Thursday, August 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముదురుతున్న జాతీయ జెండా వివాదం

ముదురుతున్న జాతీయ జెండా వివాదం

- Advertisement -

మున్సిపల్ కమిషనర్ తీరుపై నిరసనలు.. ఆర్డీవోకు బీజేపీ నాయకుల ఫిర్యాదు
నవతెలంగాణ–పరకాల

పరకాల అమరధామంలో ఆగస్టు 15న నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో జాతీయ పతాకానికి గౌరవ వందనం చేసే విషయంలో మున్సిపల్ కమిషనర్ వ్యవహరించిన తీరుపై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. బాధ్యతాయుతమైన ప్రభుత్వ హోదాలో ఉన్న అధికారి జాతీయ పతాకానికి గౌరవ వందనం చేయకుండా వ్యవహరించారంటూ బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం జాతీయ పతాక గౌరవానికి భంగం కలిగించేలా ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం పరకాల ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు.

జాతీయ పతాకాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న అధికారులు సైతం జాతీయ పతాక గౌరవానికి సంబంధించిన నిబంధనలను పాటించాల్సిన బాధ్యత కలిగి ఉంటారని నిరంజన్ అన్నారు. జాతీయ పతాకం విషయంలో నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యానికి తావు ఉండకూడదని, ఘటనపై సమగ్రంగా విచారణ జరిపి బాధ్యత ఎవరిదో నిర్ధారించిన అనంతరం చట్టపరంగా, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

“జాతీయ పతాక గౌరవం విషయంలో రాజకీయాలకు, అధికార దర్పానికి, నిర్లక్ష్యానికి తావులేదు. జాతీయ జెండాను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ప్రభుత్వ అధికారులు కూడా దీనికి అతీతులు కారు” అని గాజుల నిరంజన్ అన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే స్థానికంగా చర్చ జరుగుతుండగా, బీజేపీ నాయకులు అధికారికంగా ఆర్డీవోను ఆశ్రయించడంతో వివాదం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఘటనకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ లేదా సంబంధిత అధికారుల వివరణ వెలువడాల్సి ఉంది. అధికారిక విచారణ అనంతరం వాస్తవ పరిస్థితులు స్పష్టమయ్యే అవకాశం ఉంది. వినతిపత్రం సమర్పించిన వారిలో బీజేపీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆర్.పీ. జయంతీలాల్, దేవునూరి మేఘనాథ్, రాష్ట్ర నాయకులు కాచం గురు ప్రసాద్, పట్టణ ఉపాధ్యక్షుడు మిడిదొడ్డి నరేష్, సోషల్ మీడియా కన్వీనర్ మెంతుల సురేష్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -