, ముందుగా రెక్కీ నిర్వహించిన సుమారు ఐదు నుంచి ఎనిమిది మంది అగంతకులు ఒక్కసారిగా పంజా విసిరారు. మాస్కులు, గ్లౌజులు ధరించి వేచి ఉన్న దుండగులు క్షణాల వ్యవధిలో గోడలు దూకి ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో వారి నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు-కాళ్లను తాళ్లతో కట్టేసి ఒకే గదిలో బంధించారు. ప్రతిఘటించడానికి ప్రయత్నించిన అజ్మత్‌ అలీపై నకిలీ తుపాకి (టారు పిస్టోల్‌)తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. భయబ్రాంతులకు గురిచేసిన దుండగులు సుమారు గంటన్నరపాటు ఇంట్లోనే తిరుగుతూ బీరువాలను పగలగొట్టారు. బాధితుల ఒంటిపై ఉన్న ఆభరణాలు, చెవికమ్మలను కూడా బలవంతంగా కట్‌ చేసి మరీ లాక్కొన్నారు. మొత్తంగా 66 తులాల బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి, రూ. 21 లక్షలు దోచుకుని, బాధితుల ఇంట్లోనే ఉన్న రెండు ద్విచక్ర వాహనాలపై ఉడాయించారు.

​ఎస్కేప్‌ప్లాన్‌ బైపాస్‌ రోడ్డు నుంచే..
దోపిడీ అనంతరం బయటకు వచ్చిన ముఠా, అజ్మత్‌ అలీ ఇంట్లో అద్దెకు ఉండే వారి రెండు బైకులను ఎత్తుకెళ్లింది. ఇంటి తలుపులు బయటి నుంచి లాక్‌ చేసి పరారయ్యారు. తెల్లవారు జామున బైపాస్‌ రోడ్డులోని బృందావన్‌ ఫంక్షన్‌ హాల్‌, సిరిసిల్ల బైపాస్‌ మీదుగా పెట్రోల్‌ బంక్‌కు చేరుకున్నారు. ఒక బైకులో ఉన్న వ్యక్తి రూ.500 ఇచ్చి రూ.250 పెట్రోల్‌ కొట్టించుకున్నాడు. రెండో బైక్‌ ట్యాంక్‌ తాళం చెవి లేకపోవడంతో పెట్రోల్‌ పోయడం వీలుపడలేదు. బంక్‌ సిబ్బంది మిగతా డబ్బులు తీసుకెళ్లమని అరిచినా పట్టించుకోకుండా వరంగల్‌ వైపు వెళ్లిపోయారు. హుజురాబాద్‌ సమీపంలోని పెద్దపాపయ్యపల్లి వద్ద ఆ రెండు బైకులను పడేసి ఆ ముఠా పరారైంది. లారీలు ఎక్కి వెళ్లారా? లేక రైలెక్కి ఉత్తరాదికి జంప్‌ అయ్యారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

​వావిలాలపల్లి ఇంట్లోనూ రూ.లక్షలు చోరీ
​ఒకవైపు భగత్‌నగర్‌ అర్ధరాత్రి దంగల్‌ నడుస్తుంటే.. మరోవైపు పట్టపగలే వావిలాలపల్లి తులసినగర్‌లోనూ మరో చోరీ జరిగింది. ఎస్‌బీఐ ఉద్యోగి తోట విజరు కుమార్‌ భార్య సౌజన్య మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి తాళం వేసి డి-మార్ట్‌కు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి దొంగలు బీరువాలోని రూ.4 లక్షలు ఎత్తుకెళ్లారు.

​ఇది అల్లుడి కుట్రేనా..?
​పోలీసు కమిషనర్‌ గౌష్‌ ఆలం, అడిషనల్‌ డీసీపీ వెంకట రమణ, ఏసీపీలు ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్‌ టీమ్‌, సైబర్‌ వింగ్‌, డాగ్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. ప్రాథమిక విచారణలో ఓ షాకింగ్‌ కోణం వెలుగులోకి వచ్చింది. అజ్మత్‌ అలీకి కరీంనగర్‌లో కోట్లాది రూపాయల ఆస్తులు, కాంప్లెక్సులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ఆయన అల్లుడు కరీంనగర్‌లో క్లాత్‌ స్టోర్‌ నడిపి, ఇటీవల కుటుంబానికి చెప్పకుండా వెళ్లిపోయాడు. ఆ అల్లుడి బంధువుల్లో కొందరికి నేర చరిత్ర ఉంది. కరీంనగర్‌లో గతంలో జరిగిన పీఎంజే జ్యువెలరీ చోరీ వార్తలు విన్న సదరు అల్లుడు.. అదే మోడల్‌లో మామ ఇంట్లో దోపిడీకి మీరట్‌ నుంచి ‘హిందీ గ్యాంగ్‌’ను పంపించి ఉంటాడని బలంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి సందులు, నగదు ఎక్కడుందో డైరెక్ట్‌గా వెళ్లడం ఈ అనుమా నాలకు బలం చేకూరుస్తోంది. ఏదేమైనా పీఎంజే షాపు ఘటన మరువకముందే భగత్‌నగర్‌ నివాసంలో మారణాయుధాలతో సాగిన ఈ దోపిడీ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. హుజురాబాద్‌, వరంగల్‌, కాజీపేట ప్రాంతాల్లో కరీంనగర్‌ కమిషనరేట్‌ పోలీస్‌ టీమ్స్‌ గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -