ఇంకేన్నాళ్ళీ హింసా..?

Still violence..?నిర్భయ ఘటన ఇంకా మనం మర్చిపోలేదు. దేశం మర్చిపోలేదు. సరిగ్గా పుష్కరం తర్వాత మళ్లీ ఆర్జీ కార్‌ ఆసుపత్రిలో అమానుషం. కలకత్తా నగరంలో ఆర్జీ కార్‌ పేరు ప్రఖ్యాతలు కలిగిన ఆసుపత్రి. బహుశా ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రి వంటిదే. నిత్యం రోగులు, డాక్టర్లు, నర్సులు, వచ్చి పోయే జనాలతో కిటకిటలాడే ఆసుపత్రి. అటువంటి పేరుపొందిన ఆసుపత్రిలో.. అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న లేడీ డాక్టర్‌పై అతి కిరాతకంగా దాడి చేసి, అత్యాచారం చేసి చంపేశారు. దీంతో దేశం మరొకసారి ఉలిక్కి పడింది. ఇక నిత్యం, నిరంతరం ఎక్కడో ఒకచో, ఏదో ఒక మూల మహిళల మీద, పిల్లల మీద జరుగుతున్న దాడులు, అత్యాచారాలతో మనసులు ద్రవిస్తున్నాయి. మెదడులు మొద్దుబారుతున్నాయి కూడా నేమో. ఇంకెన్నాళ్లు ఈ హింస అనే ప్రశ్న ప్రతి ఒక్కరినీ తొలిచేస్తోంది. ఉయ్యాలలోని పసిబిడ్డలకి రక్షణ లేదు. ముసలమ్మకి రక్షణ లేదు. చెప్పుకోవడానికే సిగ్గు లజ్జతో తలవంచుకోవాల్సి వస్తోంది. ఎందుకీ దుస్థితి. నవంబర్‌ 25న స్త్రీల హక్కుల పరిరక్షణ, స్త్రీలపై జరుగుతున్న హింసా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా దేశంలో నేటి మహిళా స్థితిగతుల గురించి ఒక్కసారి పరిశీలన చేద్దాం…
‘ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో, అక్కడే దేవతలు కొలువై ఉంటారు’. ‘స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం’ వంటి సూక్తులు నిత్యం వింటూనే ఉన్నాం. మరి ఏది? దేశంలో రోజూ ఏదో ఒక మూల 86 మంది ఆడవాళ్లు, పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయని అధికారిక లెక్కలు తేల్చిచెబుతున్నాయి. స్త్రీల మీద గంటకి 49 నేరాలు జరుగుతున్నాయి. ఇదేనా స్త్రీలను పూజించడం అంటే. మహిళలపై హింస ఈ విధంగా ఉంటే ప్రభుత్వాలు గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నాయా? అనే ప్రశ్న జనించక మానదు.
స్త్రీల చిత్తము, స్వభావము
‘పురుషులను మోహింపచేయు గుణం స్త్రీలకు సహజ సిద్ధమైంది. కావున వివేకవంతులు స్త్రీల దగ్గర జాగ్రత్తగానుందురు. పురుషుడు వివేక హీనుడైనను, వివేకవంతుడైనను కామ క్రోధాలకు వశమైనచో స్త్రీ అతనిని తప్పుడు త్రోవకు తీసుకొని పోతుంది. మిక్కిలి బలముగల ఇంద్రియములు వివేకిని సైతం చెడు త్రోవ తొక్కిస్తాయి. కావున మానవుడు తన తల్లితోనైనను, చెల్లితో నైనను, కూతురుతోనైనను ఒంటరిగా ఉండరాదు’ అని మనుధర్మశాస్త్రం చెబుతోంది. మరి ఎక్కడ స్త్రీలు పూజింపబడుదురో అనే శాస్త్రాలకి అర్థం ఏముంది. తరతరాలుగా ఈ సమాజంలో స్త్రీల పట్ల దుర్మార్గమైన ఆలోచనలు పాతుకుపోయి ఉన్నాయి. అవి కూడా స్త్రీల మీద హింస పెరగటానికి దోహదపడుతున్నాయి. ఇక ప్రవచన కారుల ప్రవచనాలు ఉండనే ఉన్నాయి. పుండు మీద కారం చల్లినట్టుగా ఉంటున్నాయి వాళ్ళ ప్రవచనాలు. ఆడవాళ్ళ వేషధారణ, సోకులు, స్త్రీల మీద హింసకు కారణమవుతున్నాయంట. అంటే మా మీద దాడి చేయండి అని స్త్రీలే మగవాళ్ళని రెచ్చగొడుతున్నారా? ఇటువంటి ధోరణులకు అంతం పలికేది ఎప్పుడు?
