నవతెలంగాణ-సత్తుపల్లి
భూ భారతి చట్టం కింద చేపట్టే ప్రతిష్టాత్మక భూ రీ-సర్వే ప్రక్రియలో అధికారులు, సర్వేయర్లు ఎలాంటి పొరపాట్లకు తావిచ్చినా కఠిన చర్యలు తప్పవని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సత్తుపల్లి తహసీల్దార్ కార్యాలయంలో గురువారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆయన అధికారులకు దిశానిర్దేశం చేస్తూ హెచ్చరిక ధోరణిలో పలు కీలక ఆదేశాలు ఇచ్చారు.
నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు
రీ-సర్వే అనేది రైతుల హక్కులకు సంబంధించిన అత్యంత సున్నితమైన అంశమని, ఇందులో ఏ ఒక్క అధికారి లేదా సర్వేయర్ నిర్లక్ష్యం వహించినా శాఖాపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కలెక్టర్ దివాకర టీఎస్ హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో పూర్తి పారదర్శకత పాటించాలన్నారు. ప్రస్తుతం భూమిని ఎవరు సాగు చేస్తున్నారు, వారి వద్ద పాస్‌బుక్ ఉందా లేదా అనే అంశాలను మాత్రమే నిర్ధారించాలని, రికార్డులను తారుమారు చేసే ప్రయత్నాలు జరిగితే సహించేది లేదన్నారు.
తేడాలు వస్తే అధికారులదే బాధ్యత
పాస్‌బుక్ లోని విస్తీర్ణానికి, క్షేత్రస్థాయిలో ఉన్న విస్తీర్ణానికి అసాధారణ వ్యత్యాసాలు ఉంటే వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ధృవీకరించాలన్నారు. తప్పుడు లెక్కలు నమోదు చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
పత్రాల సేకరణలో రాజీ పడొద్దు
సర్వే సమయంలో రైతుల నుంచి పట్టాదారు పాస్‌బుక్, పాత పహాణీలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, సాగు ఆధారాలను తప్పనిసరిగా సేకరించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో ఏ ఒక్క పత్రాన్ని వదిలేసినా ఉపేక్షించేది లేదన్నారు.
నిబంధనలు పక్కాగా అమలు కావాలి:
నోటీసులు ఇచ్చినట్లు రసీదు తీసుకోవడం, ఫోటోలతో కూడిన పంచనామా తయారు చేయడం, ఆధార్-మొబైల్ నంబర్ల నమోదు వంటి ప్రక్రియల్లో ఎలాంటి తప్పులు జరగడానికి వీల్లేదని కలెక్టర్ దివాకర టీఎస్ స్పష్టం చేశారు. సత్తుపల్లి మండలంలో కూడా ఎలాంటి సరిహద్దు వివాదాలు, ప్రజా ఫిర్యాదులు లేకుండా రీ-సర్వే పూర్తి కావాలని కలెక్టర్ చెప్పారు. విధుల్లో అలసత్వం వహించే సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.



