నవతెలంగాణ -హైదరాబాద్ : తెలంగాణలో 40 చోట్ల అభ్యర్థులే లేని కాంగ్రెస్.. 70 చోట్ల గెలుస్తామని ఆ పార్టీ నాయకులు ఎలా చెబుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ శుక్రవారం మీడియాతో చిట్‌చాట్ చేశారు. డబ్బులు ఇచ్చిన వారికే కాంగ్రెస్ టికెట్లు దక్కుతున్నాయి. కూకట్‌పల్లి సీటు కోసం రూ. 15 కోట్లు అడిగారని ఓ కాంగ్రెస్ నేత చెప్పారు. నేను చెప్పినట్టే కర్ణాటకలో అక్రమ డబ్బు జమ అవుతోంది. ఇప్పటికే రూ. 8 కోట్లు కొడంగల్ చేరినట్టు సమాచారం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే కేసీఆర్ వంద నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారని కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీ, సిరిసిల్ల, కామారెడ్డిలో నేను ప్రచారం చేస్తాను. ఎన్నికల నిర్వహణలో ఈసీ స్వతంత్రంగా పని చేస్తుందని భావిస్తున్నా. అధికారుల బదిలీలను సాధారణ బదిలీలుగానే చూస్తాం. హుజురాబాద్‌లో కూడా మేమే గెలుస్తాం. రాహుల్ గాంధీ లీడర్ కాదు.. రీడర్ అని కేటీఆర్ విమర్శించారు. పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్‌లో చేరుతానంటే రేపే వెళ్లి ఆహ్వానిస్తాను. త్వరలో చాలా మంది ప్రముఖులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత గాంధీ భవన్‌లో తన్నుకుంటారు. కాంగ్రెస్‌లో సీఎం పదవికి ఇద్దరి మధ్య అంగీకారం కుదిరినట్టు సమాచారం ఉందన్నారు. అమిత్ షా అబద్ధాలకు హద్దే లేదని కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీని వారి నాయకత్వమే సీరియస్‌గా తీసుకోవడం లేదు. బీజేపీ 110 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడం ఖాయం. బీజేపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుంది. బీజేపీతో స్నేహముంటే మోదీని ఎందుకు తిడుతాం. మేం ప్రతీకార రాజకీయాలు చేయడం లేదు. రేవంత్ అక్రమాలపై ఐటీ, ఈడీ సోదాలు ఎందుకు చేయడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. చంద్రబాబు ఆరోగ్యంపై లోకేష్ ట్వీట్ బాధ కలిగించిందని కేటీఆర్ పేర్కొన్నారు. కుమారుడిగా తండ్రి ఆరోగ్యంపై ఆందోళన ఎలా ఉంటుందో తెలుసు. కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో నాకూ ఆందోళన కలిగింది. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలనే ఇక్కడ ఆందోళనలు వద్దంటున్నాం అని కేటీఆర్ తెలిపారు.