3-0తో వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్
ఛేదనలో యశస్వి జైస్వాల్ అజేయ సెంచరీ
ఐదు వికెట్లతో చెలరేగిన ప్రసిద్ కృష్ణ
అఫ్గనిస్తాన్‌పై టీమ్ ఇండియా సంపూర్ణ విజయం సాధించింది. ఏకైక టెస్టును మూడు రోజుల్లోనే ముగించిన భారత్.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అటు రెడ్‌బాల్‌తో, ఇటు వైట్‌బాల్‌తో అఫ్గాన్‌ను చిత్తు చేసిన భారత్ పరిపూర్ణం విజయం అందుకుంది.
చెపాక్ వన్డేలో పేసర్ ప్రసిద్ కృష్ణ ఐదు వికెట్లతో చెలరేగటంతో అఫ్గనిస్తాన్ తొలుత 218 పరుగులకే కుప్పకూలింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అజేయ సెంచరీతో స్వల్ప లక్ష్యాన్ని భారత్ 28.4 ఓవర్లలోనే పూరించింది. మరో 128 బంతులుండగానే 9 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది.
నవతెలంగాణ-చెన్నై
యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (110 నాటౌట్, 86 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ సెంచరీతో దంచికొట్టగా, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (79, 69 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీతో చెలరేగాడు. 219 పరుగుల స్వల్ప ఛేదనలో ఓపెనర్లు తొలి వికెట్‌కు 170 పరుగుల భాగస్వామ్యం నిర్మించగా అఫ్గనిస్తాన్‌తో మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 28.4 ఓవర్లలోనే లాంఛనం ముగించిన భారత్ వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. అంతకముందు, అఫ్గనిస్తాన్ 44.2 ఓవర్లలో ఆలౌటైంది. పేసర్ ప్రసిద్ కృష్ణ (5/23) ఐదు వికెట్ల ప్రదర్శనతో నిప్పులు చెరిగాడు. అఫ్గాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది (102, 131 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించగా, అజ్మతుల్లా ఓమర్‌జాయ్ (50, 56 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో అఫ్గాన్‌ను ఆదుకున్నారు. పేసర్ ప్రసిద్ కృష్ణ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలువగా… రెండు సెంచరీలతో కదం తొక్కిన శుభ్‌మన్ గిల్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నాడు.
యశస్వి వీరోచిత సెంచరీ
భారత్ లక్ష్యం 219 పరుగులు. ఆతిథ్య జట్టుకు ఇదేమీ పెద్ద సవాల్ కాదు. కానీ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ సహా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌లు తమదైన స్థాయిలో రాణించలేదు. దీంతో సహజంగానే ఈ మ్యాచ్‌లో ఈ ముగ్గురిపై ఫోకస్ కనిపించింది. యశస్వి జైస్వాల్ వరుస వైఫల్యాలను అధిగమించి.. సెంచరీతో చెలరేగాడు. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 38 బంతుల్లో అర్థ సెంచరీ బాదిన జైస్వాల్.. సెంచరీ మార్క్‌ను 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 83 బంతుల్లో అందుకున్నాడు. రోహిత్ శర్మ ఆరు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 47 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. రెండో వన్డేలో ఫిఫ్టీ ముంగిట అవుటైన రోహిత్.. చెపాక్‌లో అర్థ సెంచరీతో జోరందుకున్నాడు. ఓపెనర్ల జోరుతో 13.4 ఓవర్లలోనే భారత్ 100 పరుగులు చేసింది. తొలి వికెట్‌కు ఓపెనర్లు 170 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించారు. రోహిత్ శర్మ నిష్ర్కమించినా.. శ్రేయస్ అయ్యర్ (20 నాటౌట్, 19 బంతుల్లో 2 సిక్స్‌లు) జతగా జైస్వాల్ లాంఛనం ముగించాడు. శ్రేయస్ అయ్యర్ ఆఖర్లో రెండు సిక్సర్లు సంధించగా.. మహ్మద్ నబి ఓవర్లో వరుసగా 6, 0, 4, 6తో యశస్వి జైస్వాల్ సెంచరీ పూర్తి చేయటంతో పాటు విజయాన్ని అందించాడు. అఫ్గనిస్తాన్ బౌలర్లలో మహ్మద్ నబి (1/47) ఓ వికెట్ పడగొట్టాడు. రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఓమర్‌జాయ్, జియార్ రెహమాన్, ఫరీద్ అహ్మద్‌లు వికెట్ పడగొట్టడంలో విఫలం అయ్యారు.
