Wednesday, April 29, 2026
E-PAPER
Homeఎడిట్ పేజినయా ఫాసిజం-జాతీయత

నయా ఫాసిజం-జాతీయత

- Advertisement -

ఇండియాలో నయా ఫాసిజం పైచేయి సాధిస్తున్న క్రమంలోనే దానికి సంబంధించిన కొన్ని లక్షణాలు బయటకు వ్యక్తమవుతూ వచ్చాయి. నిస్సహాయంగా ఉన్న ఒక మైనారిటీ తరగతి ప్రజలను ‘పరాయివాళ్లు’గా వేరు చేయడం, వారి పట్ల మెజారిటీ ప్రజల్లో ద్వేషాన్ని రెచ్చగొట్టడం, ప్రభుత్వ యంత్రాంగంలోని వివిధ అంగాల ద్వారా, నయా ఫాసిస్టు గూండాల ద్వారా ఆ మైనార్టీలను అణచివేయ డానికి పూనుకోవడం, తమను విమ ర్శించేవారిని, రాజకీయ ప్రత్యర్ధులను, మేధావులను, కళాకారులను, తక్కినవారిని అణగదొక్కడం అటువంటి లక్షణాలే. మరోవైపు బాహాటంగానే గుత్త పెట్టుబడిదారీ వర్గపు ‘కల్తీ లేని’ వర్గ పాలన కొనసాగుతూ వుంటుంది. అందులోనూ ముఖ్యంగా కొత్తగా బలపడిన గుత్త పెట్టుబడిదారీవర్గ పెత్తనం మరీ స్పష్టంగా కనిపిస్తూ వుంటుంది. ఇవన్నీ నయా ఫాసిస్టుల లక్షణాలు. వీటన్నింటితో బాటు మరొక లక్షణం కూడా కనిపిస్తోంది.ఇది పైన చెప్పిన లక్షణాల మాదిరిగా కొట్టొచ్చినట్టు కనపడకపోవచ్చు కాని ఇది కూడా చాలా ముఖ్యమైన లక్షణమే. దీనిగురించి ఇంకా పెద్దగా చర్చ మనదేశంలో జరగడం లేదు. ఇది ‘జాతి’ అన్న భావనకు సంబంధించిన అంశం.

యూరప్‌లో పాత ఫ్యూడల్‌ రాజ్యాల స్థానే కొత్తగా బూర్జువా వర్గ నాయకత్వంలో ప్రభుత్వాలు ఏర్పడ్డాక వాటి మధ్య తరచూ కొనసాగిన యుద్ధాలకు ముగింపు పెట్టడానికి జరిగిన ఒప్పందాలను వెస్ట్‌ ఫాలియన్‌ ఒడంబడికలు అంటారు. ఆ కాలంలో ఆ యూరోపియన్‌ దేశాల్లో తలెత్తిన ‘జాతి’ భావనకు, భారతదేశంలో తలెత్తిన జాతీయతా భావనకు మౌలికం గానే తేడాలు ఉన్నాయి. యూరో పియన్‌ తరహా ‘జాతి’ భావన తన దేశంలోనే ఒక సమూహాన్ని ‘అంతర్గత శత్రువు’గా పరిగణిస్తుంది. దానికి భిన్నంగా భారత జాతీయతా భావన విభిన్న జాతులను, సమూహాలను అన్నింటినీ ఐక్యం చేసే విధానాన్ని అనుసరిస్తుంది. యూరోపియన్‌ తరహా ‘జాతి’ భావన ఒక భౌగోళిక ప్రదేశంతో ముడిపడి వుంటుంది. తన సరిహద్దుల్ని, పెత్తనాన్ని విస్తరించాలన్న సామ్రాజ్యవాద ధోరణి ఉంటుంది. అదే భారత జాతీయతా భావన ప్రజలనే దేశంగా పరిగణిస్తుంది.

ప్రజల ప్రయోజనాలనే ‘జాతి’ ప్రయోజనాలుగా భావిస్తుంది. రాజ్యం అన్నది ఆ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించాలని భావిస్తుంది. యూరోపియన్‌ తరహా ‘జాతి’ భావన రాజ్యం అనేది ప్రజలకు అతీతమైనదిగా చిత్రిస్తూ, ప్రజలు దానికి లోబడి వ్యవహరించాలని చెప్తుంది. ఇప్పుడు నయా ఫాసిజం పెత్తనం సాధించిన తర్వాత మన దేశంలో ఇంతవరకూ ఉన్న జాతీయతాభావన స్థానంలోకి యూరోపియన్‌ తరహా ‘జాతి’ భావనను చొప్పించడానికి పూనుకుంటున్నారు (సాటి దేశస్తులనే ‘పరాయివారి’గా చిత్రించడంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది). మన దేశంలో సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట కాలంలో పెంపొందిన జాతీయతా భావనను తలకిందులు చేస్తున్నారు.

