క్రీడ స్ఫూర్తితో ఆడటమే నిజమైన విజయం: ఎమ్మెల్సీ కోటిరెడ్డి

– అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు
– గెలుపోటములు సహజం
– వివిధ జిల్లాల నుండి హాజరైన క్రీడాకారులు
– ఈ పోటీలు లీగ్ కం నాక్అవుట్ పద్దతిలో.. ఉదయం,సాయంత్రం విద్యుత్ దీపాల వెలుగులో మ్యాట్ పై నిర్వహణ
– మూడు రోజుల పాటు కొనసాగనున్న పోటీలు
నవతెలంగాణ – నాగార్జునసాగర్
క్రీడాస్ఫూర్తితో ఆడటమే నిజమైన విజయమని ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు. కుందూరు జానారెడ్డి ఛాలెంజర్ ట్రోఫీ 70వ తెలంగాణ రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల సీనియర్ పురుషుల కబడ్డీ పోటీలను శనివారం నాగార్జునసాగర్ హిల్ కాలనీ లోని బీసీ గురుకుల పాఠశాల క్రీడా మైదానంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని క్రీడాకారుల పరిచయ కార్యక్రమం అనంతరం క్రీడలను ప్రారంభించారు. నల్గొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్  ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలకు  వివిధ జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడుతూ… గెలుపోటములను సహజమనే విషయాన్ని ప్రతి క్రీడాకారుడు గుర్తించాలని, ఓటమి నుండి విజయానికి పునాది చేసుకోవాలని తెలిపారు. పోటీల్లో స్నేహ భావంతో ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు. క్రీడాకారులకు తగినంతగా ప్రాధాన్యత లేని కారణంగా క్రీడలు నానాటికీ కనుమరు గవుతున్నాయని సవాళ్లను అధిగమించి రాణించిన వారు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని అన్నారు. ఈ పోటీలు లీగ్ కం నాక్అవుట్ పద్దతిలో.. ఉదయం, సాయంత్రం విద్యుత్ దీపాల వెలుగులో మ్యాట్ పై నిర్వహించడం జరుగుతుంది అని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ ఎంపీపీ భగవాన్ నాయక్,నల్గొండ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్. భూలోకరావు, జి. కర్తయ్య,ఏడుకొండలు,వెంకటరత్నం,అయ్యప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love