– ప్రజల స్వప్నం సాకారం కావాలి..
– కాంగ్రెస్‌తోనే అది సాధ్యం : బహిరంగ సభల్లో రాహుల్
నవతెలంగాణ-జోగిపేట, సంగారెడ్డి, కామారెడ్డి
కుటుంబ పాలనలో బానిస బతుకులకు చరమగీతం పాడి, గడీల కోటలను బద్దలు కొట్టి తెలంగాణ ప్రజల స్వప్నం సాకారం చేయబోతున్నట్టు కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలన్నీ ఒక్కటే అనీ.. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్‌లను ఓడించాలని పిలుపునిచ్చారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేట, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభల్లో ఆయన ప్రసంగించారు. దేశంలో నరేంద్ర మోడీ విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు. కేంద్రంలో బీజేపీకి బీఆర్ఎస్, ఎంఐఎంలు సపోర్ట్ చేస్తున్నాయని విమర్శించారు. అందుకే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి మోడీ అండగా ఉంటున్నారని ఆరోపించారు. అసోం, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎంఐఎం పార్టీకి అభ్యర్థులు లేకున్నా.. బీజేపీ వారికి అభ్యర్థులను ఇచ్చి పోటీకి ప్రోత్సహిస్తున్నదన్నారు.
తెలంగాణలో అవినీతి ప్రభుత్వానికి, ప్రజలకు ఈ ఎన్నికల యుద్ధం జరుగుతోందని చెప్పారు. కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్ అంటున్నారని.. కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చిందని, తెలంగాణలో ప్రతి ఒక్కటీ తెచ్చిందని చెప్పారు.
కేసీఆర్ దోచుకున్న సొమ్మును కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే జప్తు చేసి ప్రభుత్వానికి అప్పగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ధరణితో పేదల భూములు అన్యాక్రాంతం అయ్యాయన్నారు. నిరుద్యోగ యువతను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీ హామీలను అధికారంలోకి రాగానే నెరవేరుస్తామ న్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, దేశంలోనూ తమ ప్రభుత్వం ఏర్పడటానికి ఇక్కడి నుంచే నాంది పలుకుతున్నామని చెప్పారు. జోగిపేటలో దామోదరను, సంగారెడ్డిలో జగ్గారెడ్డిని, కామారెడ్డిలో రేవంత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కుటుంబ పాలనకు చరమగీతం పాడాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమాల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్, నాయకులు షబ్బీర్ అలీ, కేసి గోపాల్, సురేష్ షెట్కార్, అద్దంకి దయాకర్, త్రిష, కృష్ణారెడ్డి, పద్మనాభ రెడ్డి, సంగమేశ్వర్, సురేందర్ గౌడ్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.