ఇలా తలకిందులు చేశాక ప్రజలే దేశం అన్న భావన స్థానంలో ప్రజలు ‘దేశ ప్రయోజనాలను’ నెరవేర్చడాకికి బద్ధులై వుండాలన్న దృక్పధం ముందుకొస్తుంది. ప్రజల హక్కులకు గల ప్రాధాన్యత తగ్గిపోయి, దానికి బదులు ఆ ప్రజల బాధ్యతల గురించి ఎక్కువగా నొక్కి చెప్పడం జరుగుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ‘నాయకుడే దేశం, దేశమే నాయకుడు’ అన్న భావన ముందుకొ స్తుంది. ఆ నాయకుడే దేశపు రూపం అవుతాడు. ప్రజలకు అతీతంగా ఉండే ‘దేశం’ అనేది ఒక ఆరాధనా రూపంగా మారుతుంది. అలాగే ఆ ‘దేశం’ అనేదాని ప్రతిరూపంగా ‘నాయకుడు’ ఆరాధనా మూర్తి’గా అవుతాడు. ఆ పైన ఆ నాయకుడిని ఎవరు విమర్శించినా అది ఆటోమేటిక్‌గా దేశద్రోహ చర్య అయిపోతుంది.

ఈ తలకిందుల ‘జాతి’ భావన నెలకొన్నాక ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ఆ ప్రజలకు సేవ చేయడం అన్నది పోయి, ప్రజలు ‘నాయకుడికి’ సేవ చేసుకో వలసి వుంటుంది. ఈ అడ్డగోలు పరిస్థితిలో ప్రజలు నాయకుడిని ఎన్నుకోవడం అనేదానికి బదులు నాయకుడే తనకు కావలసిన ప్రజలను ఎన్నుకుంటాడు! జాతీయతా భావన తలకిందులైందన్న దానికి అనేక ఉదాహరణలను చూపవచ్చు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ భారతదేశ సైన్యాన్ని ”మోడీగారి సైన్యం” అని పేర్కొన్నాడు. ఇక్కడ చాలా స్పష్టంగా ‘దేశం’ అన్న భావన స్థానంలో ‘నాయకుడి’ని ప్రతిష్టించడానికి జరిగిన ప్రయత్నాన్ని మనం చూడవచ్చు. అదే సమయంలో ప్రజల హక్కుల మీద చాలా పెద్ద ఎత్తున దాడి జరుగుతోంది. యుపిఎ-1 కాలంలో వామపక్షాల మద్దతుతో ప్రభుత్వం కొనసాగినప్పుడు ప్రజలకు హక్కులు కల్పిస్తూ మూడు ముఖ్యమైన చట్టాలను రూపొందించారు. అవి అటవీ హక్కుల చట్టం, సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ చట్టం. ప్రస్తుతం ఈ మూడు చట్టాలూ చెల్లుబాటు కాకుండా పోయాయి. అటవీ హక్కుల చట్టాన్ని తోసిరాజనే విధంగా 2023 అటవీ (సంరక్షణ) సవరణ చట్టం తెచ్చారు. ఈ చట్టం అటవీ భూముల్ని ‘మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల’ పేరుతో చాలా తేలికగా గుత్త పెట్టుబడిదారీ సంస్థలకు కట్టబెట్టడానికి వీలు కల్పిస్తుంది.

అందుకు గ్రామ సభల అనుమతి కూడా అవసరం లేదు. సమాచార హక్కు చట్టానికి 2019లో ఒకసారి, 2023లో మరొకసారి చేసిన సవరణలు సమాచారాన్ని ఇవ్వకుండా తిరస్కరించడానికి ఎక్కువ అవకాశాలు కల్పించాయి. కోట్లాది మంది గ్రామీణ పేదలకు కోరినప్పుడు విధిగా పని కల్పించాలని ఉపాధిహామీ చట్టం నిర్దేశిస్తుంది. పార్లమెంటు ఉభయసభల్లో మాత్రమే కాక, ప్రజల్లోని వివిధ తరగతుల వారితో, మేథావులతో, కార్మికుల ప్రతినిధులతో చర్చలు, సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ చట్టాన్ని పార్లమెంటులో ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఇప్పుడు ఆ చట్టాన్ని కేవలం మూజువాణి ఓటుతో, ఎటువంటి చర్చా లేకుండానే, ఎవరినీ సంప్రదించకుండానే మార్చివేశారు!

