అటూ ఇటూ కాక..

not-here-and-there– మండలి కోసం ఆరాటం..
– ఎమ్మెల్సీలను లాక్కునేందుకు కాంగ్రెస్‌.. కాపాడుకునేందుకు బీఆర్‌ఎస్‌…
– వ్యూహ ప్రతి వ్యూహాల్లో అధికార, ప్రధాన ప్రతిపక్షాలు
– ‘ఆకర్షణ’ బాధ్యతలను ఓ సీనియర్‌కు అప్పగించిన సీఎం రేవంత్‌
– బీఆర్‌ఎస్‌ మండలి పక్షాన్నే కాంగ్రెస్‌లో కలుపుకునే వ్యూహం
– అడ్డుకునేందుకు కేసీఆర్‌ సమాలోచనలు
– ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో చర్చోపచర్చలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఆర్నెల్లు గడిచింది..లోక్‌సభ ఎలక్షన్ల ఫలితాలు వెలువడి నెల కావస్తోంది. అయినా రాష్ట్రంలో రాజకీయ వేడి తగ్గలేదు. ఒకవైపు శాసనసభలో తన బలాన్ని పెంచుకునేందుకు అధికార కాంగ్రెస్‌ శరవేగంగా పావులు కదుపుతూ ఒక్కో ఎమ్మెల్యేను చేర్చుకుంటుండగా, మరోవైపు చేజారిపోతున్న శాసనసభ్యులను కాపాడుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ ఎపిసోడ్లు ఇలా కొనసాగుతుండగా… ఇప్పుడు ఆ రెండు పార్టీల దృష్టి ‘పెద్దల సభ’ అయిన శాసనమండలిపై పడింది. అక్కడ సంఖ్యాబలం రీత్యా 28 మంది సభ్యులున్న బీఆర్‌ఎస్‌ పెద్ద పార్టీగా ఉంది. ఇటీవల గెలిచిన సభ్యుడితో కలిపి కాంగ్రెస్‌కు ఐదుగురు సభ్యులుండగా, ఎమ్‌ఐఎమ్‌కు ఇద్దరు, బీజేపీకి ఒక్క ఎమ్మెల్సీ ఉన్నారు. వీరుగాక ఇద్దరు స్వతంత్ర సభ్యులు (యూటీఎఫ్‌ నుంచి ఒకరు, పీఆర్‌టీయూ నుంచి ఒకరు) ఉన్నారు. గవర్నర్‌ కోటాలో ఇద్దరు సభ్యులను నామినేట్‌ చేయాల్సి ఉండగా… మాజీ గవర్నర్‌ తమిళిసై తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం కావటంతో ఆ రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇవిపోను మొత్తం 38 మంది సభ్యుల్లో బీఆర్‌ఎస్‌ 28 మందితో పెద్ద పార్టీగా ఉంది. ఇది అధికార పార్టీకి తీవ్ర తలనొప్పిగా మారనుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. అందుకే బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేలను లాక్కుంటున్న తరహాలోనే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను పెద్ద సంఖ్యలో చేర్చుకోవాలనే తలంపుతో అధికార పార్టీ ఉంది. అందుకనుగుణంగా సీఎం రేవంత్‌ వడివడిగా అడుగులేస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్సీల ‘చేరికల’ బాధ్యతను శాసనమండలి సభ్యుడైన ఓ సీనియర్‌కు ఆయన ఇప్పటికే అప్పగించినట్టు తెలుస్తోంది. ఆ మేరకు బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్సీలతో చర్చలు కూడా పూర్తి కావటంతో వారు త్వరలోనే హస్తం గూటికి చేరనున్నారని సమాచారం. సాంకేతిక పరమైన సమస్యలు, కోర్టు గొడవలు లేకుండా ఒక్కో సభ్యుణ్ని కాకుండా ఏకంగా శాసనమండలి బీఆర్‌ఎస్‌ పక్షాన్నే కాంగ్రెస్‌లో కలిపేసుకుంటే సరిపోతుందనే భావనలో అధికార పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది.
వాస్తవానికి శాసన మండలిలో పెద్దగా బలం లేకున్నా అధికార పార్టీకి వచ్చే ముప్పేమీ లేదు. కానీ బిల్లుల రూపంలో కాంగ్రెస్‌కు… బీఆర్‌ఎస్‌ నుంచి అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. గత డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే శాసనసభను ప్రభుత్వం సమావేశపరిచింది. ఆ సందర్భంగా అసెంబ్లీలో ఆమోదించిన పలు బిల్లులు మండలి ముందుకు వచ్చాయి. వాటన్నింటినీ పెద్దల సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, మధుసూదనాచారి తదితరులు మాట్లాడుతూ…’సంఖ్యాబలం రీత్యా మేం పెద్దగా ఉన్నా, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కొన్ని బిల్లులపై మాకు భిన్నాభిప్రాయాలున్నా సభ హుందాతనాన్ని కాపాడేందుకు వాటికి అడ్డుపడకుండా ఆమోదిస్తున్నాం…’ అని చెప్పారు. కానీ ఆనాటి పరిస్థితి ఇప్పుడు లేదు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు, పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో అధికార కాంగ్రెస్‌ను అడుగడుగునా ఇరుకున పెట్టాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఇందుకు మండలిని ఉపయోగించుకునేందుకు బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ వ్యూహం పన్నారు. గత డిసెంబరులో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. జులైలో పూర్తి స్థాయి పద్దును ప్రవేశపెట్టాల్సి ఉంది. అప్పుడు అనేక రకాల బిల్లులను ఉభయ సభలూ ఆమోదించాల్సి ఉంటుంది. ఆ సందర్భంలో ప్రధాన ప్రతిపక్షం నుంచి తలనొప్పులు ఎదురవుతాయని ముందుగానే అంచనా వేసిన అధికార పార్టీ… ఎమ్మెల్యేలతోపాటు పనిలో పనిగా ఎమ్మెల్సీలపైనా ‘ఆకర్ష్‌’ను ప్రయోగించబోతోంది.
ఈ ఆకర్షణ మంత్రాన్ని తట్టుకోవడానికి, తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కాపాడుకోవటానికి వీలుగా మాజీ సీఎం కేసీఆర్‌ గత రెండు మూడు రోజులుగా సీనియర్లతో మంతనాలు జరుపుపుతున్నారు. ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో ఆయన వారితో భేటీ అయ్యారు. సోమవారం మాజీ మంత్రి గంగుల కమలాకర్‌తోపాటు కరీంనగర్‌ జిల్లాకు చెందిన పలువురు నేతలతో ఆయన సమావేశమయ్యారు. తాజాగా మంగళవారం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, కేపీ వివేకానంద, అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్‌, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్‌, టి.ప్రకాశ్‌ గౌడ్‌, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, దండె విఠల్‌, తదితరులతో భేటీ అయ్యారు. మాజీ స్పీకర్‌ పోచారంతోపాటు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజరు పార్టీ మారిన విషయంపై కేసీఆర్‌ ఈ సందర్భంగా ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. ‘ఒకరిద్దరు పార్టీ మారినంత మాత్రాన ఎలాంటి నష్టమూ లేదు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల అమల్లో పూర్తిగా విఫలమైంది. అందువల్ల భవిష్యత్‌ అంతా మనదే…’ అంటూ ఆయన వారిలో ధైర్యం నింపేందుకు ప్రయత్నించారు. తద్వారా వారు పార్టీ ఫిరాయించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వినికిడి.

Spread the love