పెద్ద కంపెనీ చాటున నాసిరకం మందుల అమ్మకాలు
అధిక ధరలతో రైతులను
దోపిడీ చేస్తోన్న వ్యాపారులు
కృష్ణా పరివాహక ప్రాంతంలో
అధికంగా అమ్మకాలు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పెరిగిన మిర్చి సాగు
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
పత్తి పంటకు అదును దాటిపోవడం, వరికి తగినంత నీటి లభ్యత లేకపోవడంతో రైతులు ఆహార, వాణిజ్య పంట అయిన ఎర్ర మిర్చి సాగుపై దృష్టి సారించారు.దీంతో ఈ ఏడాది అనూహ్యంగానే ఎర్రమిర్చి సాగు రెట్టింపయ్యింది. ఇదే అదును గా భావించిన దళారీ వ్యాపారులు మిర్చి విత్తనాలు, క్రిమి సంహారక మందుల కోసం తమ దగ్గరకు వచ్చిన రైతులకు ఒక పెద్ద కంపెనీకి చెందిన మందును తక్కువ ధరకు ఇచ్చి, దాని వెంట నాసిరకం మందుల్ని అధిక ధరలకు విక్రయిస్తూ నిలువు నా ముంచుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాత గుంటూరు జిల్లా పరిధిలో ఉండే మాచర్ల వ్యాపారులు నల్లమల ప్రాంతానికి చెందిన రైతులను చూసి నకిలీ విత్తనాలతో పాటు అధిక ధరలకు పురుగు మందులను అమ్ముతూ రైతులను మోసం చేస్తున్నారు. నల్లమల ప్రాంతంలోని అచ్చంపేట అటవీ ప్రాంతమైన అమ్రబాద్, పదర, మన్ననూరు, అచ్చంపేట, ఉప్పునుంతల, బల్మూరు, తదితర మండలాలతో పాటు కొల్లాపూర్, వనపర్తి, గద్వాల జిల్లాల పరిధిలో ఎర్రమిర్చి అధికంగా సాగవుతోంది. ఇక్కడ బీఎఎస్‌ఎఫ్, టాటా, అదామా ర్యాలీస్ వంటి పెద్ద కంపెనీల మందులను తక్కువ ధరలకు అమ్ముతుంటారు. టాటా కంపెనీకి చెందిన పిచికారి మందు రూ. 2500కు అమ్మాల్సి ఉండగా రూ. 2000కే అమ్ముతున్నారు. అదే క్రమంలో తక్కువ ధరలు ఉన్న నాలుగైదు రకాల మందుల ధర రూ. 1000 ఉంటే రూ. 1500కు విక్రయిస్తున్నారు. పెద్ద కంపెనీ మందుతో పాటు నాలుగు రకాల చిన్న బ్రాండ్ల పిచికారి మందులు అమ్మడం వల్ల వ్యాపారికి రూ. 2000 లాభం వస్తోంది. టాటా కంపెనీ మందును తక్కువకు అమ్మడం వల్ల వ్యాపారులకు రూ. 500 నష్టం వస్తే.. చిన్న మందులను రైతులకు అంటగట్టి రెండు వేల వరకు లాభం పొందుతున్నారు. అయితే రైతులకు చిన్న మందుల ధరల విషయంలో అవగాహన లేకపోవడంతో వ్యాపారులు ఇష్టానుసారంగా దోపిడీ చేస్తున్నారు.
నల్లమల నుంచి మాచర్లకు
నల్లమల ప్రాంతంలో కొందరు మాచర్ల నుంచి వచ్చి విత్తనాలు, క్రిమిసంహారక మందుల గురించి ప్రచారం చేస్తారు. ప్రధానంగా మాచర్ల నుంచి వచ్చిన టాటా కంపెనీ మందు ధర చూపించి స్థానికంగా వ్యాపారులు అధిక ధరలకు అమ్ముతున్న విషయాన్ని రైతులకు చెబుతారు. అది చూసిన రైతులు నల్లమల పదర వంకేశ్వరం మీదుగా మద్దిమడుగు నుంచి పడవలో కృష్ణ దాటి మాచర్ల పోయి క్రిమి సంహారక మందులు తెచ్చుకుంటున్నారు.
జిల్లా సరిహద్దులు దాటి
జిల్లాలో ఉన్న నల్లమల నుంచి మాచర్లతో పాటు కొల్లాపూర్ , వనపర్తి నుంచి కర్నూల్ వెళ్లి మందలు తెచ్చుకుంటున్నారు. నారాయణపేట జిల్లా వాసులు కర్నాటక పోయి పిచికారి మందులు తెచ్చుకుంటున్నారు. జిల్లాలో క్రమంగా ఇదే వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇతర టాటా , బీఎఎస్‌ఇ, అదామా వంటి కంపెనీల మందులు ఒకటి తక్కువ ధరకు ఇచ్చి చిన్న కంపెనీల ఇతర పిచికారి మందులు అంటగడుతూ.. రైతులను మోసం చేస్తున్నారు. తులం మిర్చి విత్తనాలు రూ. 1000కి పైగా అమ్ముతున్నారు. దాని అసలు ధర రూ. 500కు మించి ఉండదు.
పెరిగిన మిర్చి సాగు
ఉమ్మడి జిల్లాలో మిర్చి సాగు రెట్టింపు అయ్యింది. ప్రధానంగా పత్తికి అదును దాటిపోయింది. వరికి తగిన నీటినిల్వలు లేవు. ఇక మిగిలింది మిర్చి పంట మాత్రమే. గతంలో దీన్ని వర్షాధార పంటగా సాగు చేసేవారు. ఇప్పుడు హైబ్రీడ్ సీడ్ వచ్చింది. దీన్ని ఆరుతడి పంటగా కూడా సాగు చేస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో గతేడాది 1500 ఎకరాలు సాగు అయితే ఈసారి 4వేల ఎకరాలకు పైగా సాగయ్యింది. వనపర్తి జిల్లాలో 2300 ఎకరాలు, గద్వాల జిల్లాలో 3400 ఎకరాలు, నారాయణపేట జిల్లాలో 1750 ఎకరాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 1200 ఎకరాలు సాగు అయ్యింది. పెరిగిన సాగును దృష్టిలో ఉంచుకొని రైతులను మందులు, మిర్చి విత్తనాలు విక్రయించి వ్యాపారులు లాభాలు పొందుతున్నారు.
అధిక దిగుబడులే లక్ష్యంగా ..
అధిక దిగుబడులు లక్ష్యంగా రైతులు హైబ్రిడ్ విత్తనాలను ఎన్నుకుంటారు. ముఖ్యంగా విత్తనాలతో పాటు క్రిమిసంహారక మందులను సైతం ఎంపిక చేస్తారు. ఒక ఎకరంలో సుమారు 30 క్వింటాళ్ల మిర్చి దిగుబడి వస్తోంది. ఎకరం సాగుకు సుమారు లక్ష వరకు పెట్టుబడి అవుతుంది. అధిక పెట్టుబడి అయినా సరే మంచి మార్కెట్ ఉంటే లాభాలు వస్తాయని ఊహించి మిర్చిని సాగు చేస్తున్నారు.
మార్కెట్ వ్యవస్థ లేక
జిల్లాలో ప్రతియేటా మిర్చి సాగు పెరుగుతుంది. దీని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మార్కెట్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమైంది. మిర్చి దిగుబడి వస్తే.. ఇంట్లో నిల్వ చేయలేక మార్కెట్‌లో అమ్ముకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
నల్లమల మిర్చికి.. మాచర్ల ధరల గండం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