తిట్ల సామెతలు చూద్దాం…
ప్రతి తిట్టు, ప్రతి సామెత స్త్రీల పైన హింసను, లైంగిక దాడిని, వివక్షను రెచ్చగొట్టేదే. యధాలాపంగా తిట్టుకునే తిట్లు మగవాడిని ఉద్దేశించి తిట్టినా, ప్రతి తిట్టు స్త్రీల లైంగికత పైన దాడి చేసే విధంగానే ఉంటున్నాయి. ఒకసారి ఈ తిట్లను సామెతలను గుర్తుకు తెచ్చుకోండి. ‘వెధవ ముండకి దండం పెడితే నాకు మల్లె ఉండు అని దీవించింది అంట’, ‘సద్దన్నం తిన్నమ్మ మొగుడు ఆకలి ఎరగదు’. ఇట్లాంటి సామెతలు యధాలాపంగా వాడేస్తుంటారు. ఆ వాడే వాళ్ళు మగవాళ్లే కాదు, ఆడవాళ్ళు కూడా. ఈ తిట్లు సామెతలు ఎందుకు నిషేధించవు ఈ ప్రభుత్వాలు.
ప్రశ్నించేతత్వం చంపేస్తున్నారు
‘ముల్లొచ్చి అరిటాకు మీద పడ్డ, అరిటాకు ముల్లు మీద పడ్డ నష్టం అరిటాకుకే కదా’ ఇట్లాంటి సామెతలతో స్త్రీల నోళ్లుమూయించడం, స్త్రీ స్వేచ్ఛ స్వతంత్య్రాలకి అడ్డుకట్ట వేయటం వంటి ధోరణులు సమాజంలో తక్కువేం కాదు. ఆడవాళ్లు చీకటి పడే లోపు ఇంటికి చేరాలంటారు. మంచిదే, రాత్రి పగలు తేడా లేకుండా తిరగాలన్న కాంక్ష ఎవరికి ఉంటుంది. కానీ చీకటి పడే లోపు ఇంటికి చేరాలన్న ఈ సమాజమే అర్ధరాత్రి వరకు పని చేయిస్తుంది. నైట్‌ డ్యూటీలు వేస్తున్నారు. స్త్రీలు సుకుమారులని అంటూనే బండ చాకిరీ చేయిస్తున్నారు. రాత్రుళ్ళు రక్షణ లేదు సరే, పగలైనా రక్షణ ఉంటుందా? ఎంతోమంది శ్రామిక మహిళలు మింగలేక కక్కలేక పైకి చెప్పలేక, లోపల దాచుకొని బాధపడలేక అనారోగ్యాల పాలవుతున్నారు. ఇంకా తట్టుకోలేని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంతమందికి తెలుసు ఈ వాస్తవాలు. ప్రేమ పేరుతో చేసే మోసాలు, దాడులు చూస్తున్నాం. ఇక్కడ ఇదే తంతు. అసలు అమ్మాయిల్లోనే ఉంది తప్పు అనే సూక్తులు వినపడతా ఉంటాయి. యుక్త వయసు వచ్చిన ఆడపిల్ల ప్రేమించడం తప్పా? స్త్రీలు రాళ్లు రప్పలు కాదు కదా! ప్రేమించే హక్కు, ఆడదాన్ని లొంగ తీసుకునే హక్కు మగవాడికి మాత్రమే ఉండాలంటరా? మనసుకి స్పందన, శరీరానికి అనుభవం స్త్రీ కైనా పురుషుడికైనా అవసరమే. ప్రేమించడం తప్పు కాదు. కానీ ప్రేమ పేరుతో మోసం, అత్యాచారాలు వంటి నేరాలకు పాల్పడే వాళ్ళని సమాజం మొత్తం నిరసించాల్సిన అవసరం ఉన్నది. పోనీ వాదనకైనా ఒప్పుకుందాం. తల్లిదండ్రులు కుదిర్చి చేసిన పెళ్లిళ్లలో అంతా సజావుగానే ఉంటుందని చెప్పగలమా? ఉంటే నవవధువుల మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి?
