ఉద్యమాలూ మెట్లెక్కుతాయి!

Movements will also step up!‘నా జీతం పెంచాలి!’ ‘నాకూ బోనస్‌ కావాలి!’ ఆకలి కేకలవి. జీవన సమర రాపిడిలో నుండి పుట్టిన నినాదాలవి. అప్పుడే పుట్టిన బిడ్డ కూడా ఏడ్చిగోల చేయ కపోతే ఏ తల్లీ పాలివ్వదన్న సంగతి జగద్విదితమే. మార్కెట్‌లో జరిగే దోపిడీ కండ్లారా చూసి, సంపూర్ణంగా అనుభవించిన రైతాంగం, ప్రత్యేకంగా నాటి ఉమ్మడి రాష్ట్రంలో, గిట్టుబాటు ధర కోసం ఉద్యమించిన సందర్భం 1981లో చూశాం. గిట్టుబాటు ధరలు సాధించిన పరి స్థితినీ విన్నాం. ఆ ఉద్యమ రాజకీయ ప్రతిరూపమూ ఆ తర్వాతి కాలంలో మనకి కన్పడింది. స్వాతంత్య్రానంతరం మూడున్నర దశా బ్దాల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో కాం గ్రెస్‌ ఓడి, ఎన్టీఆర్‌ నాయకత్వాన తెలుగుదేశం ప్రభుత్వ మేర్పడింది.
1974లో రైల్వే కార్మికుల సమ్మెపై ఇందిరాగాంధీ పాశవిక దమనకాండ సాగించింది. అది 1976 మధ్య కొచ్చే సరికి ఎమర్జెన్సీ రూపంలో కార్మిక హక్కుల పైనా యావత్‌ ప్రజాతంత్ర హక్కులపైనా దాడిగా సాగింది. ఆ పరిస్థితులు జనతా పార్టీకి పురుడుపోశాయి. దేశం ఊపిరి పీల్చుకుంది. స్వేచ్ఛా వాయువుల ఝంఝా మా రుతం వీచింది. కార్మిక కర్షకోద్యమాలు రాష్ట్రంలోనే గాక, దేశంలోనూ రాజకీయ సోపానాలయిన పరిణామాలవి.
2020 నవంబర్‌లో రాజుకున్న రైతాంగ ఉద్యమం చివరికి అక్షరాల మోడీ మెడలు వంచడమే కాదు, మూడు కార్పొరేట్‌ అనుకూల చట్టాలనూ రద్దు చేయిం చుకోగలిగింది. అయితే ఒకవైపు సంపన్న దేశాలు, ముఖ్యంగా జీ7 దేశాలు, వాటి వత్తిడి. ఇటు రైతాంగ ఉద్యమ ఉధృతి. ఇటు సంఖ్యాబలం. అటు కార్పొరేట్‌ల వజన్‌. కొత్తగా కలిసిన కార్మికశక్తితో మొన్న ఫిబ్రవరి 16న గ్రామీణ బంద్‌, కార్మిక సమ్మెలో పాల్గొన్న ఇరవై కోట్ల మందికి పైగా శ్రమజీవులు మోడీ సర్కార్‌కు దాని భవిష్యత్‌ ఎలా ఉండబోతోందో మచ్చుకి రుచి చూపించారు.
