మోడీ వర్చువల్ గా చెంచులతో  సమావేశాన్ని విజయవంతం చేయాలి :  కలెక్టర్ పి ఉదయ్ కుమార్ 

నవతెలంగాణ –  అచ్చంపేట
పీఎం జన్‌ మన్‌ లో భాగంగా ఈనెల15న నల్లమల్ల చెంచులతో ప్రధాని మోదీ మాట్లాడతారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి ఉదయ్  కుమార్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న మారుమూల ప్రాంతాల్లోని గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌ (పీఎం జన్‌మన్‌ యోజన) పథకం ప్రవేశపెట్టిందన్నారు. ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రధాని నిర్వహించే సమావేశపు ఏర్పాట్లు, జన్ మన్ పథకం అమలుపై బుధవారం నాగర్ కర్నూల్ కలెక్టర్ ఛాంబర్ లో అధికారులతో జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ….1000 మంది చెంచులతో ప్రధాని వర్చువల్ సమావేశానికి కావలసిన అన్ని ఏర్పాట్లను మన్ననూర్ గిరిజన గురుకుల  పాఠశాల ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశానికి జిల్లాలోని ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. నాగర్ కర్నూలు జిల్లాలోని 88 చెంచుపెంటల్లో నివసించే 1000 మంది చెంచులకు ఆధార్ కార్డులు ఇప్పటివరకు లేకపోవడంతో జిల్లాలో 8 ఆధార్ కేంద్రాలను ఏర్పాటుచేసి యుద్ధ ప్రాతిపదికన నేటి వరకు 400 మందికి ఆధార్ కార్డుల నమోదు ప్రక్రియ పూర్తి చేశామన్నారు. చెంచుల లోని ప్రతి ఒక్కరికి ఆధార్ అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
అదేరోజు లబ్ధిదారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు, ఆధార్ కార్డులు, జన్ మన్ బ్యాంక్ అకౌంట్, ఆయుష్మాన్ భారత్ కార్డులు అందజేయడంతోపాటు, ప్రత్యేక మెడికల్ ఎం ఎం యు వాహనాన్ని ప్రారంభించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర పథకాల ద్వారా పక్కా ఇళ్ల నిర్మాణం, రహదారుల అభివృద్ధి, మొబైల్‌ మెడికల్‌ యూనిట్ల ద్వారా ఆరోగ్య పరిరక్షణ, నిరంతర నీటి సౌకర్యం, ప్రతి ఇంటికీ విద్యుత్, అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటు, మల్టీపర్పస్‌ కేంద్రాలు, సోలార్‌ వీధి దీపాలు, మొబైల్‌ టవర్లు, ఒకేషనల్‌ విద్యా కేంద్రాలు, జిల్లాలోని చెంచుగుడాల్లో ఈ పథకం ద్వారా ఏర్పాట్లు  జరగనున్నాయని  ఆయన తెలిపారు. జిల్లాలోని పీవీటీజీ ఆవాసాల్లోని వారందరికీ వివిధ పథకాలను మిషన్‌ మోడ్‌లో పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కమలాకర్ రెడ్డి, డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్, ఐటీడీఏ ప్రాజెక్ట్ మేనేజర్ జాఫర్ హుస్సేన్, శ్రీకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love