1918 సంవత్సరం లో భారత జాతీయ వైజ్ఞానిక మంత్రిత్వ శాఖవారు జాతీయ గ్రంథాలయ సదస్సును లాహోర్‌లో నిర్వహించారు. అప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో గ్రంథాలయ ఉద్యమం ఊపు అందుకుంది. ఈ కార్యక్రమానికి ఆంధ్ర దేశం నుండి గ్రంథ పాలకులు, గ్రంథాలయ ఉద్యమకారులు పాల్గొనదలిచారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం వారిని అనుమతించలేదు. ఆ మరుసటి సంవత్సరం 1919లో మద్రాస్ లోని గోకలే హాల్ నందు పద్మశ్రీ అయ్యంకి వెంకటరమణయ్య రెండు రోజులపాటు నవంబర్ 14, 15 తేదీలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బరోడా సంస్థానం నుండి కుడాల్కర్ అనే గ్రంధాలయ అధికారి అధ్యక్షులుగా వ్యవహరించారు. 1968లో భారత ప్రభుత్వం శ్రీ చక్రవర్తి గారి అభ్యర్థన మేరకు గ్రంథాలయాలకు జాతీయ వ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహించాలని తీర్మానించారు. తెలుగువారు విజయవంతంగా నిర్వహించిన తొలి జాతీయ సదస్సు జరిగిన తేదీల నుండి జాతీయ గ్రంథాలయ దినోత్సవం గా ప్రకటించడం జరిగింది. ఈ సంవత్సరం మనం 56వ జాతీయ వారోత్సవాలను జరుపుకుంటున్నాం.
గ్రంథాలయ వారోత్సవాలు (వారం రోజులపాటు) నవంబర్ 14 నుండి 20వ తారీకు వరకు అన్ని పౌర, అకాడమిక్, స్పెషల్ గ్రంథాలయాలలో ఘనంగా దేశ వ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ వారం రోజులపాటు గ్రంథాలయలలో ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తారు అనే విషయాలను చర్చించినట్లైతే ముఖ్యంగా గ్రంథాలయాలలోని కొత్త పుస్తకాలు, ప్రాముఖ్యత గల పుస్తకాలు, రీడింగ్ డిమాండ్ ఉన్నటువంటి పుస్తకాలన్నింటినీ ప్రదర్శన నిర్వహించి విద్యార్థులను, పెద్దలను, మహిళలను, ఒక్కరేమిటి ఆబాల గోపాలాన్ని గ్రంథాలయాలకు ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్, కవితలు, వక్తత్వం… ఇలా అనేక రంగాల్లో పోటీలు, బుక్ రివ్యూస్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి చదువరులను ఎక్కువగా ఈ వారోత్సవాలలో పాల్గొనేలా ప్రయత్నం చేస్తారు. అవసరమైతే విద్యార్థులను, పెద్దలను ఆకర్షించే ప్రయత్నం చేసేందుకు వివిధ వినూత్న కార్యక్రమాలు (బుక్ హంట్, బుక్ రివ్యూస్, నూతన పుస్తక రచయితలచే సంభాషణ, కవిత్వం ఏ విధంగా రాయాలి, రచన ఏవిధంగా చేయాలి, నాయకుడిగా ఏ విధంగా ఎదగాలి, పోటీ పరీక్షలకు ఏవిధంగా చదవాలి మొదలగు) నిర్వహించి గ్రంథాలయం పై పుస్తకాలపై, పుస్తక పఠనంపై ఆసక్తి కలిగించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలి. ఏ గ్రంథాలయమైనా నాలుగు కాలాలపాటు వెలుగొందాలంటే ఆ గ్రంథాలయంలో సరియైన పుస్తక సంపద ఉన్నదా, ఉన్న పుస్తక సంపద ప్రస్తుత చదువురులకు ఉపయోగపడుతున్నదా, గ్రంథాలయానికి ఆర్థిక వనరులు సమతుల్యంగా ఉన్నయా, గ్రంథాలయలలో సేవలు అందించే గ్రంథ పాలకులు ఉన్నారా, గ్రంథాలయ భవనాలు సరిగా ఉన్నయా, మౌలిక వసతులు అన్నీ సమపాళ్లల్లో ఉన్నప్పుడు మాత్రమే గ్రంథాలయాలు చదువరులకు సేవలందిస్తాయి. పుస్తకాల గురించి చర్చకు వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న పౌర గ్రంథాలయాలలో ఆ ప్రాంత పరిసర జనాభా కనుగుణంగా గ్రంథాలయాలు ఏర్పాటు చేయలేదు అనేది వాస్తవం. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, కేరళ; ఈశాన్య రాష్ట్రాలలో మిజోరం; ఉత్తరాది రాష్ట్రాలలో ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలలో ఉన్న పుస్తక సంపద ప్రస్తుత చదువరులకు కనుగుణంగా ఉన్నది. తమిళనాడు, కేరళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రంలో పుస్తక సంపద బాగా ఉన్నప్పటికిని అది ప్రస్తుత చదువరుల అవసరాలకు అనుగుణంగా లేదని, ఒకటి రెండు రాష్ట్రాల్లో మాత్రమే బాగా ఉన్నాయని సర్వేలు చెప్తున్నా యి. ఇక భవనాలు ఫర్నిచర్ విషయాలలో చర్చించినట్లయితే ఉత్తరాది రాష్ట్రాలతో (ఢిల్లీ, పంజాబ్ తప్ప) పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు చక్కటి భవన సముదాయము ఫర్నిచర్ కలిగి ఉన్నాయి. గ్రంథ పాలకుల విషయంలో కేరళ, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలలో తప్పితే గ్రంథ పాలకుల నియామకం కానీ, ఉన్న గ్రంథ పాలకుల సామర్థ్యం కాని అథమ స్థానంలో ఉన్నాయని, పుస్తకాలు ఉపయోగించుకునేటువంటి వారిలో అత్యధికంగా ఢిల్లీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానా, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి.
వివిధ రాష్ట్రాలలో గ్రంథాలయ పన్ను ద్వారా పౌర గ్రంథాలయాలకు ఆర్థిక వనరులు లభ్యమవుతున్నాయి. ఈ ఆర్థిక వనరులు కూడా వసూలు చేసిన సెస్సును గ్రంథాలయాలకు కేటాయించినట్లయితే ఎటువంటి ఇబ్బంది కలగదు. కానీ స్థానిక సంస్థల నుండి కోట్లాది రూపాయలు పౌర గ్రంథాలయాలకు బాకీ ఉన్నాయి. అందుకే దక్షిణాది రాష్ట్రాలలో, ఈశాన్య రాష్ట్రాలలో, గ్రంథాలయాలు ఆర్థిక లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. రాజారామ్ మోహన్‌రారు లైబ్రరీ ఫౌండేషన్ గత ఐదు దశాబ్దాలుగా భారతదేశంలో ఉన్న పౌర గ్రంథాలయాలకు ఆర్థిక వనరులు, పుస్తకాల కొనుగోలు, భవన నిర్మాణాలకు, మౌలిక వసతులకు, గ్రంథ పాలకులకు సెమినార్లు, తర్ఫీదు కార్యక్రమాలు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్ వారు ((IFLA), యునెస్కో లైబ్రరీ మేనిఫెస్టో 1949, 1994, 2021-22 ప్రకారం తొలుత 5000 జనాభాకు ఒక గ్రంథాలయం, రెండువేల జనాభాకు ఒక గ్రంథాలయం, వెయ్యి జనాభా కు గ్రంథాలయం ఏర్పాటు చేయాలి అనే నియమం ఉన్నప్పటికీ అనేక కారణాల వల్ల గ్రంథాలయాలు ఏర్పాటు చేయలేదు. రాజా రామ్మోహన్ రారు లైబ్రరీ ఫౌండేషన్ వారి ప్రకారం దాదాపు 50 వేల పౌర గ్రంథాలయాలు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయబడ్డాయి. మార్గ్ సర్వే ప్రకారం 70,817 పౌర గ్రంథాలయాలు గ్రామీణ ప్రాంతాలలో, 4580 పౌర గ్రంథాలయాలు పట్టణ ప్రాంతాలలో ఏర్పాటు చేయబడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 11500 జనాభాకు ఒక గ్రంథాలయం, 80,000 పట్టణ జనాభాకు ఒక గ్రంథాలయం ప్రస్తుతం సేవలు అందిస్తున్నాయన్నమాట.
గ్రంథాలయాలలో మౌలిక వసతుల కల్పనలో ఉత్తరాది రాష్ట్రాలలో ఢిల్లీ, హర్యానా, పంజాబ్; దక్షిణాది రాష్ట్రాలలో కేరళ, కర్ణాటక ముందంజలో ఉన్నాయని మార్గ్ సర్వే చెబుతున్నది. ఇక నూతన గ్రంథాలయాల ఏర్పాట్లలలో రెండు తెలుగు రాష్ట్రాలలో నూతన గ్రంథాలయాలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లా కేంద్రాలలో నూతన భవనాలు నిర్మించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో నూతన గ్రంథాలయాల నిర్మాణం కానీ మానవ వనరులు లభ్యం కానీ ఆశాజనకంగా లేవు. ఇక్కడ దేశవ్యాప్తంగా 2019-2023 వరకు ఆంధ్రప్రదేశ్ 52, 12,500, తెలంగాణ 1,56,64,992, ఢిల్లీ 15,39,574, కర్ణాటక 72,22,630, తమిళనాడు 4,66,26,782, కేరళ 1,88,04,416, గుజరాత్ 63,25,056, ఉత్తరప్రదేశ్ 10,31,000, మిజోరం 1,12,48,960 రూపాయలను స్టోరేజ్ మెటీరియల్, భవనాలకు, సెమినార్లకు, పిల్లల గ్రంథాలయాలకు, మహిళా గ్రంథాలయాలకు రాజా రామ్మోహన్ రారు లైబ్రరీ ఫౌండేషన్ ద్వారా సహకారం అందిపుచ్చుకున్నారు. అయితే అనేక రాష్ట్రాలు రాజా రామ్మోహన్ రారు లైబ్రరీ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహకారం అందుకోని రాష్ట్రాలు ఇంకా వున్నాయి. అదేవిధంగా ఆర్థిక సహకారం తీసుకున్న తర్వాత యుటిలైజేషన్ సర్టిఫికెట్ సబ్‌మిట్ చేయని రాష్ట్రాలు కూడా వున్నాయి. ఇప్పటికీ రాజా రామ్మోహన్ లైబ్రరీ ఫౌండేషన్ వారు వివిధ రాష్ట్రాల పౌర గ్రంథాలయాలకు భవనాలు, మౌలిక వసతులు, నూతన పుస్తకాల కొనుగోలు, సెమినార్లు, గ్రంథ పాలకులు తర్ఫీదు… తదితరాల కోసం మ్యాచింగ్ గ్రాంట్లను, నాన్ మ్యాచింగ్ గ్రాంట్లను ఇచ్చేందుకు అంగీకారం తెలిపినప్పటికిని అనేక రాష్ట్రాలు వీటికోసం అప్లై చేయకపోవడం ఇబ్బందికరమైన విషయం. ఇక గ్రంథపాలకుల సమస్యలు పరిశీలిస్తే అనేక రాష్ట్రాలలో గ్రంథ పాలకుల సంఖ్య చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. వారు కూడా ఒక గ్రంథ పాలకుడు నాలుగైదు గ్రంథాలయాలను నిర్వహించవలసి వస్తుంది. ఒకవేళ గ్రంథపాలకుడు ఉన్నా తాత్కాలిక ప్రాతిపదికనో, ఒప్పంద పద్ధతి ప్రకారమో, అర్హత లేని గ్రంథపాలకులు ద్వారా గ్రంథాలయ నిర్వహణ చేపడుతున్నారు. దీనివల్ల నాణ్యమైన సమాచారాన్ని పాఠకుడికి సరైన సమయంలో అందించడంలో పౌర గ్రంథాలయాలు విఫలమవుతున్నాయి. తలసరి ఎన్‌ఎస్ డీపీ ప్రకారం భారతదేశంలోని టాప్ 10 ధనిక రాష్ట్రాలను పరిశీలిస్తే సిక్కిం 5.19, గోవా 4.72, తెలంగాణ 3.08, కర్ణాటక 3.01, హర్యానా 2.96, తమిళనాడు 2.73, గుజరాత్ 2.41, కేరళ 2.33, ఉత్తరాఖండ్ 2.33, మహారాష్ట్ర 2.24 లక్షల రూపాయలుగా ఉన్న రాష్ట్రాలు కూడ గ్రంథాలయాలకు నిధులు కేటాయించక పోవడం, సరియైన మౌలిక వసతులు లేకపోవడం, ప్రస్తుత కాల మాన పరిస్థితుల కు అనుగుణంగా పుస్తక వనరులు లేకపోవడం, గ్రంథ పాలకులు లేకపోవడం ఆందోళన కలిగించే అంశం.
