భాద్య‌త‌ల్లోనే కాదు ఆట‌ల్లోనూ రాణిస్తాం

We will excel not only in responsibilities but also in sports.‘ఒకటే గమనం ఒకటే గమ్యం.. గెలుపు పొందె వరకూ అలుపు లేదు మనకు.. బ్రతుకు అంటే గెలుపూ గెలుపు కొరకే బ్రతుకు…. అంటూ సాగే ఈ పాటకు ప్రతిరూపమే ఈ రోజు మనం మాట్లాడుకునేది. పట్టుదలతో ఏ పనిచేసినా అందులో రాణించొచ్చుననే సందేశం ఈ పాటలోని స్ఫూర్తి. మహిళా అధికారులైన మద్దా బేబి సరోజని, సహదేవ సత్యవతిలకు ఇది అచ్చంగా సరిపోతుంది. ఎలాంటి క్రీడానుభవం లేని వీరిద్దరూ తామే సొంతంగా, కోచ్‌లు లేకుండా ప్రాక్టీస్‌చేసి ఆలిండియా స్థాయిలో పోటీల్లో పాల్గొని జయకేతనం ఎగరేశారు. ఓ వైపు కీలకమైన బాధ్యతల్లో విధులు నిర్వహిస్తూ మరోవైపు క్రీడారంగంలో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు గడిస్తున్నారు. ఐదు పదుల వయసులోనూ క్రీడల్లో దూసుకుపోతూ నేటి యువతరానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్న వారి పరిచయం నేటి మానవిలో…
ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో మద్దా బేబి సరోజని మైనార్టీస్‌ విభాగంలో అసిస్టెంట్‌ సెక్రటరీగానూ, సహదేవ సత్యవతి జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌(జిఎడి) విభాగంలో సెక్షన్‌ ఆఫీసర్లుగా కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈనెల 16 నుంచి 20 వరకూ న్యూఢిల్లీలోని త్యాగరాజ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఆలిండియా సివిల్‌ సర్వీసెస్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో వీరిద్దరి జంట మహిళల డబుల్స్‌ వెటరన్‌ విభాగంలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్లో మహారాష్ట్ర జట్టును మట్టి కరిపించింది. వ్యక్తిగత విభాగంలో మద్దా బేబి సరోజిని రెండు కాంస్య పతకాలు సాధించారు. ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం తరపున పతకాలు సాధించిన ఘనత వీరికే దక్కింది.
గతంలోనూ విజయాలు
2018లో సెప్టెంబర్‌ 24 నుంచి 29వ తేదీ వరకు ఢిల్లీలో జరిగిన ఆలిండియా సివిల్‌ సర్వీసెస్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లోనూ వీరిద్దరూ పాల్గొని మధ్యప్రదేశ్‌ క్రీడాకారులపై 3-0 తేడాతో గెలిచి బంగారు పతకాలు సాధించారు. 2018 హర్యానా పంచకూట్‌లో, 2020 పూణేలో నిర్వహించిన ఆలిండియా సివిల్‌ సర్వీసెస్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో బంగారు, వెండి పతకాలు సాధించారు. ఎం.బేబీ సరోజిని వ్యక్తిగత విభాగంలో 2018లో బ్రాంజ్‌మెడల్‌ సాధించారు. ఇప్పటి వరకూ ఎపి సచివాలయం తరపున టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో పాల్గొని బంగారు, వెండి కాంస్య పతకాలు సాధించిన ఘనత వీరికే దక్కింది. ఇప్పటివరకూ వ్యక్తిగతంగా బేబీ సరోజిని మొత్తం 8 పతకాలను కైవసం చేసుకున్నారు. 2018లో కాంస్యం 1, బంగారం 1, 2019లో డబుల్స్‌లో బంగారం, వ్యక్తిగతంగా బంగారం, 2020, 2021, 2022లో డబుల్స్‌లో సిల్వర్‌, 2024లో డబుల్స్‌లో కాంస్య పతకాన్ని అందుకున్నారు. పట్టుదలతో ఎలాంటి కోచింగ్‌ లేకుండా, వారంతట వారే మెళకువళులు నేర్చుకుని ఇతరుల ఆటలను గమనిస్తూ ప్రావీణ్యాన్ని సాధించారు వీరు. మనదేశంలోనే కాకుండా బ్రెజిల్‌, చైనా, స్వీడన్‌ దేశాల్లో జరిగిన వెటరన్‌ టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో పాల్గొనటమే కాకుండా అత్యంత మెరుగైన ప్రతిభ కనబర్చి బహుమతులు సైతం గెలుచుకున్నారు.