ప్రజలకు ఉన్న హక్కులని ఈ విధంగా ఊడలాక్కున్న తర్వాత ప్రధానమంత్రి పేరుతో కొన్ని పథకాలను తీసుకువస్తున్నారు. అంటే ప్రజలకు గల హక్కులను బట్టి వారికి చెందవలసిన సదుపాయాలు కాస్తా ఇప్పుడు దయార్ద్ర హృదయుడైన ప్రధాని (నాయకుడు) వారికి ప్రసాదించే వితరణగా మారిపోయింది. ఒకపక్క ప్రజల హక్కు లను రద్దు చేస్తూనే మరోపక్క ప్రజల విధుల గురించి ప్రబోధాలు పెరిగిపోతున్నాయి. దేశ రాజధానిలో అత్యంత ముఖ్యమైన రహదారి పైనే దేశాధ్యక్షుడు గణతంత దినం నాడు త్రివిధ దళాల వందనాన్ని స్వీకరిస్తారు. ఆ రహదారి పేరును కర్తవ్య పథ్‌గా మార్చివేశారు. ప్రజలు తమ విధులను మరిచిపోకుండా ప్రతీ రిపబ్లిక్‌ దినంనాడూ గుర్తు చేస్తారన్నమాట. ‘జాతి’ భావన తిరగబడిందన్నదానికి పెద్ద, దారుణమైన ఉదాహరణ ఓటర్ల జాబితాలకు చేస్తున్న ప్రత్యేక తీవ్ర సవరణ (ఎస్‌.ఐ.ఆర్‌) ఎన్నికలు జరుగుతున్న పలు రాష్ట్రాల్లో దీనిని చేపట్టాలని ఎన్నికల కమిషనర్‌ ఆదేశించాడు. అంతకన్నా ముందు ఎన్నికల కమిషన్‌ కూర్పు ఏ విధంగా మారిపోయిందో చూద్దాం. గతంలో ముఖ్య ఎన్నికల కమిషనర్‌ను, మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లను ముగ్గురు సభ్యుల కమిటీ నిర్ణయించేది. ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఆ కమిటీ ఉండేది. దీనిని బీజేపీ ప్రభుత్వం మార్చేసింది.

ఎందుకు మారుస్తున్నదీ కారణం చూపకుండానే ఒక చట్ట సవరణ తెచ్చింది. దాని ప్రకారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ఒక కేంద్ర కాబినెట్‌ మంత్రి ఆ కమిటీలో ఉంటారు. ఆ వ్యక్తి ఎవరన్నది ప్రధాని నిర్ణయిస్తారు. అంటే ప్రధానికి ఈ కమిటీలో మూడింట రెండు ఓట్లు గ్యారంటీ అన్నమాట. అర్హులు కాని వారిని ఓటర్ల జాబితా నుండి తొలగించే పేరుతో ఎన్నికల కమిషన్‌ అనేక రకాల పత్రాలను రుజువులుగా చూపమని ఆదేశించింది. వాటిలో కొన్నింటిని పౌరులు పొందడం దాదాపు అసాధ్యం. వాటిని చూపనందున చాలామందిని ఓటర్ల జాబితాల నుండి తొలగించివేశారు. సుప్రీం కోర్టు జోక్యంతో కొన్ని ఆధార పత్రాలను ఎన్నికల కమిషన్‌ ఆమోదించవలసి వచ్చింది. దాంతో తొలగించిన కొన్ని ఓట్లను మళ్లీ చేర్చారు. అయిన ప్పటికీ కొన్ని లక్షల మంది ఓటర్లను జాబితా నుండి తొలగించివేశారు. ఒక్క పశ్చిమ బెంగాల్‌ లోనే ఏకంగా తొంభై లక్షల మందిని తొలగించారు. అంటే మొత్తం ఓటర్లలో పదకొండు శాతం! వారిలో అత్యధికులు మైనారిటీ మతస్థులు. నయా ఫాసిస్టు కూటమి వారినే లక్ష్యంగా చేసుకుంది.

