– 36 పరుగుల తేడాతో టైటాన్స్ గెలుపు
– రాణించిన సిరాజ్, సాయి సుదర్శన్
ముంబయి ఇండియన్స్‌కు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ ముంగిట తలొంచిన ముంబయి ఇండియన్స్ అంచనాలను అందుకోలేదు. మహ్మద్ సిరాజ్ (2/34), సాయి సుదర్శన్ (63) మెరుపులతో గుజరాత్ టైటాన్స్ సీజన్లో తొలి విజయం సాధించింది.
నవతెలంగాణ-అహ్మదాబాద్
ఐపీఎల్18లో గుజరాత్ టైటాన్స్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో పరాజయం నుంచి పుంజుకున్న గుజరాత్ టైటాన్స్ శనివారం అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. 197 పరుగుల ఛేదనలో ముంబయి ఇండియన్స్ చతికిల పడింది. రోహిత్ శర్మ (8), రియాన్ రికెల్టన్ (6) నిరాశపరచగా.. తిలక్ వర్మ (39, 36 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (48, 28 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు) మూడో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ రాబిన్ మింజ్ (3), హార్దిక్ పాండ్య (11, 17 బంతుల్లో 1 ఫోర్) విఫలం అయ్యారు. నమన్ ధిర్ (18 నాటౌట్), మిచెల్ శాంట్నర్ (18 నాటౌట్) ఆఖర్లో ధనాధన్‌తో నెట్‌రన్‌రేట్‌ను మెరుగుపర్చారు. ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులే చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ (63, 41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో మెరువగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (38, 27 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), జోశ్ బట్లర్ (39, 24 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.