యధా నాయక – తథా ప్రజా
యధా రాజా – తథా ప్రజా అనేది గతంలో నానుడి. ఇప్పుడు… యధా నాయక – తథా ప్రజా. ఇలా ఉంది సంగతి. ‘ప్రజ్వల్‌ రేవన్న’. ఇతగాడి గురించి తెలియనివారు లేరు. మన పక్క రాష్ట్రం కర్ణాటకలోనే ఓ పేరు మోసిన రాజకీయ నాయకుడు. ఇతని తండ్రి, తాత కూడా పేరు మోసిన నాయకులే. స్వయానా మాజీ ప్రధాని దేవగౌడ మనవడు ఇతగాడు. బీజేపీ నాయకుడు. దొరికిన ఆడపిల్లనల్లా చెరబట్టి, వీడియోలు తీసుకుని, సెల్‌ ఫోన్‌ నిండా వీడియోలు నింపి బ్లాక్‌ మెయిల్‌ చేసి మరీ ఇష్టానుసారం ప్రవర్తించాడు. కర్ణాటక రాష్ట్రం, దేశం గగ్గోలు పెట్టాక గాని ఇతగాడి మీద ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదు. ప్రజలు తగిన బుద్ధి చెప్పారు ఎన్నికల్లో. గత లోక్‌సభ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించారు. ఇటువంటి రాజకీయ నాయకులకు కొదవలేదు మన దేశంలో. దొరికిన వాడు దొంగ. దొరకని వాడు దొర. ఇలాగుంది. కాదంబరీ జత్వాని కేసు మరో ఉదాహరణ. దేశంలోనే కుబేరుల్లో ఒకడైన పెద్ద పారిశ్రామికవేత్త సజ్జన్‌ జిందాల్‌. ఇతగాడు తన మీద అత్యాచారం చేశాడని బొంబాయిలో కేసు పెట్టింది ఆమె. అయితే జిందాల్‌తో వ్యాపార లావాదేవీలో మరి ఏ కారణమో తెలియదు. అప్పటి ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం అతగాడి ముందు మోకరిల్లినట్టుంది. ఏపీలో కేసులు పెట్టి వేధిస్తూ వచ్చింది. అత్యాచారం కేసు అటకెక్కింది. అంటే అధికారానికి ధన బలంతోడైతే ఇక ఎక్కడ స్త్రీలకు రక్షణ.
చిత్తశుద్ది కరువై…
నీతిమాలిన, దురహంకార రాజకీయాలకు తోడు ప్రభుత్వాల విధానాలు కూడా అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. ఎక్కడబడితే అక్కడ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు, గంజాయి, డ్రగ్స్‌ ఒక వైపు యువతనీ, కాయకష్టం చేసే వాళ్ళని పక్కదోవ పట్టిస్తున్నాయి. రెండోవైపు ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియని స్థితిలో తల్లి, చెల్లి అన్న తేడా లేకుండా స్త్రీల పైన దాడులకు తెగబడేట్లు చేస్తున్నాయి. అక్కడ ఇక్కడో ఘటన జరిగినప్పుడు మొసలి కన్నీరు కార్చడం, పత్రికా ప్రకటనలు ఇవ్వడం తప్ప ఏ కొంచెమైనా సిగ్గు, శరం నీతి నిజాయితీ ఈ ప్రభుత్వాలకి, అధికారంలో ఉన్న పార్టీలకి ఉంటున్నాయా అంటే లేవు అనేదే సమాధానం. ఇక రాజకీయ నాయకుల బూతు పురాణాలకి అడ్డు అదుపు లేదు. అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ సాక్షిగానే తిట్ల పురాణాలు సాగుతున్నాయి. ఒకళ్ళ మీద ఒకరు బురద జల్లుకోవడానికి స్త్రీలను, నాయకుల కుటుంబాల్లోని ఆడవాళ్ళను పావులుగా వాడుకుంటున్నారు. టీవీలలో, సోషల్‌ మీడియాలో బండ బూతులు, వాడుతున్న భాష కనీసం ఉచ్చరించడానికి, పత్రికల్లో రాయడానికి కూడా వీలుగాని భాష వాడుతున్నారంటే ఇంకా ఏమనుకోవాలి. ప్రభుత్వాలకి కనీసం వాటిని అదుపులో పెటాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఉంది. ఓట్ల రాజకీయాలు తప్ప స్త్రీల ప్రాథమిక హక్కులను గుర్తించాలని, భారత రాజ్యాంగం స్త్రీలకు ప్రసాదించిన సమానత్వ హక్కుని గౌరవించాలనే జ్ఞానం ప్రజాస్వామ్యయుతంగా ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కులనే ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలకి లేదు.
