విలీనం వద్దు..!

No merger..!– మున్సిపాలిటీల విలీనం ప్రజల సంక్షేమానికి విఘాతం
– ఉమ్మడి రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని 21 మున్సిపాలిటీలను..
– గ్రేటర్‌లో విలీనం చేసేందుకు యత్నం
– ఉన్నవాటిని యథాతథంగానే ఉంచాలంటున్న ప్రజలు
– ఇప్పటికే సౌకర్యాలు లేవు.. భారాలతో చస్తున్నామని ఆవేదన
– మున్సిపాలిటీల కేంద్రీకరణతో అభివృద్ధికి దూరమయ్యే ప్రమాదం
– కలిపే ఆలోచన వద్దంటున్న రాజకీయ పార్టీల నేతలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
గ్రేటర్‌ హైదరాబాద్‌ను విస్తరిస్తూ.. ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం ఇటీవల ప్రణాళికలు రూపొందించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆదాయాన్ని ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాంతంలోని మున్సిపాలిటీల అభివృద్ధికి వినియోగించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజానీకం మున్సిపాలిటీలను గ్రేటర్‌లో విలీనం చేయొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తోంది. ఇప్పటికే గ్రామాలుగా ఉన్న తమ ఊర్లను మున్సిపాలిటీలుగా మార్చి తమపై పన్నుల భారం మోపారని స్థానికులు వాపోతున్నారు. ఇప్పుడు మున్సిపాలిటీలను గ్రేటర్‌లో కలిపితే పట్టణ అభివృద్ధి విషయం పక్కనపెడితే.. తమ జీవన స్థితిగతులు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ప్రతిపక్షాలు సైతం మున్సిపాలిటీల విలీనంపై వస్తున్న వాదనాలను వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలను ప్రోత్సహించొద్దని డిమాండ్‌ చేస్తున్నారు. అధికార పార్టీనేతలూ ప్రభుత్వ ఆలోచన కరెక్టు కాదన్న అభిప్రాయంలో ఉన్నారు.
నగర శివారులోని ఏడు కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే.. గ్రేటర్‌ విస్తీర్ణంపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలోనే పురపాలక శాఖ, జీహెచ్‌ఎంసీలపై మూడు నెలల క్రితం సమీక్ష నిర్వహించారు. ఔటర్‌ రింగు రోడ్డు లోపలున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు భౌతిక స్థితిగతులపై నివేదికలు అందజేయాలని గతంలోనే సంబంధిత అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో ఆ పనులకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఎన్నికల ముగియడంతో మున్సిపాలిటీల విలీనం మళ్లీ తెరపైకి వచ్చింది. కాగా, ఇటీవల సంబంధిత అధికారులు విలీనంపై ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. దీని ఆధారంగా సోషల్‌ మీడియాలో, వార్తా పత్రికల్లో వస్తున్న కథనాలతో అటు ప్రజల్లోనూ, రాజకీయ పార్టీ నేతల్లోనూ గందరగోళం నెలకొన్నది.
సమస్యలపై ఫిర్యాదులకే దిక్కులేదు..
రంగారెడ్డి జిల్లాలో 16 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందుల్లో కొన్ని జీహెచ్‌ఎంసీ పరిధి దాటిన వెంటనే ఉన్న శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొన్నింటికి మాత్రమే ప్రస్తుతం వివిధ మార్గాల ద్వారా ఆదాయం లభిస్తోంది. నార్సింగి, మణికొండ మున్సిపాలిటీలు, జవహర్‌నగర్‌, బండ్లగూడ జాగీర్‌ కార్పొరేషన్లు మాత్రమే ఫైనాన్షియల్‌గా నిలదొక్కుకుంటున్నాయి. నగర శివారులోని ఇబ్రహీంపట్నం, శంషాబాద్‌, తుర్కయంజాల్‌, ఆదిభట్ల మున్సిపాలిటీలతో పాటు బడంగ్‌పేట్‌, మీర్‌పేట్‌, కార్పొరేషన్లు నిధులలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మరికొన్ని మున్సిపాలిటీలు స్ట్రీట్‌ లైట్ల బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నాయి. రహదారులు సక్రమంగా లేవని తుక్కుగూడ, శంషాబాద్‌, ఆదిభట్ల మున్సిపాలిటీలు, మీర్‌పేట్‌, బండ్లగూడ జాగీర్‌, బడంగ్‌పేట్‌ల్లోని ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. ఇలాంటి పరిస్థితిల్లో మున్సిపాలిటీలను గ్రేటర్‌లో విలీనం చేస్తే ఈ సమస్యలను పట్టించుకునే దిక్కు ఉంటుందా అని ఆందోళన చెందుతున్నారు. పాలనా సౌలభ్యం ఉన్న పరిస్థితిలోనే సమస్యలు ఇలా ఉంటే.. జీహెచ్‌ఎంసీలో విలీనమైతే ఇక అంతే సంగతులని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Spread the love