రాముడిని మొక్కాలి..బీజేపీని తొక్కాలి

Rama should be planted..BJP should be trampled– వందరోజుల అబద్ధం..పదేండ్ల అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలి
– చేవెళ్ల గడ్డపై బీసీకి మొదటిసారి అవకాశం వచ్చింది
– చేవెళ్ల బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌
– నామినేషన్‌ కార్యక్రమంలో కేటీఆర్‌
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రాముడు.. బీజేపీ, మోడీ సొత్తు కాదని.. అందరివాడని, బీజేపీ ఓడిపోతే రాముడికి ఏమీ కాదని, శ్రీ రాముడిని మొక్కాలి.. బీజేపీని తొక్కాలని.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి జ్ఞానేశ్వర్‌.. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, గాంధీ, ప్రకాశ్‌గౌడ్‌తో నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్నర్‌ మీటింగ్‌లో కేటీఆర్‌ పాల్గొని మాట్లాడారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలు వందరోజుల కాంగ్రెస్‌ అబద్ధపు పాలనను.. పదేండ్ల బీఆర్‌ఎస్‌ అభివృద్ధి పాలన చూసి ఓట్లు వేయాలన్నారు. అరచేతిలో వైకుంఠం చూపి గద్దెనెక్కిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని చెప్పారు. ఆడబిడ్డలకు ఇస్తామన్న రూ. 2500 ఇవ్వలేదని, ఆసరా పథకం కింద రూ. 4 వేలు, రైతు పంటలకు బోనస్‌ ఇవ్వని కాంగ్రెస్‌కు ఎందుకు ఓట్టెయ్యాలని ప్రశ్నించారు. ఇక, కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యుడి జీవన స్థితిగతి దిగజారిందన్నారు. చమురు ధరలు అంతర్జాతీయంగా తగ్గినప్పటికీ దేశంలో మాత్రం విపరీతంగా పెంచారని తెలిపారు. పదేండ్ల కాలంలో బీజేపీ తెలంగాణ ప్రాంతానికి చేసిందేమీ లేదని, పైగా మతాన్ని అడ్డుపెట్టుకుని ఓట్లు దండుకోవడానికి కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీని గద్దెదించడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ను గెలిపించాలన్నారు. చేవెళ్లలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ బీసీల బహుబలి అని, ఉమ్మడి రాష్ట్రంలో 93 బీసీ కులాలను ఏకం చేసి వారి అభ్యన్నతికి పాటుపడ్డారని గుర్తుచేశారు. చేవెళ్ల పార్లమెంట్‌లో ఇప్పటి వరకు బీసీ అభ్యర్థికి ఎవ్వరూ అవకాశం ఇవ్వలేదని, ఇప్పుడు ఆ అవకాశం వచ్చిందని, బహుజన రాజ్యధికారం అనే నినాదాన్ని నిలబెట్టేందుకు బహుజనులంతా ఏకమై కాసానిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love