నా పోరాటం ముగిసింది.. ఇక పోరాడాల్సింది మీరే : కేసీఆర్

నవతెలంగాణ అచ్చంపేట: తెలంగాణ కోసం తాను పోరాడుతున్నప్పుడు ఈ నేతలంతా ఎవరి కాళ్లదగ్గర ఉన్నారో తెలియదని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. పాలమూరు ప్రజలు బొంబయికి వలస పోయినప్పుడు ఎవరైనా వచ్చారా? అని ప్రశ్నించారు. పదేండ్ల కిందటి వరకు పాలమూరు జిల్లాలో గంజి, అంబలి కేంద్రాలు ఉండేవని తెలంగాణ వచ్చినక పరిస్థితి ఎట్లా మారిందో ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.
‘‘తెలంగాణ కోసం 24 ఏండ్లు కిందట ఒంటరిగానే ప్రయాణం ప్రారంభించా. కరెంటు, తాగునీరు, సాగునీరు లేక ఎన్నో కష్టాలు పడ్డాం. ఇవాళ దేశం మొత్తంలో 24గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం నిలిచాం. దేశానికి దిక్సూచిగా నిలిచే స్థాయికి తెలంగాణ ఎదిగింది. ఇంటింటికీ నల్లా నీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కొండగల్‌ రా.. గాంధీ బొమ్మ దగ్గరకు రా.. అని కొందరు నాకు సవాలు విసురుతున్నారు. కేసీఆర్‌ దమ్ము ఏంటో దేశమంతా చూసింది.. కొత్తగా చూపాల్సిన అవసరం లేదు. నా పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టే.. విజయవంతం అయ్యాను.“ అని అన్నారు.

తెలంగాణ పదేండ్ల ప్రయాణంలో రెండోసారి ఎన్నికలు వచ్చాయి. రాష్ట్రం కోసం నావంతు పోరాటం అయిపోయింది.. ఇక పోరాడాల్సింది మీరే. 60లక్షల టన్నుల ధాన్యం పండే తెలంగాణ.. ఇవాళ 3కోట్ల టన్నుల ధాన్యం పండిస్తోంది. 24 గంటల కరెంటు ఇస్తే.. కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ కండువా కప్పుకొంటానని జానారెడ్డి సవాల్‌ విసిరారు. ఆ తర్వాత వెనక్కితగ్గారు. రైతు బంధు అనే పథకానికి ఆద్యుడు కేసీఆర్‌. రైతు బంధును దశలవారీగా రూ.16వేలకు పెంచుతాం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్‌ నేతలు 109 కేసులు వేశారు. ప్రాజెక్టులు పూర్తయితే కేసీఆర్‌కు మంచిపేరు వస్తుందని కేసులు వేసి అడ్డుకున్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి అచ్చంపేట నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు ఇస్తాం. ఎవరు గెలిస్తే తెలంగాణ ముందుకు వెళ్తుందో వారినే గెలిపించాలి. ఉన్న తెలంగాణ పోగొట్టిందే కాంగ్రెస్‌ పార్టీ. తెలంగాణ ఇస్తామని 2004లో ప్రకటించి 2014లో ఇచ్చారు. 32 పార్టీల మద్దతు కూడగట్టి తెలంగాణ సాధించా’’ అని సీఎం కేసీఆర్‌ చెప్పారు.

Spread the love