కుటుంబాల ప్రోత్సాహం
పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన మద్దా వెంకటేశ్వరరావు, మేరీ విజయకుమారిల దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వారిలో మూడోసంతానం బేబీ సరోజిని. ప్రాథమిక విద్యను కైకరం జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో పూర్తిచేశారు. ఇంటర్‌, డిగ్రీ ఏలూరులోని సెయింట్‌ థెరిస్సా, సెయింట్‌ ఆన్స్‌ కళాశాలల్లో పూర్తిచేశారు. సరోజిని మొదట్లో ఇంటర్మీడియట్‌ బోర్డులో పనిచేశారు. ఆ తర్వాత గ్రూప్‌ 2 ద్వారా హైదరాబాద్‌ సెక్రటేరియట్‌లో ఉద్యోగాన్ని సాధించారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని వెలగపూడి సచివాలయ అధికారిగా వచ్చారు. భర్త ధర్మారావు స్కూల్‌ ఎడ్యుకేషన్‌లో డిప్యూటీ సెక్రటరీగా పనిచేసి 2024లో జులైలో ఉద్యోగ విరమణ పొందారు. భర్త, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో బేబీ సరోజిని వెటరన్‌ క్రీడాకారిణిగా రాణిస్తున్నారు. ఆమె పతకాలు సాధించినప్పుడల్లా తల్లిదండ్రులు, సోదరులు కుమార్‌శేఖర్‌, రాజారత్నం, సోదరి స్వర్ణలత ఎంతో సంతోషపడేవారు. ఏలూరులో ఓ మధ్యతరగతి కుటుంబంలో సహదేవ సుధాకరరావు, భారతి దంపతులకు మొదటి సంతానంగా సత్యవతి పుట్టారు. డిగ్రీ తర్వాత పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న రాయుడు శివశంకరవరప్రసాద్‌తో వివాహమైంది. ఆయన ప్రోత్సాహంతో ఎపిపిఎస్‌సి గ్రూప్‌ 2బి పరీక్ష రాసి 1996లో అప్పటి ఎపి సెక్రటేరియట్‌లో టైపిస్ట్‌ కమ్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగ బాధ్యతల్లో చేరారు. అదే బ్యాచ్‌లో బేబీ సరోజిని కూడా ఉద్యోగంలో చేరారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఇరు కుటుంబాలు ఎంతో అన్యోన్యంగా ఉంటాయి. 2002లో ఎఎస్‌ఒ (అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌)గా ఉద్యోగోన్నతి వచ్చిన తర్వాత వీరు ఒక రోజు సరదాగా ప్రారంభించిన టేబుల్‌ టెన్నిస్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు.
స్నేహమేరా జీవితం..
ఇంటర్‌ నుంచి డిగ్రీ వరకూ వీరిద్దరూ ఒకే కళాశాలలో చదువుకున్నారు. అయినా ఉద్యోగాలు వచ్చిన తర్వాతనే మంచి స్నేహితులయ్యారు. 2005 నుంచి సరదాగా టేబుల్‌ టెన్నిస్‌ ప్రాక్టీస్‌ చేశారు. అప్పటి నుంచి రోజూ ఆడుతూనే ఉన్నారు. ఈ ఆటలో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించారు. వెటరన్‌ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడలు ఎక్కడ జరిగినా అక్కడికి వెళ్లి పోటీల్లో పాల్గొనేవారు. కుటుంబాల నుండి ప్రోత్సాహం ఉండడంతో ఏ మాత్రం ఇబ్బంది పడకుండా తీరిక సమయాల్లో టిటిని, పోటీలు పెట్టినప్పుడు వాటిలో పాల్గొంటున్నారు. తద్వారా ఆత్మ విశ్వాసం పెరిగింది. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో కూడా పాల్గొని ద్వారా బంగారు, వెండి పతకాలను సైతం కైవసం చేసుకుంటున్నారు.
ఉద్యోగానికి న్యాయం చేస్తూనే…
మంత్రి వర్గ సమావేశాలు ఉన్నా, ఇతరత్రా శాఖల వారీగా సమావేశాలు ఉంటే వీరిద్దరూ అర్థరాత్రి 1 గంట వరకు ఉండి పనిచేయాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లోనూ పని చేసేందుకు వెనకడుగు వేయరు. బాధ్యతగా తమ విధులు నిర్వహిస్తారు. ఆయా సమావేశాలకు అవసరమైన సమాచారం, ఇతర రిపోర్టులు చక్కగా తయారుచేసి అందజేస్తుంటారు. ఏ పని అప్పగించినా చక చకా చేసేస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో కీలకంగా ఉంటూ క్రీడల్లో రాణిస్తున్న వీరిద్దరిని పలువురు ప్రశంసిస్తున్నారు.
సిఎం, సిఎస్‌ అభినందనలు
జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ పేరుప్రఖ్యాతులు నిలపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, సిఎస్‌ దేవానంద్‌ తదితరులు వీరిద్దరినీ అభినందించారు. నైపుణ్యమైన క్రీడాకారుల నుంచి పోటీని తట్టుకుని విజయకేతనం ఎగరేయటం మంచి శుభపరిణామమని వారు పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచి క్రీడల్లో ప్రవేశం ఉండి, స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు పొందిన వారితో పోరాడి గెలుపొందటం అంత ఆషామాషీ విషయం కాదని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
– యడవల్లి శ్రీనివాసరావు

Spread the love