Tuesday, May 12, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఆమోదయోగ్యం కాదు

ఆమోదయోగ్యం కాదు

- Advertisement -

ఇరాన్ తాజా ప్రతిపాదనను తోసిపుచ్చిన ట్రంప్ దాడులు చేస్తే ప్రతీకారం తప్పదు : టెహ్రాన్ హెచ్చరిక
(నవ తెలంగాణ ‘ జనరల్ డెస్క్)

పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ చేసిన తాజా ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం తోసిపుచ్చారు. అది తనకు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. అయితే ఇరాన్ ప్రతిపాదనలేమిటో ఆయన వివరించలేదు. ‘ఇరాన్ ప్రతినిధులుగా చెప్పుకుంటున్న వారి స్పందనను ఇప్పుడే చదివాను. దానిని నేను ఇష్టపడడం లేదు’ అని చెప్పారు. ఇరాన్ ప్రతిపాదనలను అమెరికా తోసిపుచ్చిన నేపథ్యంలో ఘర్షణలు కొనసాగవచ్చునన్న భయాందోళనల మధ్య చమురు ధరలు సోమవారం భగ్గుమన్నాయి. ఒకవేళ అమెరికా దాడులకు తెగబడితే ప్రతీకార దాడులు చేస్తానని ఇరాన్ హెచ్చరించింది. హార్ముజ్ జలసంధిలోకి ఇకపై విదేశీ యుద్ధ నౌకలను అనుమతించబోనని తేల్చి చెప్పింది.

అమెరికా సైనిక మద్దతును పూర్తిగా తగ్గించుకుంటాం : నెతన్యాహూ
గల్ఫ్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకునేం దుకు తాము ప్రయత్నిస్తున్నందున ఒక దశాబ్ద కాలం లోగా అమెరికా సైనిక మద్దతుపై ఆధారపడడాన్ని పూర్తిగా తగ్గించుకోవాలని ఆశిస్తున్నట్లు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చెప్పారు. సీబీఎస్ న్యూస్‌కు చెందిన ఓ కార్యక్రమంలో నెతన్యాహూ మాట్లాడుతూ ‘సైనిక సహకారం ద్వారా అమెరికా అందజేస్తున్న ఆర్థిక మద్దతును జీరో స్థాయికి తీసుకురావాలని అనుకుం టున్నాను’ అని అన్నారు. ఇజ్రాయిల్ ఏటా 3.8 బిలియన్ డాలర్ల విలువ కలిగిన అమెరికా సైనిక సాయాన్ని పొందుతోందని తెలిపారు. 2018 నుంచి 2028 వరకూ ఇజ్రాయిల్‌కు మొత్తం 38 బిలియన్ డాలర్ల సైనిక సాయాన్ని అందజేయడానికి అమెరికా అంగీకరించింది. అయితే అమెరికా`ఇజ్రాయిల్ సైనిక సంబంధాలను సవరించు కోవడానికి కచ్చితంగా ఇదే సరైన సమయమని నెతన్యాహూ అన్నారు. తదుపరి కాంగ్రెస్ ఏర్పడే వరకూ వేచి చూడాలని అనుకోవడం లేదని, ఇప్పుడే ఈ ప్రక్రియను మొదలు పెడతానని చెప్పారు. ఇజ్రాయిల్‌కు సైనిక సహకారం అందించే విషయంలో అమెరికా కాంగ్రెస్ ఏకాభిప్రాయంతోనే ఉంది. అయితే గాజాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ సాయానికి అమెరికా ప్రజలతో పాటు చట్టసభ సభ్యుల మద్దతు కూడా తగ్గిపోతోంది. మార్చిలో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం 60 శాతం మంది అమెరికా పౌరులు ఇజ్రాయిల్‌పై వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీనంతటికీ సోషల్ మీడియాయే కారణమని నెతన్యాహూ మండిపడ్డారు. అనేక దేశాలు సోషల్ మీడియాను ఉపయోగించుకొని తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.