ప్రసిద్ కృష్ణ ప్రతాపం
టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గనిస్తాన్‌కు ఆ ఆనందం ఎంతో సేపు నిలువలేదు. పేసర్ ప్రసిద్ కృష్ణ పది ఓవర్లలోపే అఫ్గనిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. పవర్‌ప్లేలోనే టాప్ ఆర్డర్‌ను లేపేసిన ప్రసిద్ కృష్ణ.. అఫ్గనిస్తాన్‌ను స్వల్ప స్కోరుకు పరిమితం అయ్యేలా చేశాడు. ఓపెనర్లు రెహ్మనుల్లా గుర్బాజ్ (5), ఇబ్రహీం జద్రాన్ (11) సహా నం.3 బ్యాటర్ రెహమత్ షా (5), డార్వీశ్ రసూలీ (1)లను ప్రసిద్ కృష్ణ ఆరంభంలోనే సాగనంపాడు. ప్రసిద్ కృష్ణ దెబ్బకు అఫ్గనిస్తాన్ 9.2 ఓవర్లలోనే 36 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. అఫ్గనిస్తాన్ వంద లోపే ఆలౌటయ్యేలా కనిపించగా.. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (102), అజ్మతుల్లా ఓమర్‌జాయ్ (52) ఆ జట్టును ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు విలువైన భాగస్వామ్యం నిర్మించారు. ఆరు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 64 బంతుల్లో హష్మతుల్లా అర్థ సెంచరీ సాధించగా… అజ్మతుల్లా ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 55 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. అజ్మతుల్లా అవుటైనా.. టెయిలెండర్ల సహకారంతో హష్మతుల్లా ఒంటరి పోరాటం కొనసాగించాడు. మహ్మద్ నబి (21) సైతం విలువైన పరుగులు జోడించాడు. టెయిలెండర్లు పేకమేడలా కుప్పకూలటంతో అఫ్గనిస్తాన్ ఇన్నింగ్స్ 44.2 ఓవర్లలో 218 పరుగులకే ముగిసింది. భారత బౌలర్లలో గుర్నూర్ బరార్, ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబెలు తలా ఓ వికెట్ పడగొట్టారు.
స్కోరు వివరాలు
అఫ్గనిస్తాన్ ఇన్నింగ్స్ : రెహ్మనుల్లా గుర్బాజ్ (సి) రోహిత్ (బి) ప్రసిద్ 5, ఇబ్రహీం జద్రాన్ (సి) రోహిత్ (బి) ప్రసిద్ 11, రెహమత్ షా (సి) రోహిత్ (బి) ప్రసిద్ 5, హష్మతుల్లా (సి) శ్రేయస్ (బి) ప్రసిద్ 102, డార్వీశ్ (సి) శ్రేయస్ (బి) ప్రసిద్ 1, అజ్మతుల్లా (సి) ప్రసిద్ (బి) ప్రిన్స్ యాదవ్ 50, మహ్మద్ నబి (బి) బరార్ 21, రషీద్ ఖాన్ (సి) ప్రిన్స్ యాదవ్ (బి) హర్ష్ దూబె 5, ఘజాన్‌ఫర్ (రనౌట్) 1, ఫరీద్ అహ్మద్ (రనౌట్) 0, జియార్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 16, మొత్తం : (44.2 ఓవర్లలో ఆలౌట్) 218.
వికెట్ల పతనం : 1-5, 2-26, 3-28, 4-36, 5-141, 6-198, 7-205, 8-206, 9-206, 10-218.
బౌలింగ్ : గుర్నూర్ బరార్ 8-0-49-1, ప్రసిద్ కృష్ణ 8.2-2-23-5, ప్రిన్స్ యాదవ్ 7-0-38-1, నితీశ్ కుమార్ రెడ్డి 6-0-42-0, హర్ష్ దూబె 7-0-38-1, వాషింగ్టన్ సుందర్ 8-2-23-0.
భారత్ ఇన్నింగ్స్ : యశస్వి జైస్వాల్ నాటౌట్ 110, రోహిత్ శర్మ (సి) అటల్ (బి) నబి 79, శ్రేయస్ అయ్యర్ నాటౌట్ 20, ఎక్స్‌ట్రాలు : 15, మొత్తం : (28.4 ఓవర్లలో వికెట్ నష్టానికి) 224.
వికెట్ల పతనం : 1-170.
బౌలింగ్ : అజ్మతుల్లా ఓమర్‌జాయ్ 2-0-26-0, జియార్ రెహమాన్ 4-0-21-0, ఫరీద్ అహ్మద్ 5-0-55-0, ఘజాన్‌ఫర్ 3-0-15-0, రషీద్ ఖాన్ 7-0-53-0, మహ్మద్ నబి 7.4-1-47-1.



