దక్షిణాదినే కాదు..

దక్షిణాదినే కాదు..– ఉత్తరాన కూడా మోడీ ఉత్తరకుమారుడే… బీజేపీకి 400 కాదు.. 230 సీట్లు దాటవు
– బీఆర్‌ఎస్‌కు 10 నుంచి 12 సీట్లివ్వండి
– ఏపీలో జగన్‌ గెలవబోతున్నారు : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దక్షిణాదినేకాదు.. ఉత్తర భారతంలో కూడా ఈసారి ప్రధాని మోడీ ఉత్తరకుమారుడే కాబోతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ప్రతీ ఇంటికీ మంచి నీళ్లు, బుల్లెట్‌ ట్రైన్‌, ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతీ ఒక్కరికి ఇల్లు… ఇలా అనేక హామీలను గుప్పించిన మోడీ, వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను అమలు చేయని ప్రధాని.. తెలంగాణకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలను రెట్టింపు చేసిన ఘనుడాయన అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆవిర్భావం గురించి రకరకాల వ్యాఖ్యలు చేసిన మోడీ… ఆ రకంగా రాష్ట్ర ప్రజలను అవమానించారని వాపోయారు. పరిస్థితి ఇలా ఉంటే… లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు వస్తాయంటూ బీజేపీ నేతలు ఊదరగొడుతున్నారనీ, కానీ ఆ పార్టీ 230 స్థానాలు కూడా దాటబోదని తెలిపారు. ఇక్కడ రాష్ట్రంలో సీఎం రేవంత్‌ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామంటూ మోసం పార్ట్‌-1కు రూపకల్పన చేశారని విమర్శించారు. ఇప్పుడు ఆగస్టులో రైతు రుణమాఫీ, దేవుళ్లపై ఒట్టు అంటూ మోసం పార్ట్‌-2కి తెర తీశారని దుయ్యబట్టారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ రుణమాఫీ చేయబోరని అన్నారు. దీంతోపాటు లోక్‌సభ ఎన్నికల తర్వాత ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ కూడా రద్దవుతుందని హెచ్చరించారు.
బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ పాత్రికేయులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలోని కాంగ్రెస్‌, కేంద్రంలోని బీజేపీ విధానాలను తూర్పారబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్‌, ప్రధాని మోడీ అనుసరిస్తున్న తీరుపై విమర్శలు గుప్పించారు. సీఎం ఎవరి నాయకత్వంలో పని చేస్తున్నారు..? రాహుల్‌ గాంధీ నాయకత్వంలోనా..? లేక మోడీ నాయకత్వంలోనా..? అని ప్రశ్నించారు. అదానీతో ఒప్పందాలు, లిక్కర్‌ కేసు తదితర విషయాల్లో కాంగ్రెస్‌ అగ్రనేతల వైఖరికి, సీఎం రేవంత్‌ మాట్లాడుతున్న మాటలకు ఎక్కడా పొంతన లేకుండా పోతోందని విమర్శించారు. రేవంత్‌కు తన సొంత జిల్లాలోని ఎంపీ సీట్లు గెలిపించుకోవటం కూడా కష్టంగా మారిందనీ, అందువల్లే ఆయన అక్కడి బాధ్యతల నుంచి తప్పుకున్నారని వ్యాఖ్యానించారు. వరికి రూ.500 బోనస్‌, రూ.4 వేల పింఛన్‌, వ్యవసాయ కూలీలకు రూ.12 వేల ఆర్థిక సాయం, కౌలు రైతులకూ రైతు భరోసా, విద్యార్థినిలకు స్కూటీలు, నిరుద్యోగ భృతి తదితర హామీల్లో కాంగ్రెస్‌ ఏ ఒక్కటీ అమలు చేయలేదని చెప్పారు. సీఎం రేవంత్‌ ఎన్నికలకు ముందు అభయహస్తం, ఆ తర్వాత భస్మాసుర హస్తం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసి మోసపోయామని ప్రజలు భావిస్తున్నారనీ, అందువల్ల ఇప్పుడు మరోసారి మోసపోవద్దని సూచించారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి 10 నుంచి 12 సీట్లివ్వాలని ప్రజలను అభ్యర్థించారు. అలా గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తామని తెలిపారు.