కంచే చేను మేసినట్టు
ఇటీవల ‘అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌’ అనే సంస్థ ఒక సర్వే నిర్వహించింది. పార్లమెంట్‌కి, రాష్ట్ర అసెంబ్లీలకు పోటీ చేస్తున్న వారి అఫిడవిట్లు 4000 మందికి పైగా వ్యక్తులవి సేకరించి అధ్యయనం చేసింది. వాటి ద్వారా తేలింది ఏమంటే 151 మంది ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు స్త్రీలను హింసించినట్టు కేసుల్లో ఉన్నారు. అంటే వారంతా స్త్రీలను హింసించిన నేరస్తుల జాబితాలో ఉన్నారు. వారిలో బీజేపీ టాప్‌ లిస్టులో ఉంది. మొత్తంగా ఐదుగురు బీజేపీ, ఐదుగురు కాంగ్రెస్‌, ఒకరు టీడీపీ అభ్యర్థులు అత్యాచార కేసుల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 21 మంది ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు స్త్రీలపై నేరాల కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఇటువంటి వాళ్లను ఏం చేయాలో మీరే ఆలోచించండి. చట్టాలు చేసే నాయకులే చట్ట విరోధులు అవుతున్నారు. ఇంకా సామాన్యుల మాట చెప్పనవసరం లేదు. ఇంకెక్కడి స్త్రీల రక్షణ. వీరంతా కౌరవ సభని మరిపిస్తున్నారు.
మరికొన్ని లెక్కలు చూద్దాం
2022 నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో లెక్కల ప్రకారం నాలుగు లక్షల 45 వేల 256 మంది స్త్రీల మీద, ఆడపిల్లల మీద ఏదో ఒక విధమైన నేరాలు జరిగినాయి. అంటే ప్రతిరోజు 1220 మంది స్త్రీల మీద ఏదో విధమైన దాడులు జరుగుతున్నాయి. ఇకపోతే కట్నం కేసులు తక్కువ ఏమీ కాదు. 2019 లెక్క ప్రకారం ఏడు వేల ఒక వంద మంది స్త్రీలు కట్నం కారణంగా హత్య చేయబడ్డమో, ఆత్మహత్య చేసుకోవడమో జరిగింది. ఇవి ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ పోలీస్‌ స్టేషన్లో నమోదైన రికార్డులు. ఇక పోలీస్‌ స్టేషన్‌ వరకు రాని కేసులు ఇంకెన్నో. ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లో ఓ అధ్యయనం జరిగింది. అందులో 14 మంది అత్యాచార బాధితుల కేసులు విచారిస్తే వాళ్లలో ఎక్కువమంది చెప్పిందేమిటంటే కమిషనర్‌ స్థాయిలోని ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటే లేదా కోర్టులు జోక్యం చేసుకుంటే మాత్రమే పోలీస్‌ స్టేషన్‌లో కేసు రికార్డు చేస్తున్నారు. పోలీస్‌ స్టేషన్లో కేసు రికార్డు చేయడానికే పరిస్థితి ఇలా ఉంటే ఇక శిక్షలు పడేదెక్కడ. హత్రాస్‌ ఘటన మనం అందరం మర్చిపోలేము. అంతెందుకు కుస్తీ పోటీల్లో పథకాలు సాధించిన వినేష్‌ ఫొగాట్‌, సాక్షి మాలిక్‌ వంటి వాళ్ల కేసు చూశాం కదా! బీజేపీ నాయకుడు బ్రిడ్జ్‌ భూషణ్‌ని వెనకేసుకురావడానికి చూపించిన ఉత్సాహం దేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఆడపిల్లలకు న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇది మన ప్రభుత్వాల వరుస. దేశంలో స్త్రీల రక్షణ కరిమింగిన వెలగపండులా తయారైంది.
హింస ఒకేలా ఉండదు
హింస అన్ని తరగతుల ప్రజల మీద ఒకే విధంగా ఉండదు. మహిళలు ఈ సమాజంలో రెండో తరగతి పౌరులుగా చూడబడుతున్నారు. ఆ మహిళల్లో కూడా సామాజికంగానూ, ఆర్థికంగానూ వెనకబడి ఉన్న కుటుంబాల స్త్రీలు ఇంకా ఎక్కువగా హింసించబడుతున్నారు. బలహీనులు ఎప్పుడు బలవంతుల చేతుల్లో ఆట బొమ్మలే. తమ ఆధిపత్యాన్ని చలాయించడానికి బలహీనుల మీదే ప్రతాపం చూపిస్తుంటారు. అట్లా ఎక్కువగా బలి పశువులయ్యేది స్త్రీలు, పిల్లలు. వారిలో కూడా అట్టడుగు వర్గాల స్త్రీలు, పిల్లలు. వారి మీదే అత్యధికంగా వేధింపులు, దాడులు జరుగుతున్నాయి. ఈ వేధింపులు బయట ఇంటా కూడా. ఈ హింస వల్ల బాధితులైన స్త్రీలు, పిల్లల పరిస్థితి ఏమిటి? పోలీస్‌ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగటం అనేది మరొక హింస. జీవితాంతం వారి మనసుల మీద, శరీరం మీద పడిన బాధను భరిస్తూనే ఉండాలి. దీనివల్ల శరీరకంగా, మానసికంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న కేసులు కోకొల్లలు. నిరంతరం ఆత్మ న్యూనత వేధిస్తుంది. ‘నాకే ఇలా ఎందుకు జరగాలి’ అనే సమస్య పదేపదే వస్తూ ఉంటుంది. నిద్ర సరిగా పట్టదు. నిద్రపోని రాత్రులు ఎన్నో. ఆఖరికి చచ్చిపోదాం అనే ఆలోచనలు వస్తుంటాయి. ఆత్మహత్యలు చేసుకుంటున్నా వాళ్ళు కూడా తక్కువేం కాదు.
హింస ఆనవాయితీగా మారింది
ఈ సమాజంలో ఉన్న ఒక దౌర్భాగ్యం ఏంటంటే తప్పు చేసిన వారిని శిక్షించాల్సింది పోయి, బాధితుల్ని శిక్షించే సంస్కృతి. ‘ఎద్దు పుండు కాకికి ముద్దు’ అన్నట్లు.. తప్పు చేసిన వాడు బోరవిరుచుకొని తిరుగుతాడు. బహుశా గర్వంగా కూడా నేమో. కాలరెగరేసి తిరుగుతాడు. ‘వాడి సంగతి తేలుద్దాం’ అనే జ్ఞానం పోయి బాధితుల వెంటపడటం, ‘ఈ అమ్మాయే’ అని వేలెత్తి చూపించడం జరుగుతుంది. అలాగే ‘వాడి పెళ్ళాన్ని వాడు కొట్టుకున్నాడు మనకెందుకు’, ‘తప్పదమ్మా! సీతా సావిత్రి పుట్టిన దేశం మనది’ అని సర్దుకోవడం, సర్దుకు పొమ్మని చెప్పటం ఆనవాయితీగా ఉంది. ఇలా ఆడవాళ్లంటే శీలం, పాతివ్రత్యం, సంసార జీవితానికి నిదర్శనం అంటూ చెప్పుకొస్తారు. ఇవే కుటుంబ గౌరవానికి నిదర్శనంగా భావించినన్నాళ్లు సమస్యలకు పరిష్కారం దొరకదు.
ధోరణిలో మార్పు రావాలి
స్త్రీలపై పైకి కనిపించీ కనిపించకుండా జరుగుతున్న హింసపై, ఇంటా బయట జరుగుతున్న హింసపట్ల సమాజం సున్నితంగా, అప్రమత్తంగా ఉండాలి. బాధిత స్త్రీలకు, పిల్లలకు అండగా నిలబడాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూడటం కాదు. మహిళలు సంఘటితం కావాలి. మహిళలకు తోటి పురుషులు – కుటుంబాల్లో పురుషులైన, కుటుంబం బయట పురుషులైనా, వివిధ సంఘాల్లో పురుషులైన స్త్రీలకు అండగా నిలబడాలి. హింసను వ్యతిరేకించడానికి, హింసను తొలగించడానికి, హింసా పూరిత వాతావరణాన్ని, ధోరణులను, మనస్తత్వాన్ని తొలగించడానికి ముందుకు రావాలి.
– ఎస్‌.పుణ్యవతి, 9490098029

Spread the love