– ఎమ్మెల్యేకు మంత్రి పదవితో పాటు బాలాజీ సింగ్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని వినతి
నవతెలంగాణ-ఆమనగల్
కల్వకుర్తి శాసన సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు ఎగిరిశెట్టి గోదాదేవి సత్యం అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయా గ్రామాల సర్పంచ్లతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన బ్రిలియంట్ విద్యా సంస్థల అధినేత కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్సీగా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్టు ఆయన గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా వర్గ విభేదాలకు తావులేకుండా ప్రజలకు అవసరమైన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అందరి మన్ననలు పొందిన విద్యావేత్త అయిన కల్వకుర్తి శాసన సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డికి మంత్రి పదవి కల్పిస్తే నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడ్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తారని గోదాదేవి సత్యం ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ కారులు నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ చైర్మెన్ బాలాజీ సింగ్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. ఈసమావేశంలో చెన్నంపల్లి, పోలేపల్లి, సింగంపల్లి గ్రామాల సర్పంచ్లు పబ్బతి శ్రీనివాస్, బాల్ రామ్, ప్రేమలత నర్సింహ తదితరులు పాల్గొన్నారు.