దేశం ఇప్పుడు ద్రవిడ మోడల్‌ను అనుసరించాలి: కమల్‌హాసన్‌

నవతెలంగాణ – చెన్నై :    గుజరాత్‌ మోడల్‌ని వదిలి,  దేశం  ఇప్పుడు  ద్రవిడ మోడల్‌ను అనుసరించాలని   ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్‌   పిలుపునిచ్చారు.  డిఎంకె దక్షిణ చెన్నై అభ్యర్థి తమిళచ్చి తంగపాండియన్‌కు మద్దతుగా మైలాపూర్‌లో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించి, నెలకు రూ.వెయ్యి నగదు పొందితే ఎంత బాగుంటుంతో ఆలోచించాలని ప్రజలకు సూచించారు. గుజరాత్‌ మోడల్‌తో దేశంలో పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, నియంతృత్వం పెరిగిపోయాయని మండిపడ్డారు.   భారతదేశం ద్రవిడ నమూనాను అనుసరిస్తే మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. చిన్న తరహా వ్యాపారాలు దెబ్బతినడంతో.. మహిళలు పనులకు వెళ్లేందుకు ఉచిత బస్సు ప్రయాణం కొంతమేర సహాయపడిందని అన్నారు. దేశ ప్రజలు ‘గుజరాత్‌ మోడల్‌ గొప్పదనే వాదన అసత్యమని, కానీ ప్రస్తుతం దేశం ద్రవిడ నమూనాను అనుసరించే సమయం వచ్చిందని అన్నారు. సిఎఎతో రాజ్యాంగంపై దాడి జరుగుతోందని, దీంతో ఇప్పుడు మన హక్కులను మనం సాధించుకోవాలని అన్నారు.

Spread the love