కిటెక్స్‌ సంస్థకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన

KTR - SITEX– రూ.1200 కోట్ల పెట్టుబడితో ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో భారీ తయారీ యూనిట్‌కు కిటెక్స్‌ సంస్థ పూనుకున్నది. గురువారం రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌లో కిటెక్స్‌ సంస్థ తన ఇంటిగ్రేటెడ్‌ ఫైబర్‌ టు అప్పారెల్‌ తయారీ క్లస్టర్‌ను ఆ సంస్థ చైర్మెన్‌ సాబుజేకబ్‌తో కలిసి మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలో తన పెట్టుబడులను భారీగా విస్తరించి, పెద్ద ఎత్తున వస్త్ర తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న కిటెక్స్‌ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. ఆ సంస్థకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం నుంచి అందిస్తామని హామీనిచ్చారు. కిటెక్స్‌ సంస్ధ తయారీ క్లస్టర్ల ఏర్పాటు ద్వారా రోజువారీగా ప్రపంచంలోనే అత్యధిక దుస్తులను ఉత్పత్తి చేస్తున్న తయారీ ప్లాంట్‌ ఉన్న ప్రాంతాల్లో ఒకటిగా తెలంగాణ నిలువబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జాకేబ్‌ మాట్లాడుతూ.. ప్రతిరోజూ ఏడు లక్షల దుస్తులను తమ సంస్థ ఉత్పత్తి చేయబోతుందని తెలిపారు. వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి తయారీ కేంద్రం నిర్మాణం పూర్తవుతుందనీ, వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇప్పటికే కాకతీయ మెగా టెక్స్టైల్‌ పార్కులో తన భారీ తయారీ యూనిట్‌ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నామనీ, ఈ డిసెంబర్‌ నాటికి వరంగల్‌ కేంద్రంగా తన కార్యకలాపాలను ప్రారంభిస్తామని చెప్పారు.
రూ.350 కోట్ల సింటెక్స్‌ తయారీ యూనిట్‌కు శంకుస్థాపన
వెల్స్పన్‌ సంస్థ తన సబ్సిడరీ సంస్థ ఆధ్వర్యంలో చందన్‌వెల్లిలో ఏర్పాటు చేయనున్న సింటెక్స్‌ తయారీ యూనిట్‌కు మంత్రి కేటీఆర్‌ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వెల్ప్సన్‌ వరల్డ్‌ చైర్మెన్‌ బీకే గోయెంకా పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ..రాష్ట్రంలో ఆ సంస్థ నూతన యూనిట్‌ను ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Spread the love