కేంద్రంలో కాంగ్రెస్‌ వచ్చేది లేదు.. సచ్చేది లేదంటూ కేటీఆర్‌ ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. బీజేపీని అడ్డుకునే సత్తా, సరుకు ఆ పార్టీకి లేదన్నారు. ప్రాంతీయ పార్టీలే బీజేపీకి అడ్డుకట్ట వేయగలవని తెలిపారు. తమ అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ గెలవబోతున్నారని చెప్పారు. కాషాయ పార్టీ ధాటికి తట్టుకోలేకే రాహుల్‌ గాంధీ కేరళకు పారిపోయారని ఎద్దేవా చేశారు. ఇక్కడ సీఎం రేవంత్‌ కూడా బీజేపీలో చేరబోతున్నారనీ, తాను 20 సార్లు ఈ మాట మాట్లాడినా.. రేవంత్‌ స్పందించటం లేదని గుర్తు చేశారు. ఈ రకంగా కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కై బీఆర్‌ఎస్‌ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆ రెండు పార్టీలు ఒకరికి ఒకరు సహకరించుకునేందుకు వీలుగా డమ్మీ అభ్యర్థులను నిలబెట్టాయని దుయ్యబట్టారు. అందువల్ల చోటా భారు (రేవంత్‌), బడా భారు (మోడీ) ఇద్దరికీ జనం బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. లోక్‌సభ అభ్యర్థుల విషయంలో తమ పార్టీ సమతూకాన్ని, సామాజిక న్యాయాన్ని పాటించిందని తెలిపారు. కానీ కాంగ్రెస్‌, బీజేపీలు ఆ పని చేయలేకపో యాయని విమర్శించారు. కేసీఆర్‌తో మొదటి నుంచి కలిసున్న సీనియర్లు, ఉద్యమకాలం నుంచి పార్టీని అంటి పెట్టుకుని ఉన్న నాయకులతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సీట్లను కేటాయించటం ద్వారా అన్ని వర్గాలకు న్యాయం చేశామని అన్నారు.
సీనియర్‌ నేత కడియం శ్రీహరి బీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు చేసిన ద్రోహం మామూలుది కాదని కేటీఆర్‌ ఈ సందర్భంగా విమర్శించారు. ఆయన చర్యలు వరంగల్‌ ప్రజల మనసులను సైతం బాధించాయని తెలిపారు. అక్కడ కడియం కావ్య మూడో స్థానానికే పరిమితమవుతున్నారని చెప్పారు. ప్రభుత్వ అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణాన్ని తీసేసిన సీఎం రేవంత్‌… వరంగల్‌ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. హామీల అమలు విషయంలో తమ నేత హరీశ్‌రావు సవాల్‌కు సీఎం స్పందించాలని కోరారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే తమ ఎమ్మెల్యే మల్లారెడ్డి…బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను మునగచెట్టు ఎక్కించారని కేటీఆర్‌ వెనుకేసుకొచ్చారు. ఆయన మాటల్లోని అంతరార్థం తెలియక చాలా మంది ఆగమైపోతున్నారని చమత్కరించారు.
మల్కాజిగిరిలో బీఆర్‌ఎస్సే గెలవబోతోందని చెప్పారు. కొంతమంది నాయకులు తమ స్వార్థం కోసం పార్టీని వీడారనీ, వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ను వీడిన కేకే, రంజిత్‌రెడ్డి పరిస్థితి ఇప్పుడెలా ఉందో అందరికీ తెలుసునని అన్నారు. బీఆర్‌ఎస్‌లో ఉన్న గౌరవం ఇప్పుడు బీజేపీలో తనకు దక్కటం లేదంటూ ఈటల అనేక మందితో చెప్పారని తెలిపారు. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారే అసలైన లీడర్లంటూ వ్యాఖ్యానించారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని ఓడించేందుకు ఎక్కువగా కష్టపడతామని హెచ్చరించారు.
లోక్‌సభ ఎన్నికల తర్వాత పార్టీ నిర్మాణంపై దృష్టి సారిస్తామని కేటీఆర్‌ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గతంలో ఎన్టీఆర్‌ భారతదేశం అనే పార్టీ పెట్టాలని భావించారనీ, ఇప్పుడు ఆయన శిష్యుడు కేసీఆర్‌ భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం కోసం ప్రయత్నిస్తున్నామని వివరించారు.

Spread the love