– ఆయనతోపాటే కుమారుడు రోహిత్
– బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కుంభం అనిల్‌కుమార్ కూడా
న్యూఢిల్లీ: బీఆర్‌ఎస్ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో బీఆర్‌ఎస్‌కు చెందిన బిగ్ షాట్‌లు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ రెడ్డి గురువారం కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో వీరంతా కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఖర్గే వీరందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాగా ఢిల్లీలో జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి , సీనియర్ నేత షబ్బీర్ అలీ, శ్రీనివాస్ రెడ్డి పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు. త్వరలోనే బీఆర్‌ఎస్‌లో టికెట్ రాని మరో ఇద్దరు సిట్టింగులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి తాజా చేరికలతో కాంగ్రెస్‌కు మరింత బలం చేకూరినట్లయింది. మైనంపల్లి హన్మంతరావు తన కుమారుడు రోహిత్‌కు మెదక్ టికెట్ ఇవ్వకపోవడంతో బీఆర్‌ఎస్ తిరుగుబావుటా ఎగరేశారు. వేముల వీరేశం పరిస్థితి కూడా అంతే. కుంభం అనిల్ మాత్రం కాంగ్రెస్ నుంచి కొద్దిరోజుల క్రితం బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుని మళ్లీ సొంత గూటికి వచ్చేశారు.