ఈ తొలగింపులను ఖరారు చేసే ఆఖరు తేదీని సుప్రీంకోర్టు పొడిగించడం మంచిదే అయినా, జరిగిన నష్టాన్ని అది పూర్తిగా నివారించలేదు. ఇప్పుడు దేశంలో తమను ఎన్నుకునే ‘ప్రజలు’ అంటే ఎవరు అన్నది ప్రధాని, అతడి అనుయాయులు ఇలా నిర్ణయిస్తున్నారు. అంటే ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కాకుండా ప్రభుత్వమే తన ప్రజలు ఎవరు అన్నది నిర్ణయిస్తోంది! ‘జాతి’ అన్న భావన తలకిందులు కావడం అంటే ఇదే. బెర్టోల్ట్‌ బ్రెక్ట్‌ ప్రఖ్యాత కవితలో ఇలా అంటాడు: ”ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినట్టు కనిపిస్తోంది/మరి అప్పుడు ఈ ప్రభుత్వం ఆ ప్రజల్ని రద్దు చేసేసి/ తనకు నచ్చిన ప్రజల్ని ఎందుకు ఎన్నుకోవడం లేదు?” ఇప్పుడు మన దేశంలో బ్రెక్ట్‌ చెప్పినదాన్నే అక్షరాలా ఆచరిస్తున్నారు. ఈ కవిత నయా ఫాసిజం సారాంశం ఏమిటో, ‘నాయకుడు-ప్రజలు’ నడుమ సంబంధం ఏవిధంగా తలకిందులు అవుతోందో, దాన్నుంచి ‘జాతి’ అన్న భావన ఏ విధంగా తలకిందులౌతోందో అద్దంలో మాదిరిగా చూపుతోంది. అయితే ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద చూసినప్పుడు నయా ఫాసిజం వెనకడుగులు వేస్తోంది.

ప్రతీ చోటా దానికి ఎదురుదెబ్బలు తప్పడం లేదు. ఇరాన్‌ మీద ట్రంప్‌ చేసిన దాడి వెనుక అతగాడు పెట్టుకున్న లక్ష్యాలు ఏవీ నెరవేరలేదు. అది అతడి ఓటమినే సూచిస్తోంది. హంగేరీలో విక్టర్‌ ఓర్బన్‌ ఓటమి పాలయ్యాడు. పచ్చి ఫాసిస్టు అయిన బెంజమిన్‌ నెతన్యహు ఇజ్రాయిల్‌లో మద్దతు కోల్పోతున్నాడు. అతడు పాల్పడిన హత్యాకాండలే దానికి కారణం. ఇక్కడ మోడీ పార్లమెంటులో తలపెట్టిన రాజ్యాంగ సవరణ కాస్తా వీగిపోయింది. అదే గనుక ఆమోదం పొందివుంటే శాశ్వతంగా ఇకపైన బీజేపీ పాలనే కొనసాగేది.అయితే దీనర్ధం నయా ఫాసిజం పిదపకాలం వచ్చేసిందని కాదు. ఈ నయా ఫాసిజం ఒకానొక సందర్భంలో ముందుకొచ్చింది. నయా ఉదారవాద విధానాలు సంక్షోభంలో చిక్కుకు పోవడమే ఆ సందర్భం. అందుచేత ఈ నయా ఫాసిజం నయా ఉదారవాద విధానాల చట్రం పరిధి లోపలే అంతం కావడం అనేది జరగదు. దానిని ముందుకు తెచ్చినదే ఆ విధానాలు. అందుచేత ఎన్నికల్లో ఒకసారి ఓడిపోయినా నయా ఫాసిజం మళ్ళీ మళ్ళీ రావచ్చు. మనకు ట్రంప్‌ రెండవసారి గెలవడం దీనినే సూచిస్తుంది. ఎన్నికల్లో నయా ఫాసిజాన్ని ఓడించడానికి ప్రయత్నించడం అవసరమే. అయితే ఆ ఓటమి కేవలం ప్రజాస్వామ్య పునరుద్ధరణకు మాత్రమే కాక, నయా ఉదారవాద విధానాల చట్రాన్ని దాటుకుని ముందుకు పోవడానికి కూడా దోహదపడాలి.
(స్వేచ్ఛానుసరణ)

ప్రభాత్‌ పట్నాయక్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -