కొత్త ప్రభాకర్‌రెడ్డికి కత్తిపోట్లు

New Prabhakar Reddy stabbed– సెల్ఫీ దిగేందుకు వచ్చి ఒక్కసారిగా దాడి
–  తీవ్రంగా రక్తస్రావం.. గజ్వేల్‌ ఆస్పత్రికి తరలింపు
–  హైదరాబాద్‌ యశోదలో ఆపరేషన్‌
–  ఈ దాడి ఆయన పై కాదు, నాపై : కేసీఆర్‌
–  ప్రజాస్వామ్యంలో రాజకీయంగా ఎదుర్కోవాలి : హరీశ్‌రావు
– ఆస్పత్రిలో సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు పరామర్శ
నవ తెలంగాణ – దౌల్తాబాద్‌/బేగంపేట
దుబ్బాక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం సూరంపల్లిలో ఓ పాస్టర్‌ కుటుంబాన్ని పరామర్శించి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సోమవారం దుబ్బాక నియోజకవర్గంలోని గాజులపల్లి, దొమ్మాట, ముత్యంపేట, సూరంపల్లి గ్రామాల్లో ప్రభాకర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూరంపల్లి గ్రామంలో పాస్టర్‌ కుటుంబాన్ని పరామర్శించి లింగరాజుపల్లి వెళ్లడానికి సిద్ధమవుతున్న క్రమంలో పెద్ద చెప్యాల గ్రామానికి చెందిన రాజు (యూట్యూబ్‌ చానెల్‌ రిపోర్టర్‌) సెల్ఫీ దిగేందుకు వచ్చి ఎంపీని ఉన్నట్టుండి ఒక్కసారిగా కత్తితో పొడిచాడు. దాంతో పొట్టపై భాగంలో గాయాలయ్యి తీవ్ర రక్తస్రావమైంది. గమనించిన కార్యకర్తలు ఎంపీని వాహనంలో హుటాహుటిన గజ్వేల్‌ ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన రాజుకు దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఘటనపై సీపీ శ్వేత దర్యాప్తు జరుపుతున్నారు. నారాయణఖేడ్‌ సభకు వెళ్తుండగా మంత్రి హరీశ్‌రావుకు ఎంపీపై దాడి సమాచారం తెలియడంతో వెంటనే గజ్వేల్‌కు చేరుకుని, ఆ తర్వాత హైదరాబాద్‌కు తరలించారు.
హైదరాబాద్‌ యశోద ఆస్పత్రిలో వైద్యులు ప్రభాకర్‌రెడ్డికి ఆపరేషన్‌ చేశారు. చిన్న పేగుకు నాలుగుచోట్ల గాయాలైనట్టు వైద్యులు తెలిపారు. గాయం కారణంగా రక్తం కడుపులో పేరుకుపోవడంతో 15 సెంటిమీటర్లు కట్‌ చేశామని, పేరుకుపోయిన రక్తం శుభ్రం చేశామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ప్రాణాపాయం లేదన్నారు. గ్రీన్‌ చానల్‌తో హైదరాబాద్‌ తరలించకుంటే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ఎన్నికల ప్రచారం ముగించుకుని నేరుగా సీఎం కేసీఆర్‌ యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రభాకర్‌రెడ్డిని పరామర్శించారు. ఆయనకు దైర్యం చెప్పారు. ఆరోగ్య పరిస్థితి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా, ఎంపీపై కత్తి దాడి జరగడంతో సూరంపల్లి రహదారిపై బీఆర్‌ఎస్‌ నాయకులు ధర్నాకు దాగారు. పోలీస్‌ వాహనంపై కూడా దాడి చేశారు. కొత్త ప్రభాకర్‌ రెడ్డికి చికిత్స అందిస్తున్న హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రి వద్దకు దుబ్బాక నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌ నాయకులు తరలివచ్చి.. ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ”రఘునందన్‌ రావు డౌన్‌.. డౌన్‌.., బీజేపీ రౌడీల్లారా” అంటూ నినాదాలు చేశారు. దాంతో స్థానిక పోలీసులు ముందు జాగ్రత్తలు చేపట్టి నాయకులను ఆస్పత్రి నుంచి బయట పంపించారు. దాడిని గవర్నర్‌ తమిళ్‌సై, సీఎం కేసీఆర్‌, మంత్రులు, బీఆర్‌ఎస్‌ నేతలు, ప్రతిపక్ష నాయకులు ఖండించారు.
ఈ దాడి ప్రభాకర్‌ రెడ్డిపై కాదు, నాపై జరిగింది : కేసీఆర్‌
”ఇది ప్రభాకర్‌ రెడ్డి మీద జరిగిన దాడి కాదు.. కేసీఆర్‌ మీద దాడి జరిగినట్టు కనిపిస్తోంది’ అని కేసీఆర్‌ అన్నారు. చేతగాని దద్దమ్మలు, వెధవలు పని చేసే చేతగాక, ఎన్నికలు ఫేస్‌ చేసే దమ్ము లేక హింసకు, దాడులకు దిగ జారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కత్తులు పట్టి మా పార్టీ అభ్యర్థుల మీద దాడి చేస్తున్నారు. కత్తి పట్టుకొని పొడవాలంటే ఇంత మంది ఉన్నాం.. మాకు చేతులు లేవా..? మొండిదో లండిదో మాకో కత్తి దొరకదా..? మాకు తిక్కరేగితే.. రాష్ట్రంలో దుమ్ము దుమ్ము రేగుతుంది.. తస్మాత్‌ జాగ్రత్త” అని బాన్సువాడ సభలో కేసీఆర్‌ హెచ్చరించారు.
ప్రజాస్వామ్యంలో రాజకీయంగా ఎదుర్కోవాలి : కేటీఆర్‌, హరీశ్‌రావు
ప్రజాస్వామ్యంలో రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప వ్యక్తులపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదని మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు అన్నారు. ప్రచారంలో కత్తిపోటుకు గురై సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి పరామర్శించిన అనంతరం మంత్రులు విలేకరులతో మాట్లాడారు. ప్రభాకర్‌ రెడ్డి పదేండ్ల నుంచి మెదక్‌ ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నారన్నారు. అలాంటి వ్యక్తిపై దాడులు చేయడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘం చర్యతు తీసుకుంటుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ప్రభాకర్‌ రెడ్డి దాడిలో సెక్యూరిటీ చేతికి కూడా గాయాలయ్యాయని తెలిపారు.
వాస్తవం లేదు : రఘనందన్‌రావు
దాడికి తానే కారణమని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్‌రావు అన్నారు. దాడితో తనకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. దాడి జరగడం దురదృష్టకరమన్నారు. నిందితుడు ఓ చానెల్‌ రిపోర్టర్‌ అని వెబ్‌లో ఉందని, నిందితుడు ఏ పార్టీ వ్యక్తి అనేది పోలీసులు స్పష్టంగా చెబితే బాగుంటుందన్నారు. దళితబంధు రాలేదనే ఆవేదనతోనే దాడి చేశాడని మీడియాలో వచ్చిందన్నారు. పోలీసులు విచారణ జరిపి వాస్తవాలను బయట పెట్టాలన్నారు.
దాడిని ఖండిస్తున్నాం
ప్రభాకర్‌రెడ్డిపై దాడిని ఖండిస్తున్నాం. కాంగ్రెస్‌ ఎప్పుడూ హింసను నమ్ముకోదు. దాడిచేసిన వ్యక్తి ఎవరైనా కఠినంగా శిక్షించాలి. కత్తి దాడి ఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి, వాస్తవాలను ప్రజలకు తెలపాలి.
-పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి

Spread the love