కొత్త నియామకాలు 21 శాతం పతనం

New hires fell 21 percent– ఏడు నెలల కనిష్టానికి ఉద్యోగ కల్పన
– ఈపీఎఫ్‌ఓ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో ఉద్యోగ కల్పన అమాంతం పడిపోయిందని స్వయంగా ప్రభుత్వ సంస్థల గణంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో సంఘటిత రంగంలో కొత్త నియామకాలు 20.8 శాతం క్షీణించి 7.50 లక్షలకు క్షీణించాయని ఉద్యోగుల ప్రావిడెంట్‌ ఫండ్‌ సంస్థ ఇపిఎఫ్‌ఒ తన నెలవారి డేటాలో వెల్లడించింది. ఇంతక్రితం సెప్టెంబర్‌లో కొత్తగా 9.47 లక్షల నియామకాలు జరిగాయి. అక్టోబర్‌లో ఉపాధి కల్పన భారీగా తగ్గి.. ఏడు నెలల కనిష్టానికి చేరింది. ఇందులోని మొత్తం చందాదారుల్లో 18-25 ఏండ్ల వయస్సు వారు 4,38,700 మందితో 58.5 శాతంగా ఉన్నారు. ఈ వయస్సు వారి నియామకాలు సెప్టెంబర్‌లో 5,67,700 మందితో 59.94 శాతంగా నమోదయ్యింది. సాధారణంగా ఈ వయస్సులో ఉన్న చందాదారులు కార్మిక మార్కెట్‌లో ఫ్రెషర్లుగా ఉండటంతో, నియామకాల పటిష్టతను ప్రతిబింబిస్తుంది. ఈ వర్గంలో ఉద్యోగ కల్పన క్షీణించడం ఆర్ధిక వ్యవస్థలో బలహీనతలు, ప్రభుత్వాల విఫల పాలనకు అద్దం పడుతోంది. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారిలో 2.09 లక్షల మంది మహిళలు ఉన్నారు. మొత్తం అవకాశాల్లో మహిళల వాటా 27.9 శాతంగా ఉంది. సంఘటిత రంగంలో ఉద్యోగంలో చేరుతున్న వారిలో యువతే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారని, అందులో తొలిసారి ఉద్యోగంలో చేరిన వారే ఎక్కువని ఈపీఎఫ్‌ఓ గణంకాలు పేర్కొన్నాయి. అక్టోబర్‌లో నికరంగా చందాదారుల సంఖ్య 5 శాతం తగ్గి 13.4 లక్షలకు పరిమితం కాగా.. ఇంతక్రితం సెప్టెంబర్‌లో 14.1 లక్షలుగా నమోదయ్యింది. అక్టోబర్‌ నెలలో ఈపీఎఫ్‌ఓ ను వీడి మళ్లీ చేరిన వారి సంఖ్య 12.90 లక్షలుగా ఉంది. కొత్త చందాదారుల సంఖ్య, తిరిగి ఈపీఎఫ్‌ఓ లో చేరిన వారి సంఖ్య, నిష్క్రమించిన వారి సంఖ్యను పరిగణనలోకి తీసుకుని నికర నియామకాలను లెక్కిస్తారు. అత్యధికంగా మహరాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, హర్యానా, తెలంగాణ, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో చందాదారులు నమోదయ్యారు. అక్టోబర్‌లో ఎక్కువ ఉపాధి కల్పించిన వాటిలో రోడ్డు మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, ప్రయివేటు బ్యాంకు రంగాలు ముందు వరుసలో ఉన్నాయి. దేశంలో పెట్టుబడులు పడిపోవడం ఉద్యోగ అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉద్యోగ కల్పనలో తగ్గుదల ఆర్ధిక వ్యవస్థలో బలహీనతలకు నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు.

Spread the love