నేడు ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి బయటికి రావాలంటూ ఢిల్లీని గేరి వేసిన రైతాంగం సమర నినాద మిస్తే, అది దేశమంతా ప్రతిధ్వనిస్తోంది. వామపక్ష ఆర్థిక వేత్తలే కాదు, అమర్త్యసేన్‌ వంటి నోబెల్‌ గ్రహీతలు, పెట్టు బడిదారీ విధానం కూలిపోకుండా చూసుకోవాలనుకునే జోసెఫ్‌ స్టిగ్లిడ్జ్‌లు, థామస్‌ పిక్కెట్టీలు కూడా ప్రపంచంలో పెరుగుతున్న అసమానతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలతాయనడానికి కారణాలౌతాయంటున్నారు. మన దేశ వ్యవసాయాన్నే తీసుకుంటే 1965 – 85 మధ్యకాలంలో చేసుకున్న విపరీతమైన రీసెర్చ్‌ ఫలితంగా దేశం లో వ్యవసాయ రంగంలో ఉత్పత్తి, ఉత్పాదకత సుమారు ఐదు రెట్లు పెరిగింది. ఇదంతా హరిత’విప్లవ’ ఫలితం. ఒకపక్క ఎమ్‌.ఎస్‌. స్వామినాథన్‌కు ‘భారతరత్న’ ఇచ్చి సేంద్రియ వ్యవసాయం వైపు మోడీ సర్కార్‌ మళ్లిస్తోంది. ఆ పేరున శ్రీలంక మునిగిన అనుభవం మనకండ్లెదుటే ఉంది.
డబ్ల్యూ.టి.ఓ. ఆదేశంతోనే మూడు వ్యవసాయ చట్టా లను మోడీ సర్కార్‌ ప్రతిపాదించింది. నేడు వాటిని ఉప సంహరించుకుంటున్నామని ప్రభుత్వం చెప్పినా మద్దతు ధరకు (ఎంఎస్‌పి కి) గ్యారంటీ లేకపోయేసరికి రైతాంగం డబ్ల్యూ.టి.ఓ. నుండి బయటికి రావాలనే డిమాండును లంకించుకుంది. 1995 – 2005 మధ్య పాత సబ్సిడీల విధానం కొనసాగించుకునేందుకు అవకాశం ఉన్నా మొదట కాంగ్రెస్‌, ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వాలు ‘అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న’ అన్నట్లు ఒకరిపై ఒకరు పోటీ పడి సబ్సిడీలను దిగ్గోశారు. దాంతో 1997 నుండి దేశంలో రైతుల ఆత్మహత్యలు ప్రారంభమైనాయి. ఉదా హరణకు జీ7 దేశాల ఆనతి మేరకు దిగుమతి సుంకాలు ఎత్తేయడం వల్ల మన దేశంలో చెరుకు పంట సాగు 5 కోట్ల ఎకరాల నుండి 2.5 కోట్లకి తగ్గింది. విదేశాల నుండి చక్కెర దిగుమతులు జరుగుతున్నాయి. ప్రపంచం లోనే అత్యధికంగా పాలు, మాంసం, గుడ్లు, పసుపు, మిరప, బియ్యం, గోధుమలు, పత్తి మొదలైనవి ఉత్పత్తి చేసే మన దేశంలో ఆరు నెలల క్రితం కోసి, ఐస్‌లో ఫ్రీజ్‌ చేసిన కోడి భాగాలు వంటివి, పాల ఉత్పత్తుల దిగుమతితో వ్యవసాయ అనుబంధ రంగాలన్నీ ధ్వంస మవుతున్నాయి.
ఒక పక్క మన ఎగుమతులను దెబ్బతీస్తూ జీ 7 దేశాల నుండి ఈ రకంగా మన దేశంపై వారి సరుకులను డంప్‌ చేస్తున్నాయి. అందుకే డబ్ల్యూ. టి.ఓ. నుండి బయటికి రావాలన్న డిమాండు నూటికి నూరుపాళ్లు సరైందే. పైగా దేశభక్తి యుతమైనది కూడా.
ముందు యంత్రాల్నే శత్రువులుగా భావిం చిన బ్రిటన్‌ కార్మికవర్గ లుడ్డైట్‌ వీరుల నుండి రైతాం గాన్ని బాసటగా నిలుపుకుని సోవియట్‌ రాజ్య స్థాపన చేసిన కార్మికోద్యమం వరకు ఎన్నో మెట్లెక్కింది కార్మికోద్యమం.
”జనం భూమిలో సంఘాలు నాటడం” నేర్చుకోవడం ఒక ఎత్తు. దేశాన్ని తాకట్టుపెట్టే పాలకులను ఇంటిదారి పట్టించడం కీలకమెట్టు.

Spread the love