ఆకలి కేకలు ఒప్పుకున్న మోడీ

Modi admits hunger pangs– అందుకే 5 ఏండ్లు ఉచిత రేషన్‌ హామీ
–  పెరిగిన నిరుద్యోగం
–  అట్టడుగున ఆర్థికాభివృద్ధి
– అయినా ఓటర్లపై ‘గ్యారంటీ’ల వర్షం
భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటే దాని స్థానం ప్రపంచ ఆకలి సూచికలో ఎందుకు పడిపోతోంది? 2023వ సంవత్సరపు ప్రపంచ ఆకలి సూచికలో మన దేశం నాలుగు స్థానాలు దిగజారి మొత్తం 125 దేశాల్లో 111వ స్థానంలో నిలిచింది. ఈ సూచికను మోడీ ప్రభుత్వం తోసిపుచ్చింది. అయితే మరో విధంగా దానిని అంగీకరించింది. అందుకే ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ యోజన పథకం కింద ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగించింది. వాస్తవ చిత్రం ఇలా ఉంటే దేశం అమృతకాలపు స్వర్ణ యుగంలో ప్రవేశించిందని మోడీ చెబుతున్నారు. మరి ఇలాంటి సమయంలో 80 కోట్ల మంది ప్రజలు ఆహార ధాన్యాలు ఎందుకు కొనలేకపోతున్నారన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పగలరా?
న్యూఢిల్లీ : దేశంలోని 80 కోట్ల మంది పేదలకు మరో ఐదు సంవత్సరాల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేస్తామని ప్రధాని మోడీ ఛత్తీస్‌గఢ్‌లో ప్రకటించారు. ఇది మోడీ ఇస్తున్న గ్యారంటీ అంటూ గొప్పలు పోయారు. భారత్‌ను ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేస్తానని మోడీ మరో గ్యారంటీ ఇచ్చారు. అయితే ఇక్కడ మోడీ ఓ విషయాన్ని దాస్తున్నారు. అదేమంటే దేశం ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తూ, 2028 నాటికి మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిన పక్షంలో 80 కోట్ల మందికి ఉచితంగా ఆహారాన్ని అందించాల్సిన అవసరం ఏముందన్నది మాత్రం ఆయన చెప్పడం లేదు. దేశం అత్యంత వేగంగా అభవృద్ధి చెందుతూ అమృతకాలంలో ప్రవేశిస్తుంటే మరో ఐదు సంవత్సరాల పాటు ఉచిత రేషన్‌ ఇవ్వాల్సిన అవసరం ఏముందన్నదే ఇక్కడ ప్రశ్న.
డాంబికాల ప్రచారం
శాసనసభ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ హామీలు గుప్పిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానిగా మోడీ పాలన సుమారు పది సంవత్సరాల పాటు కొనసాగింది. అభివృద్ధి, ఉపాధి, పొదుపు రేటు, ప్రైవేటు పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు, ఎగుమతులు వంటి విషయాలలో మంచి ఫలితాలు రాబట్టడానికి ఈ పది సంవత్సరాల సమయం చాలా ఎక్కువే. అయితే ఈ అంశాల్లో వాస్తవ ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయి. ప్రభుత్వ పనితీరు పేలవంగా ఉంది. అయినప్పటికీ మోడీ, ఆయన అనుచర గణం మాత్రం మీడియాలోనూ, ఇతర సామాజిక మాధ్యమాలలోనూ దేశం ఆశ్చర్యకరమైన పురోభివృద్ధి సాధించిందని డాంబికాలు పలుకుతున్నారు. ఎన్నికల సమయంలో ఈ ప్రచారం మరింత ఉధృతంగా సాగుతోంది.
హామీల అమలులో వైఫల్యం
మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరస్కరించిన పథకాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒకటి. ఈ పథకం ద్వారా యూపీఏ ప్రభుత్వం ఆర్థికాభివృద్ధిని సాధించలేకపోయిందని, ఉపాధి కల్పించలేకపోయిందని, ప్రజల ఆదాయాలను పెంచలేకపోయిందని ఆయన విమర్శించారు. కానీ ఇప్పుడో? బడ్జెట్‌లో నిధుల కోతతో ఈ పథకాన్నే నిర్వీర్యం చేసే పనిలో మోడీ ఉన్నారు. గడచిన పది సంవత్సరాల్లో మోడీ అధిక జీడీపీ వృద్ధి రేటుకు గ్యారంటీ ఇవ్వలేదు. గత తొమ్మిదేళ్లుగా ఈ రేటు 5.7%గానే ఉంటోంది. 2014లో హామీ ఇచ్చిన విధంగా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నెరవేర్చడంలో మోడీ దారుణంగా విఫలమయ్యారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలోనూ వైఫల్యమే. గత పదేళ్లలో వ్యవసాయ ఉత్పత్తులకు అయ్యే వ్యయాన్ని కనీస మద్దతు ధరల పెంపుతో పోలిస్తే ఈ విషయం బోధపడుతుంది. ఈ హామీలను నెరవేర్చలేని మోడీ ఇప్పుడు మరో ఐదేళ్ల వరకూ ఉచిత ఆహార ధాన్యాలు అందిస్తానని గ్యారంటీ ఇస్తున్నారు.
కార్మిక సర్వే చెప్పిన చేదు నిజాలు
ఆర్థిక రంగంలో మోడీ ప్రభుత్వ పనితీరు ఎంత దారుణంగా ఉన్నదో గణాంకాల శాఖ గత నెలలో విడుదల చేసిన కార్మిక సర్వే బయటపెట్టింది. 2022-23 జూలై నెలల మధ్య కాలానికి సంబంధించి ఈ సర్వే ఏం చెప్పిందంటే దేశంలో ఉద్యోగాలు, ఉపాధి పొందిన 500 మిలియన్ల మందిలో 58శాతం మంది స్వయం ఉపాధి పొందిన వారే. స్వయం ఉపాధి పొందిన వారిలో ఎక్కువ మంది చిన్న చిన్న వ్యాపారులు, స్వయంగా సేవలు అందించే వారు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వీరి సంఖ్య అధికంగా ఉంది. 2017-18లో ఉద్యోగాలు, ఉపాధి పొందిన వారిలో వీరి సంఖ్య కేవలం 52శాతం. అంటే ఇటీవల స్వయం ఉపాధి పొందిన వారి సంఖ్య పెరిగిందన్న మాట. ఉత్పాదకేతర రంగంలో తక్కువ నాణ్యత కలిగిన ఉద్యోగాల్లో పెరుగుద లను ఇది సూచిస్తోంది. ఎందుకంటే స్వయం ఉపాధి పొందిన వారిలో మూడో వంతు మంది వేతనాలు లేకుండా పని చేస్తున్నారు. చిన్న కుటుంబాలు నడిపే వ్యాపారాల్లో వీరు ఎలాంటి వేతనం తీసుకోకుండా పని చేస్తుంటారు. స్వయం ఉపాధి పొందిన వారు, వారిలో వేతనాలు తీసుకోకుండా పని చేస్తున్న వారి మధ్య దామాషా గడచిన ఐదేళ్లలో బాగా పెరిగింది. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు, కోవిడ్‌ ప్రభావం తర్వాత ఈ పరిస్థితి కన్పించింది.
తగ్గిన వేతనాలు
స్వయం ఉపాధి పొందిన వారిలో వేతనాలు లేకుండా పని చేస్తున్న వారు 2017-18లో నాలుగు కోట్ల మంది ఉంటే ఆ సంఖ్య గత సంవత్సరం నాటికి తొమ్మిదిన్నర కోట్లకు పెరిగిందని ఆర్థికవేత్త సంతోష్‌ మెహ్రోత్రా తెలిపారు. వీరిని ఉద్యోగులుగా గుర్తించలేమని ఆయన చెప్పారు. 2017-18తో పోలిస్తే 2022-23లో నెలవారీ సగటు వేతనాలు 20శాతం తగ్గాయని కార్మిక సర్వే తెలిపింది. స్వయం ఉపాధి పొందిన వారు, క్యాజువల్‌ కార్మికులదీ ఇదే పరిస్థితి. ఐదేళ్లలో సగటు వేతనాలు పెరగకపోవడం ఉపాధి నాణ్యత దారుణ పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. ఓ వైపు జీవన వ్యయం పెరుగుతుంటే మరోవైపు తమ వేతనాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని స్వయం ఉపాధి పొందిన వారు వాపోతున్నారు. వేతనాలు స్థిరంగా ఉండడం ప్రజల కొనుగోలు శక్తిపై ప్రభావం చూపుతోంది. గ్రామీణ ప్రజల్లో వినియోగ వస్తువులకు డిమాండ్‌ పెరగడం లేదు. ఫలితంగా హిందుస్థాన్‌ లీవర్‌, బజాజ్‌ ఆటో వంటి వినియోగ వస్తువులు ఉత్పత్తి చేసే కంపెనీల అమ్మకాలు పడిపోయాయి. దిగువ మధ్యతరగతి ప్రజల్లో వినియోగం బాగా తగ్గిపోయింది.

Spread the love