Sunday, May 24, 2026
E-PAPER
Homeఎడిట్ పేజినీతి బోధలు…

నీతి బోధలు…

- Advertisement -

పుష్పకుమార్ ఆఫీసు నుండి ఇంటికి వచ్చాడు. పుష్పకుమార్ పెద్దాయనకు పరమ భక్తుడు. విష్ణుమూర్తి స్వయంగా పెద్దాయన రూపంలో భూమి మీదికి దిగి వచ్చాడని నమ్మేవాళ్లలో పుష్పకుమార్ మొదటి లిస్టులోనే ఉంటాడు. పెద్దాయన ఏం చెబితే అది రెండో ఆలోచన లేకుండా అమలు చేస్తాడు!. ఆఫీసులో ఉన్నపుడే దేశంలో ఏర్పడ్డ పరిస్థితుల గురించి ఖర్చు తగ్గించు కోవటానికి తీసుకోవాల్సిన చర్యల గురించీ, పెద్దాయన చేసిన ఉపన్యాసం విని పుష్పకుమార్ పులకించిపోయాడు! ప్రజలు ఏం చేయోచ్చో, ఏం చేయకూడదో తెలిసిన నాయకుడు ఈ దేశం యొక్క భాగ్యం అనుకున్నాడు! యధాప్రకారం వాటన్నింటినీ అమలు చేయాలని తీర్మానించుకున్నాడు! ​సోఫాలో కూర్చుని పుష్పకుమార్, శ్రీమతిని పిలిచాడు! “దేశం చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నది. యుద్ధాలు జరుగుతున్నాయి! ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవాలంటే మనం ఏం చేయాలో పెద్దాయన చెప్పాడు. అది మనం పాటిస్తున్నాం! అందులో భాగంగా మనం తిరుపతి ట్రిప్పు క్యాన్సిల్ చేసుకుంటున్నాం. మనం కొనబోయే బంగారం ఇక కొనం!” అని పుష్పకుమార్ అంటూండగానే శ్రీమతి, బంటిగాడు కిసుక్కున నవ్వారు.

“కొనబోయే బంగారం కాదు! కొనలేని బంగారం! లక్షా అరవై వేలకు తులం బంగారం అమ్ముతున్నారు! మీ జీతం అంతా ఏమీ ఖర్చు చేయకుండా మూడు నెలలు కూడబెడితే కూడా తులం బంగారం కొనలేము!” అన్నది శ్రీమతి ఇంకా నవ్వుతూనే.“ఇక నుండి మనం ఏ ఫంక్షన్లకు వెళ్లకూడదు! పెట్రోల్‌ ఖర్చు తగ్గించటానికి బయటికి వెళ్లినప్పుడు నేను బండివాడను! నడిచే వెళ్తాను! ఛాయి తీసుకునిరా!’’ అన్నాడు పుష్పకుమార్. “డాడీ మనమే ఇలా చేయాలా? లేక గవర్నమెంటు కూడా చేస్తుందా?’’ అడిగాడు బంటిగాడు. “పెద్దాయన చెప్పాడంటే గవర్నమెంటు కూడా చేస్తుంది!” అన్నాడు పుష్పకుమార్ నమ్మకంగా! ఇంతలో శ్రీమతి వచ్చి “ఛాయి తీసుకోండి!” అంటూ పుష్పకుమార్ ముందు టీ పెట్టింది! “ఇందులో సాసర్‌ ‌మాత్రమే ఉంది ఛాయ్‌‌కప్పు లేదు కదా!’’ అన్నాడు పుష్పకుమార్ విసుగ్గా.

