22న దేశవ్యాప్త నిరసనలు

22న దేశవ్యాప్త నిరసనలు– ఎంపీలపై వేటు ప్రజాస్వామ్యానికి చేటు.. ఇండియా ఫోరం భేటీ నిర్ణయం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
అన్ని ప్రజాస్వామ్య మర్యాదలను పక్కనబెట్టి, పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీలను మూకుమ్మడిగా సస్పెండ్‌ చేసిన మోడీ ప్రభుత్వ నియంతృత్వ చర్యకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఇండియా ఫోరం ఈ నెల 22న దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. మంగళవారం అశోకా హోటల్‌లో ప్రతిపక్షాల ఇండియా ఫోరం నాలుగో సమావేశం జరిగింది. సమావేశానికి మొత్తం 28 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరి, బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌, తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఎస్పీ నేత అఖిలేష్‌ యాదవ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, శివసేన నేత ఉద్దవ్‌ ఠాక్రే, ఆర్‌ఎల్డీ నేత జయంత్‌ చౌదరి, పీడీపీ నేత మహబూబా ముఫ్తీ తదితరులు హాజరయ్యారు. బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సమావేశంలో మల్లికార్జున్‌ ఖర్గేను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదన చేయగా.. మద్దతు లభించలేదు. అయితే, కోఆర్డినేటర్‌, ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంలో అర్థం లేదని ఖర్గే ఆమె అభిప్రాయాన్ని తిరస్కరించారు. ఎన్నికల తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుందామన్నారు. కేజ్రీవాల్‌ మాత్రమే ఆమె ప్రతిపాదనకు అంగీకరించారు. ఎన్నికల తర్వాతే ప్రధానిపై నిర్ణయం తీసుకోవాలని మెజారిటీ నేతలు అభిప్రాయపడ్డారు.
ఎంపీల మూకుమ్మడి సస్పెన్షన్‌ను ఖండిస్తూ సమావేశం తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు అన్ని పార్టీల నేతల భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా ఉమ్మడి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికలకు సన్నాహాలు వేగవంతం చేయాలని కూడా నిర్ణయించారు. అలాగే ఈవీఎంలు, వీవీపాట్‌లలో 100శాతం కౌంటింగ్‌ నిర్వహించాలన్న తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది.
సమావేశం అనంతరం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే మీడియాకు సమావేశ నిర్ణయాలను వెల్లడించారు. ఎన్నికల తరువాత ఫోరంకి మెజారిటీ వస్తే ఎంపీలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రధానిని ఎన్నుకుంటారని అన్నారు. సీట్ల పంపకాలపై మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ ‘స్థానిక నేతలు మొదటి రౌండ్‌ చర్చలు జరుపుతారు. విభేదాలు ఉంటే సీనియర్‌ నేతలు జోక్యం చేసుకుంటారు. ఉత్తరప్రదేశ్‌, తెలంగాణ సీట్ల పంపకాల సమస్యలు పరిష్కారమవుతాయి. పంజాబ్‌, ఢిల్లీ సమస్యలను ఎలా పరిష్కరించవచ్చో చూసేందుకు ప్రయత్నిస్తాం. మనం ముందుగా విజేతలుగా రావాలి. మాకు ఎంపీలు లేకపోతే, ప్రధానిని ప్రొజెక్ట్‌ చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి?’ అని అన్నారు.
రాష్ట్ర స్థాయిలో సీట్లు సర్దుబాటు: సీతారాం ఏచూరి
సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ రాష్ట్రాల్లో పొత్తులు, అవగాహనలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించామన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే ఇది ఖరారు అవుతుందని అన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలపై నిరసనలు, బహిరంగ సభలు నిర్వహించడంతో ప్రజలను సంఘటితం చేస్తామన్నారు. ఎంపిల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా డిసెంబర్‌ 22న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ఏచూరి తెలిపారు.
త్వరలో అన్నీ మొదలవుతాయి: ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌
ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ ‘సమావేశం బాగా జరిగింది. ప్రచారం, సీట్ల పంపకం, ప్రతిదీ త్వరలో ప్రారంభమవుతుంది’ అని చెప్పారు.
అన్ని నిర్ణయాలను 3 వారాల్లోగా తీసుకుంటాం : ఆర్జేడీ మనోజ్‌ ఝా
ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ ఝా మాట్లాడుతూ ‘చర్చలు స్పష్టంగా జరిగాయి. సీట్ల పంపకం, మాస్‌ కాంటాక్ట్‌ ప్రోగ్రామ్‌ – ఇవన్నీ 20 రోజుల్లో ప్రారంభమవుతాయి. మూడు వారాల్లో అన్ని నిర్ణయాలు తీసుకోబడతాయి’ అని అన్నారు. సీట్ల పంపకాలపై తక్షణమే చర్చ ప్రారంభిస్తామని కాంగ్రెస్‌ నేత కెసి వేణుగోపాల్‌ అన్నారు. సీట్ల భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఉందని అన్నారు.

Spread the love