ఈడెన్‌లో ధనాధన్‌

Money in Eden– భారత్‌, ఇంగ్లాండ్‌ తొలి టీ20 నేడు
– రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ధనాధన్‌ క్రికెట్‌కు రంగం సిద్ధమైంది. టీ20 ఫార్మాట్‌లో అగ్ర జట్లు భారత్‌, ఇంగ్లాండ్‌లు సమరానికి సై అంటున్నాయి. ప్రపంచ చాంపియన్‌కు సవాల్‌ విసిరేందుకు ఇంగ్లాండ్‌ ఎదురు చూస్తుండగా.. రికార్డులు బద్దలు కొట్టేందుకు టీమ్‌ ఇండియా తహతహ లాడుతోంది. భారత్‌, ఇంగ్లాండ్‌ తొలి టీ20 పోరు నేడు.
నవతెలంగాణ-కోల్‌కత
భారత్‌, ఇంగ్లాండ్‌ ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌ నేడు ఈడెన్‌ గార్డెన్స్‌లో షురూ కానుంది. ఇరు జట్లలోనూ భారీ హిట్లర్లకు కొదవ లేదు. కోల్‌కతలో రాత్రి వేళ మంచు ప్రభావం అధికంగా ఉంటుంది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో బంతి అందుకునే జట్టుకు ఈడెన్‌లో కఠిన సవాల్‌ ఎదురు కానుంది. బౌలర్లకు బంతిపై పట్టు చిక్కకపోవటంతో.. బ్యాటర్లు భారీ స్కోర్లపై కన్నేసి బరిలోకి దిగుతున్నారు. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్‌ చేసేందుకు మొగ్గు చూపనుంది. ఈడెన్‌ గార్డెన్స్‌లో భారత్‌, ఇంగ్లాండ్‌ ధనాధన్‌ నేడు.
జోరు కొనసాగేనా
భారత బ్యాటర్లు భీకర జోరు మీదున్నారు. సంజు శాంసన్‌, తిలక్‌ వర్మలు శతక ఉత్సాహం కొనసాగించటంపై దృష్టి పెట్టగా.. అభిషేక్‌ శర్మ తనదైన ఊచకోత ఇన్నింగ్స్‌ ఆడాలని చూస్తున్నాడు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య సహా రింకు సింగ్‌ పరుగుల వేటలో ధనాధన్‌ ఇన్నింగ్స్‌ బాకీ పడ్డారు. బ్యాటర్లకు అనుకూలించే సిరీస్‌లో ఈ ముగ్గురు బ్యాటర్లు పరుగుల దాహం తీర్చుకోవాలని భావిస్తున్నారు. మంచు ప్రభావిత మ్యాచ్‌లో స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ పటేల్‌లు కీలకం కానున్నారు. అర్షదీప్‌ సింగ్‌తో కలిసి మహ్మద్‌ షమి పేస్‌ బాధ్యతలు పంచుకోనున్నాడు.
బజ్‌బాల్‌ జోష్‌
ఇంగ్లాండ్‌ ఇటీవల టెస్టుల్లోనే టీ20 తరహా ఆట ఆడుతోంది. ఇక టీ20ల్లో ఆ జట్టు ఊచకోత ఏ రీతిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. బ్యాటింగ్‌ లైనప్‌లో జోశ్‌ బట్లర్‌, జాక్‌ బెతెల్‌, లియాం లివింగ్‌స్టోన్‌, సహా ఫిల్‌ సాల్ట్‌, హ్యారీ బ్రూక్‌ ఉన్నారు. బౌలింగ్‌ విభాగంలో జోఫ్రా ఆర్చర్‌, ఆదిల్‌ రషీద్‌, మార్క్‌వుడ్‌, షకిబ్‌ మహ్మద్‌ కీలకం. ధనాధన్‌ ఇన్నింగ్స్‌లకు మారుపేరుగా నిలిచే ఇంగ్లాండ్‌ బ్యాటర్లు ఈడెన్‌ గార్డెన్స్‌లో భారత బౌలర్లను ఏ విధంగా ఎదుర్కొంటారో చూడాలి.
తుది జట్లు (అంచనా) :
భారత్‌ : అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్య, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, రింకు సింగ్‌, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి, అర్షదీప్‌ సింగ్‌, మహ్మద్‌ షమి.
ఇంగ్లాండ్‌ : జోశ్‌ బట్లర్‌ (కెప్టెన్‌), బెన్‌ డకెట్‌, ఫిల్‌ సాల్ట్‌, హ్యారీ బ్రూక్‌, జాకబ్‌ బెతెల్‌, లియాం లివింగ్‌స్టోన్‌, మార్క్‌వుడ్‌, జోఫ్రా ఆర్చర్‌, షకిబ్‌ మహ్మద్‌, ఆదిల్‌ రషీద్‌, అటిక్సన్‌.

Spread the love