నిర్వహణకు సర్వం సిద్ధం
దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది దరఖాస్తు
రాష్ర్టంలో 199 పరీక్షా కేంద్రాలు, 73,084 మంది విద్యార్థులు
నవతెలంగాణ – హైదరాబాద్‌బ్యూరో
వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించే నీట్ (యూజీ)-2026 రీ-ఎగ్జామ్ ఆదివారం జరగనుంది. ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో రద్దు చేసిన గత పరీక్షకు బదులుగా జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ఈ రీ-ఎగ్జామ్‌ను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష కోసం నమోదు చేసుకున్నారు. దేశంలోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో 5,432 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. తెలంగాణ నుంచి 73,084 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మొత్తం 199 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాయి. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పెన్-అండ్-పేపర్ విధానంలో జరుగుతుంది. బయోమెట్రిక్ ధృవీకరణ, బహుళస్థాయి తనిఖీలు, కేంద్రాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక చర్యలు అమలు చేస్తున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది. అభ్యర్థులు అడ్మిట్ కార్డు, చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలి. పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలననీ, నిషేధిత వస్తువులను తీసుకురావద్దని పరీక్ష నిర్వహణా సంస్థ ఎన్‌టీఏ హెచ్చరించింది. డ్రస్ కోడ్, ప్రవేశ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. సోషల్ మీడియాలో ప్రశ్నాపత్రాలు, ఆన్సర్ కీలు, ప్రత్యేక సేవల పేరుతో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అభ్యర్థులకు సూచించిం ది. అధికారిక సమాచారం కోసం ఎన్‌టీఏ వెబ్‌సైట్, ధృవీకరించిన వాట్సాప్ సేవలను ఉపయోగించుకోవాలని తెలిపింది. పరీక్ష నిర్వహణకు ముందు దేశవ్యాప్తంగా శనివారం మాక్‌డ్రిల్ నిర్వహించి కేంద్రాల సన్నద్ధతను పరిశీలించి నట్టు అధికారులు తెలిపారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా పరీక్ష నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్‌టీఏ వెల్లడించింది.
నేడు నీట్ రీ-ఎగ్జామ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