అసంపూర్తి విద్యుత్ ప్రాజెక్టుల కోసం బిల్లులు వసూలు చేస్తున్న అమెరికా
ఎలాంటి ప్రయోజనం పొందకుండానే, అది ఎలా ఉంటుందో తెలియకుండానే లక్షలాది మంది అమెరికా ప్రజలు ఎలక్ట్రిక్ గ్రిడ్ ప్రాజెక్టులకు నిధులు అందజేస్తున్నారు. దేశంలోని విద్యుత్ గ్రిడ్ పాతపడిపోవడంతో దానిని సమూలంగా మార్చాలని విధాన రూపకర్తలు నిర్ణయించారు. అందులో భాగంగా విద్యుత్ ప్లాంట్లు, ప్రసార లైన్లు నిర్మించకముందే వినియోగదారుల నుంచి ఛార్జీలను వసూలు చేయడానికి యుటిలిటీలను అనుమతిస్తున్నారు. దశాబ్దాల తర్వాత డబ్బు ఆదా అవుతుందని హామీ ఇస్తూ సమీప భవిష్యత్తులోనే బిల్లులను పెంచేస్తున్నారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. కృత్రిమ మేథకు అవసరమైన డేటా కేంద్రాల నుంచి డిమాండ్ పెరుగుతున్న తరుణంలోనే గ్రిడ్ నవీకరణను వేగవంతం చేయాలని విధాన రూపకర్తలు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే పెరిగిన ఇంధన ఛార్జీలతో గృహ వినియోగదారులు, వ్యాపారులు సతమతమ వుతున్నారు. మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా వీరి విద్యుత్ బిల్లులు ఇకపై తడిసి మోపడవబోతున్నాయి.
ఖరీదైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నిర్మిం చాలనుకునే యుటిలిటీలు బ్యాంకులు, పెట్టుబడిదారుల నుంచి రుణాలు పొందాల్సి ఉంటుంది. ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే ఆ ఖర్చులను వినియోగదారుల నుంచి రాబట్టుకోవాలి. అయితే ఇక్కడ ఓ తిరకాసు ఉంది. నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నప్పుడు ప్రోత్సాహకాల కింద ముందుగానే నిధులు సమకూర్చుకునే వెసులుబాటు ఉండడంతో యుటిలిటీలు వినియోగదారులపై అదనపు భారం వేస్తున్నాయి. ఒక్కో గృహ వినియోగ బిల్లుపై కొన్ని డాలర్ల వరకూ భారం పడుతుంది.

మా డిమాండ్లు చట్టబద్ధమైనవే : ఇరాన్
తమ డిమాండ్లను ట్రంప్ తోసిపుచ్చిన నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘై ఒక ప్రకటన చేస్తూ తమ ప్రతిపాదనలన్నీ ఉదారమైనవి, బాధ్యతాయుతమైనవేనని తెలిపారు. ‘మా డిమాండ్లు చట్టబద్ధమైనవి. యుద్ధాన్ని ముగించాలని చెప్పాం. అమెరికా దిగ్బంధాన్ని ఎత్తివేయాలని అడిగాం. సముద్రపు దోపిడీని ఆపాలని కోరాం. అమెరికా ఒత్తిడుల కారణంగా బ్యాంకులలో స్తంభింపచేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని డిమాండ్ చేసాం’ అని అన్నారు. హార్ముజ్ జలసంధి మీదుగా నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా చూడడం, ఆ ప్రాంతంలోనూ, లెబనాన్‌లోనూ భద్రతా ఏర్పాట్లు చేయడం కూడా తమ డిమాండ్లలో ఉన్నాయని తెలిపారు. ఇదిలావుండగా ఇరాన్ తాజా ప్రతిపాదనను అమెరికా తోసిపుచ్చిన నేపథ్యంలో నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా హార్ముజ్ జలసంధి చాలా వరకూ ముతపడింది. దీంతో చమురు ధరలు సోమవారం సుమారు మూడు శాతం మేర పెరిగాయి.

రేపటి నుంచి చైనాలో ట్రంప్ పర్యటన వాణిజ్యం, ఇరాన్ సహా పలు అంశాలపై జిన్‌పింగ్‌తో చర్చలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం నుంచి మూడు రోజుల పాటు చైనాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జరిపే సమావేశంలో ఇరాన్, తైవాన్, ఎఐ, అణ్వాయుధాలు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య ఇప్పటికే అమలులో ఉన్న కీలక ఖనిజాల ఒప్పందాన్ని పొడిగించే విషయం కూడా చర్చలలో ప్రస్తావనకు వస్తుందని అమెరికా అధికారులు తెలిపారు. గత ఆరు నెలల కాలంలో ఇరు దేశాల నేతలు ముఖాముఖి చర్చలు జరపడం ఇదే మొదటిసారి. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను తిరిగి గాడిలో పెట్టడం, ఇరాన్‌పై అమెరికా`ఇజ్రాయిల్ యుద్ధం తదితర అంశాలపై కూడా ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉంది. బుధవారం బీజింగ్ చేరుకునే ట్రంప్ గురు, శుక్ర వారాలలో జిన్‌పింగ్‌తో సమావేశమవుతారు. 2017 తర్వాత చైనాలో ట్రంప్ పర్యటించడం ఇదే మొదటిసారి.
ఇరాన్ ఏం కోరింది? యుద్ధం కారణంగా
తనకు జరిగిన నష్టానికి పరిహారం అందజేయాలని టెహ్రాన్ డిమాండ్ చేసిందని ఇరాన్ ప్రభుత్వ టీ వీ తెలిపింది. తన ఓడరేవుల దిగ్బంధానికి అమెరికా స్వస్తి చెప్పాలని, ఇకపై దాడులు చేయబోనని హామీ ఇవ్వాలని, ఆంక్షలను తొలగించాలని, ఇరాన్ చమురు అమ్మకాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కూడా టెహ్రాన్ కోరిందని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ తస్నిమ్ వివరించింది. ఇరాన్ ప్రతిపాదనలను పరిశీలించిన వెంటనే ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో ఓ పోస్ట్ పెడుతూ ‘నేను దీనిని ఇష్టపడడం లేదు…అది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని రాసుకొచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -