రాజస్థాన్‌లో సీపీఐ (ఎం) అభ్యర్థుల నామినేషన్లు

Nominations of CPI (M) candidates in Rajasthan– భారీ ర్యాలీలు, సభలు వేలాదిగా తరలివచ్చిన జనం
–  దత్తారంగఢ్‌ సభకు బృందాకరత్‌ హాజరు
జైపూర్‌ : రాజస్థాన్‌లోని పలు నియోజకవర్గాల్లో సీపీఐ(ఎం) అభ్యర్థులు శుక్రవారం తన నామినేషన్లను సమర్పించారు. నామినేషన్లు దాఖలు చేసే సందర్భంగా భారీ ర్యాలీలు, బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. వీటికి వేలాదిమంది సీపీఐ(ఎం) కార్యకర్తలు, మద్దతుదారులు, ప్రజలు హాజరయ్యారు. దత్తారంగఢ్‌ నియోజకవర్గంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ సమక్షంలో సీపీఐ(ఎం) అభ్యర్థిగా అమ్రారామ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌కు ముందు భారీ ఊరేగింపు నిర్వహించారు. నామినేషన్‌ వేసిన తరువాత జరిగిన బహిరంగ సభలో బృందకరత్‌, అమ్రా రామ్‌ ప్రసంగించారు. ఈ సభలో పార్టీ జిల్లా కార్యదర్శి కిషెన్‌ పారిక్‌, ఇతర నియోజకవర్గాలకు చెందిన సీపీఐ(ఎం) అభ్యర్థులు ప్రసంగించారు.
శుక్రవారం దూద్‌ నియోజకవర్గం నుంచి పెమా రామ్‌, సికార్‌ నియోజకవర్గం నుంచి ఉస్మాన్‌ ఖాన్‌ సీపీఐ(ఎం) అభ్యర్థులుగా నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా సికార్‌ పట్టణంలో ఈ ఇద్దరు అభ్యర్థులూ భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఉద్దేశించి అభ్యర్థులు ప్రసంగించారు. దుంగార్‌పూర్‌ (ఎస్టీ) నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థిగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు గౌతమ్‌లాల్‌ దామోర్‌ నామినేషన్‌ వేశారు. రాష్ట్ర నాయకులు దులి చంద్‌ మీనా, విమల్‌ భగోరా సమక్షంలో నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా దుంగార్‌పూర్‌ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నోహర్‌ నియోజకవర్గం నుంచి మంగేజ్‌ చౌదరి సీపీఐ(ఎం) అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ర్యాలీలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు.
నామినేషన్‌కు ముందే సీపీఐ(ఎం) అభ్యర్థి అరెస్టు
రాష్ట్రంలోని తారానగర్‌ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థిగా ప్రకటించిన నిర్మల్‌ రాణాను నామినేషన్‌ వేయడానికి ముందే పోలీసులు అరెస్టు చేశారు. గతంలో ప్రజాసమస్యలపై నిర్వహించిన ఆందోళనకు సంబంధించిన కేసులో నిర్మల్‌ రాణాను అరెస్టు చేశారు. దీంతో ఆయన నామినేషన్‌ దాఖలు చేయలేకపోయారు. ఎన్నికల ప్రక్రియను తారుమారు చేసే ఇలాంటి డర్టీ ట్రిక్స్‌ను ఖండించాలని సీపీఐ(ఎం) పిలుపునిచ్చింది. 200 ఎమ్మెల్యే స్థానాలు ఉన్న రాష్ట్రంలో ఈ నెల 25న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 3న ఫలితాలను ప్రకటించనున్నారు.

Spread the love