నేడు వరంగల్‌లో పర్యటించనున్న మంత్రి కేటీఆర్‌

నవతెలంగాణ – హైదరాబాద్
పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌ శనివారం వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. గీసుగొండ మండలంలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో రూ.840 కోట్లతో యంగ్‌వన్‌ కంపెనీ ఎవర్‌ టాప్‌ టెక్స్‌టైల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పేరుతో చేపట్టే వస్త్ర పరిశ్రమల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. పార్కు నుంచి మంత్రి కేటీఆర్‌ హెలిక్యాప్టర్‌ ద్వారా ఖిలావరంగల్‌కు చేరుకుంటారు. మొదట వరంగల్‌లోని నర్సంపేట రోడ్డులో ఉన్న ఓ సిటీలో నిర్మాణం పూర్తి చేసుకున్న వరంగల్‌తూర్పు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కేటీఆర్‌ ప్రారంభిస్తారు. ఆ తర్వాత సమీపంలో ఉన్న అజంజాహిమిల్స్‌ గ్రౌండ్‌లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీవోసీ) నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేస్తారు. అనంతరం దేశాయిపేట వద్ద రూ.12.60 కోట్లతో ప్రభుత్వం నిర్మించిన 200 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను, వరంగల్‌లో రూ.135 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న పదహారు స్మార్టు రోడ్లను కూడా వరంగల్‌చౌరస్తా వద్ద కేటీఆర్‌ ప్రారంభిస్తారు. రూ.75 కోట్లతో వరంగల్‌ మోడ్రన్‌ బస్‌స్టేషన్‌, రూ.313 కోట్లతో ఇన్నర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణ పనులకూ ఆయన శంకుస్థాపన చేస్తారు. కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ(కుడా) జీ ఫ్లస్‌ ఫైవ్‌ అంతస్తులతో బస్‌స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అజంజాహిమిల్స్‌ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ జరగనుంది. 50 వేల మందితో నిర్వహించనున్న ఈ సభలో మంత్రి కేటీఆర్‌ పాల్గొని ప్రసంగిస్తారని వరంగల్‌తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ తెలిపారు. ఈ మేరకు సభాస్థలిని శుక్రవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

Spread the love