Misty copeland చెప్పినట్లు »»Discovery your passions and achieve your goals at the Libraryµµ అలాంటి పౌర గ్రంథాలయాలు అనేక సమస్యలతో అరకొర సేవలు అందిస్తున్నాయి. దానికి కారణం ఈ వ్యవస్థపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సరైన మద్దతు లభించకపోవడం. పౌర గ్రంథాలయాలు అనే అంశం కేంద్ర పరిధిలోకి తీసుకొని గ్రంథాలయాలకు సరైన ఆర్థిక, మౌలిక, పుస్తక వనరులు, మానవ వనరులను సమతుల్యంగా ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఆగస్టు మాసంలో గ్రంథాలయాల పండుగ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు ఘనంగా నిర్వహించి తొలత జాతీయ గ్రంథాలయాలను అనుసంధానం చేయాలి. లైబ్రరీలను దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఉపయోగించుకునే విధంగా, దేశవ్యాప్తంగా ఉన్న పౌర గ్రంథాలయాల నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేసి, అన్ని లైబ్రరీలలో ఉన్న పుస్తక వనరులను తెలుసుకునే విధంగా చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అదేవిధంగా ప్రాముఖ్యత గల గ్రంథాలయాలలోని అపురూపమైన గ్రంథసంపదను డిజిటలైజ్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తామని భారత జాతీయ ప్రభుత్వం ప్రకటించింది. భారత జాతీయ ప్రభుత్వం రాష్ట్రాలలో ఉన్న అన్ని పౌర కేంద్ర గ్రంథాలయాలను డిజిటల్ చేసి జాతీయ గ్రంథాలయాలతో అనుసంధానం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇలా గ్రంథాలయాల ఉన్నతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. అదేవిధంగా ఈ గ్రంథాలయాల ద్వారా నాణ్యమైన సమాచారాన్ని చదువరులకు అందించే ప్రయత్నం చేయాలని ఆశిద్దాం. పర్ క్యాపిటా ప్రకారం పౌర గ్రంథాలయాలపై ప్రపంచవ్యాప్తంగా ఎంత ఖర్చు చేస్తున్నారు అనే విషయంపై చర్చిస్తే ఫిన్లాండ్ 30 డాలర్లు, ఆస్ట్రేలియా 44.44 డాలర్లు, యూఎస్‌ఏ 35.96 డాలర్లు, హాంకాంగ్ 12 డాలర్లు, బ్రిటన్ 32 డాలర్లు, భారతదేశం 0.07 డాలర్లు కేటాయిస్తున్నది. అందుకే ఫిన్ల్యాండ్ ,ఆస్ట్రేలియా, అమెరికా, చైనా దేశాలు గ్రంథాలయాలకు సమృద్ధిగా ఆర్థిక వనరులు కేటాయిస్తూ గ్రంథాలయాలు నూతన శోభను ప్రదర్శిస్తూ చదువరులకు వినూతనమైన సేవలందిస్తున్నాయి.
– డా|| రవికుమార్ చేగొని, 9866928327