ఎవరినీ సంప్రదించలేదు

ఎవరినీ సంప్రదించలేదు– చీఫ్‌ కోచ్‌ పదవిపై జై షా స్పష్టీకరణ
న్యూఢిల్లీ : భారత క్రికెట్‌ సీనియర్‌ మెన్స్‌ జట్టు చీఫ్‌ కోచ్‌ పదవి చేపట్టాల్సిందిగా ఆస్ట్రేలియా కోచ్‌లు (మాజీ క్రికెటర్లు)ను సంప్రదించినట్టు వస్తున్న వార్తలు అవాస్తమని, అందులో ఏమాత్రం నిజం లేదని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా వెల్లడించాడు. రాహుల్‌ ద్రవిడ్‌ పదవీ కాలం రానున్న టీ20 ప్రపంచకప్‌తో ముగియనుంది. దీంతో దీర్ఘకాలిక ప్రణాళికలను గమనంలో ఉంచుకుని మూడున్నరేండ్ల కాంట్రాక్టుతో కొత్త కోచ్‌ కోసం బీసీసీఐ ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. చీఫ్‌ కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు మే 27 తుది గడువు. భారత జట్టు చీఫ్‌ కోచ్‌గా పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నారా? అంటూ సంప్రదించారని ఢిల్లీ క్యాపిటల్స్‌ చీఫ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ తెలిపిన సంగతి తెలిసిందే. కుటుంబ, వ్యక్తిగత, ప్రాంఛైజీ క్రికెట్‌ బాధ్యతలతో భారత జట్టు చీఫ్‌ కోచ్‌ పదవికి దరఖాస్తు చేయటం లేదని రికీ పాంటింగ్‌, జస్టిన్‌ లాంగర్‌, ఆండీ ఫ్లవర్‌ సహా స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ‘భారత జట్టు చీఫ్‌ కోచ్‌ పదవి కోసం నేను, బీసీసీఐ నుంచి ఎవరూ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లను సంప్రదించలేదు. ఈ అంశంలో మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదు. భారత జట్టు చీఫ్‌ కోచ్‌ ఎంపిక అనేది సూక్షమైన ప్రక్రియతో కూడుకున్నది. భారత క్రికెట్‌, దేశవాళీ క్రికెట్‌ స్వరూపం గురించి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి కోసం బోర్డు అన్వేషిస్తోంది. భారత క్రికెట్‌, దేశవాళీ క్రికెట్‌ గురించి లోతైన విషయ పరిజ్ఞానం కలిగిన వారే టీమ్‌ ఇండియాను మరో స్థాయికి తీసుకెళ్లగలరని భావిస్తున్నాం’ అని జై షా ఓ ప్రకటనలో తెలిపారు.

Spread the love