“కళ్లద్దాలు పెట్టుకుని చూడండి!” అన్నది శ్రీమతి. కళ్లద్దాలు పెట్టుకుని చూశాడు! ట్రేలో చాలా చిన్న టీ కప్పు ఉంది! అందులో టీ కూడా ఉంది! అయోమయంగా శ్రీమతి వంక చూడాడు పుష్పకుమార్!
“పెద్దాయన చెప్పిందే నేనూ పాటించాను! గ్యాస్ పొదుపు చేస్తున్నాను!” అంటూనే ఇంట్లోని లైట్లు అన్ని బంద్ చేసింది శ్రీమతి. కిమ్మనకుండా పుష్పకుమార్ టీ కప్పును ఎత్తి టీ గొంతులో వేసుకున్నాడు. కాని టీ నోట్లో నుండి గొంతులోకి దిగిందో లేదో పుష్పకుమార్‌కు తెలియలేదు. “డాడీ! ఇది అన్యాయం!” అన్నాడు టీవీ చూస్తున్న బంటిగాడు. “పెద్దాయన పాలనలో అన్యాయమా! కచ్చితంగా ఎవడో దేశద్రోహి చేసుంటాడు!” అన్నాడు పుష్పకుమార్ గట్టి నమ్మకంతో. “ఎవడో కాదు డాడీ! మనను టూర్లు పోవద్దని చెప్పిన పెద్దాయనే ఎక్కడికో టూర్ వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కుతున్నాడు చూడు!’’ అంటూ టీవీ చూపించాడు! బంటిగాడు.

పెద్దాయన విదేశీ పర్యటనకు వారం రోజులపాటు వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కుతున్నాడు. పుష్పకుమార్ ఏం అనాలో తోచలేదు! వెంటనే రిమోట్ లాక్కుని ఛానల్ మార్చాడు! “పెద్దాయన మూడోసారి అధికారంలోకి వచ్చారు! గత పన్నెండేళ్ల నుంచీ ఒక్క సరుకు ధర కూడా తగ్గలేదు! అన్నీ పెరుగుతూనే ఉన్నాయి! జీఎస్టీ వస్తే సరుకుల ధరలు తగ్గుతాయని ఊదరగొడితిరి! ఏ ధర తగ్గిందో చెప్పగలరా?” అడిగింది శ్రీమతి. ‘‘పెద్దాయన మొదటిసారి అధికారంలోకి వచ్చినపుడు పెట్రోల్ రేటు రూ.56. ఈ రోజు రూ.112 అయ్యింది! ఐదు రాష్టాల ఎన్నికలయ్యే దాక ఆగి ఆ తర్వాత పెంచారు! యుద్ధాలు జరుగుతున్నా పెద్దాయన ఉన్నాడు కాబట్టి ధరలు పెరగలేదని, ప్రశాంతంగా ఉన్నామని ఎన్నికల్లో ప్రచారం చేశారు! ఆ తర్వాత ధరలు పెంచారు! ఇది ప్రజలను మోసం చేయటం కాదా? ప్రజలకు ఖర్చు తగ్గించుకోమని చెప్పి మీరేమో అడ్డగోలు ఖర్చులు చేస్తుంటారు! మీ మాటలకు విలువ ఉందా?’’ అడిగింది శ్రీమతి. పుష్పకుమార్ తలదించుకున్నాడు.

“ఒకే దేశం.. ఒకే పరీక్ష అంటూ నీట్ పరీక్ష పెట్టారు! మీరు పెట్టిన అన్ని పరిక్షల్లాగే ఇది కూడా లీక్ అయ్యింది! పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థుల గోస మీకు అర్థమయ్యిందా?” అడిగింది శ్రీమతి.
పుష్పకుమార్ మాట్లాడలేదు! “అందరికీ నీతి బోధలు చేస్తారు! కాని మీ మంత్రులు, నాయకుల పిల్లలేమో అడవారి మీద ఆఘాయిత్యాలకు పాల్పడతారు. రేపులు చేసిన వారికి బెయిల్ ఇప్పిస్తారు! ఆ వెధవలు బయటకు వస్తే వారికి సత్కారాలు చేస్తారు! సిగ్గూ శరం ఏమైనా ఉందా వారికి?’’ నిలదీసింది ఇల్లాలు. పుష్పకుమార్‌‌కు గొంతు పెగలటం లేదు! “దేశాన్ని పరిపాలించేవారు బాధ్యత గలిగి ఉండాలి. తాము చేయగలిగేది ఇతరులకు చెప్పాలి! అంతేగాని ఇతరులకు నీతి బోధలు చేసి, తాము మాత్రం తమకిష్టం వచ్చినట్లు చేస్తే ప్రజలు సమయం వచ్చినపుడు కర్రు కాల్చి వాత పెడతారు!” అన్నది శ్రీమతి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -